Mallu Bhatti Vikramarka Fires on BJP Over ED Investigation: మనీలాండరింగ్ కేసులో సోనియా గాంధీని గురువారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారించిన నేపథ్యంలో కాంగ్రెస్ శ్రేణులు మండిపడుతున్నాయి. తాజాగా ఎమ్మల్యే భట్టి విక్రమార్క బీజేపీపై విరుచుకుపడ్డారు. కక్ష పూరితంగానే కాంగ్రెస్ పార్టీపై బీజేపీ తప్పుడు కేసులు పెడుతోందని ఆగ్రహించారు. వేధించడంలో భాగంగా ఈడీ నోటీసులు జారీ చేయిస్తున్నారని మండిపడ్డారు. సంబంధం లేని విషయాల్లో విచారణకు పిలవడమేంటి? అని ఆయన ప్రశ్నించారు.
ఈడీ, సీబీఐలను వినియోగించి.. ప్రతిపక్షాలపై బీజేపీ దాడులు చేయిస్తోందని, ఇందుకు నిరసనగానే ఆందోళన చేస్తున్నామని భట్టి విక్రమార్క అన్నారు. కాంగ్రెస్ పేపర్‌పైనే కాంగ్రెస్‌కి ఈడీ విచారణ బీజేపీ అంటోందని, భయబ్రాంతులకు గురి చేయాలనే ఈ కుట్రలు పన్నుతోందని విమర్శించారు. సభ జరుగుతున్న సమయంలో పార్లమెంట్‌లో సభ్యుల్ని ఈడీ విచారణకు పిలిపించిందని.. ఇవాళ సోనియాగాంధీని, రేపు ప్రతిపక్ష సభ్యులకు ఈడీ నోటీసులు రావడం తథ్యమని వ్యాఖ్యానించారు. బీజేపీ పాలన మత ఘర్షణల్ని పెంచేలా జరుగుతోందని, బీజేపీ కుట్రల్ని గమనించండంటూ ప్రతిపక్షాలకు భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. ఈడీతో భయపడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.