వేపాకులతో ఎన్నో లాభాలు ఉన్నాయి. కానీ చాలా మందికి ఆ విషయం తెలియక పెరట్లోనే ఉన్న వేప ఆకులను పూర్తి స్థాయిలో ఉపయోగించుకోరు.ఆ ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం. 

గాయాలను నయం చేసే దివ్య ఔషధంగా వేపాకు పనిచేస్తుంది. వేపాకుల నుంచి పేస్ట్ తయారు చేసి గాయాలపై రుద్దితే యాంటిసెప్టిక్‌గా పనిచేస్తుంది.

వేపాకులను నీటిలో ఉడకబెట్టిన తర్వాత.. ఆ నీరు పచ్చగా మారిన అనంతరం.. నీటిని చల్లార్చి జుట్టును శుభ్రపరచండి. జుట్టులో ఉన్న చుండ్రు తగ్గుముఖం పడుతుంది. 

కొన్ని వేప ఆకులను నీటిలో ఉడకబెట్టి, ఆ నీటిని పూర్తిగా చల్లబరచండి. ఆ తర్వాత ఆ చల్లటి నీళ్లతో కళ్ళు శుభ్రంగా కడుక్కుంటే.. సాధారణ కంటి సమస్యలకు ఉపశమనం లభిస్తుంది. 

మొటిమలకు వేపాకు మంచి చికిత్సలా పనిచేస్తుంది. వేపాకును పేస్ట్‌ చేసి మొటిమలపై పూస్తే అవి తగ్గిపోతాయి. 

చెవి కురుపులకు చెక్ పెట్టొచ్చు. కొన్ని వేప ఆకులను ద్రవ రూపంలో ఒక మిశ్రమంలా చేసి అందులో కొంత తేనె కలపండి. చెవిని ఇబ్బంది పెడుతున్న కురుపులపై ఆ మిశ్రమం నుంచి తీసిన కొన్ని చుక్కలను వేస్తే నొప్పి మాయం అవుతుందట. 

పసుపును వేపాకుల మిశ్రమంతో కలిపి దురద, తామరతో పాటు ఇతర సాధారణ చర్మ సంబంధిత వ్యాధులకు కూడా ఉపయోగించుకోవచ్చు. 

వేపాకులను చూర్ణం చేసి ఒక గ్లాసు నీటిలో కలిపి తీసుకుంటే అది రోగ నిరోధక శక్తిని  పెంచుతుంది.