MLC Jeevan Reddy Fires ON PM Narendra Modi: ఈడీల పేరుతో మోడీ ప్రభుత్వం కాంగ్రెస్‌ను తీవ్ర ఇబ్బందులు పెడుతోందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మండిపడ్డారు. రాహుల్ గాంధీ భారత్ జోడోయాత్ర చేస్తున్న సందర్భంగా.. మానసిక ఒత్తిడికి గురి చేస్తోందని ఆగ్రహించారు. సోనియా గాంధీకి ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే కాదు.. యావత్ జాతి అండగా ఉంటుందని చెప్పారు. యంగ్ ఇండియా సంస్థను వ్యాపార దృష్ట్యా ఏర్పాటు చేయలేదని.. సేవా దృక్పథంతోనే దాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని.. అందులో ఎలాంటి మనీలాండరింగ్ జరగలేదని జీవన్ రెడ్డి వివరించారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రకటిస్తే, ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ ఉనికి ప్రశ్నార్థకంగా మారుతుందని తెలిసినప్పటికీ.. తెలంగాణ ఏర్పాటుకు సోనియా రాజకీయ నిర్ణయం తీసుకున్నారని జీవన్ రెడ్డి వెల్లడించారు. అంతేకాదు.. పేదవాడికి పట్టెడన్నం పెట్టే విధంగా ఆహారభద్రత చట్టాన్నీ తెచ్చారని, అలాగే రైతు కూలీలకు ఉపాధి హామీ తీసుకొచ్చారని అన్నారు. దేశం మొత్తానికి ప్రధాన బాధ్యత తెలంగాణపైనే ఉందన్నారు. తెలంగాణ ఇచ్చిన ఆ మహాతల్లికి ఈ రాష్ట్రం ఎప్పుడూ అండగా ఉంటుందని, ఈడీ విచారణ పూర్తయ్యేంతవరకూ వివిధ రూపాల్లో కాంగ్రెస్ పార్టీ నిరసన తెలుపుతూనే ఉంటుందని జీవన్ రెడ్డి పేర్కొన్నారు.
ఇదిలావుండగా.. నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో సోనియా గాంధీని ఈడీ గురువారం మూడు గంటల పాటు ప్రశ్నించింది. ఈ విచారణ సమయంలో రాహుల్, ప్రియాంకా గాంధీలు ఈడీ ఆఫీసులోనే ఉన్నారు. గతంలోనే విచారణకు హాజరు కావాల్సిందిగా ఈడీ ఆదేశించినా, కరోనా బారిన పడడంతో సోనియా హాజరు కాలేదు. అడిషనల్ డైరెక్టర్ హోదా కలిగిన మహాళా అధికారి నేతృత్వంలో ఐదుగురు అధికారులు సోనియా గాంధీని ప్రశ్నించారు. ఈ క్రమంలో ఆమెకు 50 ప్రశ్నలు సంధించినట్లు తెలిసింది.