దశాబ్దాల క్రితం వచ్చిన ‘పుష్పక విమానం’ వంటి మూకీ చిత్రాల మ్యాజిక్‌ను నేటి తరం ప్రేక్షకులకు పరిచయం చేస్తూ, దర్శకుడు కిశోర్ పాండురంగ్ తెరకెక్కించిన ప్రయోగాత్మక చిత్రం ‘గాంధీ టాక్స్’ (Gandhi Talks). విజయ్ సేతుపతి, అరవింద్ స్వామి, అదితి రావ్ హైదరీ కీలక పాత్రలు పోషించిన ఈ ‘గాంధీ టాక్స్’ మహాత్మా గాంధీ వర్థంతి సందర్భంగా జనవరి 30న ఈ సినిమా దేశ వ్యాప్తంగా విడుదలైంది. విజయ్ సేతుపతి, అరవింద్ స్వామి వంటి హేమాహేమీలు మాటలు లేకుండా కేవలం హావభావాలతో మెప్పించిన ఈ సినిమా రివ్యూ ఇప్పుడు చూద్దాం
గాంధీ టాక్స్ కథ:
ముంబైలోని ధారావిలో నివసించే మహాదేవ్ విష్ణు (విజయ్ సేతుపతి) ఒక నిరుద్యోగి. మున్సిపాలిటీలో ఉద్యోగం కోసం లంచం ఇవ్వాల్సి రావడం, తల్లి అనారోగ్యం, ప్రేయసి (అదితి రావు హైదరీ)తో పెళ్లి.. ఇలాంటి సమస్యల సుడిగుండంలో చిక్కుకుంటాడు. మరోవైపు, ఒకప్పుడు బిజినెస్ టైకూన్‌గా వెలిగి, అప్పుల ఊబిలో కూరుకుపోయిన బోస్‌మన్ (అరవింద్ స్వామి)ది కథ. డబ్బు ఈ రెండు విభిన్న ధ్రువాల్లాంటి వ్యక్తుల జీవితాలను ఎలా కలిపింది? ఆ క్రమంలో వారు ఎదుర్కొన్న సమస్యలు ఏమిటి? అనేదే ఈ సినిమా కధ.
విశ్లేషణ:
తాను సృష్టించిన డబ్బు మనిషిని ఎలా ఆడిస్తుంది, సమాజంలోని ఆర్థిక అసమానతలు, అవినీతి వంటి అంశాలను దర్శకుడు డార్క్ కామెడీ కోణంలో ఆవిష్కరించారు. మాటలు లేకపోయినా హావభావాలతో కథను నడిపించడంలో దర్శకుడు విజయం సాధించారు, ముఖ్యంగా ఆర్థిక అసమానతలు, అవినీతిని సున్నితంగా స్పృశించారు. ఈ సినిమాకు ప్రాణం పోసింది ఏఆర్ రెహమాన్ సంగీతం, డైలాగ్స్ లేని లోటును ఆయన తన నేపథ్య సంగీతంతో భర్తీ చేస్తూ, ప్రేక్షకుడు భావోద్వేగాలకు లోనయ్యేలా చేశారు. ప్రథమార్ధం అంతా పాత్రల పరిచయం, విజయ్ సేతుపతి పేదరికం, అదితితో ప్రేమకథతో సినిమా ఆసక్తికరంగా మొదలవుతుంది. పెళ్లిచూపుల సీన్, కోర్టు సీన్ వంటివి మెప్పిస్తాయి. ఇక సెకండ్ హాఫ్ మొత్తం అరవింద్ స్వామి ఇంట్లోనే జరగడం వల్ల కథ కొంత సాగదీసినట్లు అనిపిస్తుంది. స్క్రీన్ ప్లే లో వేగం తగ్గి, కథ ఒకే చోట తిరుగుతున్న భావన కలుగుతుంది. క్లైమాక్స్ మాత్రం సందేశాత్మకంగా ఉండి ఆలోచింపజేస్తుంది. ఒక్క సీన్ బోర్ కొట్టినా సెకన్లలో ఫోన్లలో మునిగిపోయే ఆడియన్స్ తయారైన ఈ కాలంలో మూకీ సినిమా తీయాలనే దర్శకుడి సాహసాన్ని మెచ్చుకోవాలి. ముఖ్యంగా గాంధీ అంటే కేవలం ‘నోటు’ మీద బొమ్మ మాత్రమే అన్న నేటి సమాజ వైఖరిని సున్నితంగా ఎత్తిచూపారు.
నటన విషయానికి వస్తే విజయ్ సేతుపతి తన సహజ సిద్ధమైన నటనతో ఆకట్టుకోగా, అరవింద్ స్వామి ఒక బడా వ్యాపారవేత్త పతనాన్ని తన కళ్లలోనే చూపించారు. అదితి రావు హైదరీ తన పాత్ర పరిధి మేరకు మెప్పించింది. సిద్ధార్థ్ జాదవ్ దొంగ పాత్రలో అక్కడక్కడా నవ్విస్తారు. మహేష్ మంజ్రేకర్, జరీనా వహబ్ తమ వంతు న్యాయం చేశారు. నిజానికి ఇది ఒక అరుదైన ప్రయోగం. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు భిన్నంగా, కొత్తదనాన్ని కోరుకునే ప్రేక్షకులకు ఇది ఒక మంచి ఫీల్ ఇచ్చే సినిమా. సాగదీత సీన్లు ఉన్నప్పటికీ, నటీనటుల పెర్ఫార్మెన్స్, సంగీతం కోసం ఈ సినిమాను ఒకసారి చూడొచ్చు.
చివరిగా: ఈ గాంధీ టాక్స్ నిశ్శబ్ద సందేశం