హైదరాబాద్ నగర శివారు ప్రాంతాల్లో కూడా భారీగా వర్షం కురుస్తోంది. బాటసింగారం పండ్ల మార్కెట్‌లో వర్షం బీభత్సం సృష్టించింది. మార్కెట్‌లోని దుకాణాలన్నీ తడిసిముద్దయ్యాయి. మార్కెట్ ప్రాంగణంలో నిల్వ ఉంచిన పండ్లన్నీ తడిసిపోయాయి. భారీ వర్షం వల్ల మార్కెట్‌లోకి ప్రవాహం దూసుకొచ్చింది. బత్తాయితో పాటు వివిధ రకాల పండ్లు వర్షం నీటిలో కొట్టుకుపోవడంతో వాటిని కాపాడుకునేందుకు వ్యాపారులు, సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
కాళేశ్వరం పంప్ హౌజ్‌ల ముంపుకు కేసీఆర్ బాధ్యత వహించాలని భాజపా నేత, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ చెప్పారు. కాళేశ్వరం వచ్చి కన్నీళ్లు తెచ్చింది అని రైతులు ఏడుస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నీటిపారుదల శాఖకు మంత్రి లేకపోవడం, సీజన్‌లో అధికారులు విదేశీ పర్యటనకు వెళ్లడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని ఈటల విమర్శించారు.
నిజామాబాద్‌లో ఉగ్రవాదుల లింకులు కలకలం రేపుతున్నాయి. నిషేధిత సిమీ అనుబంధ సంస్థ 'పీఎఫ్‌ఐ' కరాటే ట్రైనింగ్ పేరుతో ఉగ్రకార్యకలాపాలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ట్రైనింగ్ పేరిట పీఎఫ్ఐ మత ఘర్షణల కుట్రకు తెరలేపిందని పోలీసులు నిర్ధారించారు. 28 మంది నిందితులను గుర్తించి నిజామాబాద్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
కేసీఆరే ఇంజినీర్, డాక్టర్, మేధావి అని కాంగ్రెస్ సీనియర్ నేత మధుయాస్కీ ఎద్దేవా చేశారు. కేసీఆర్ రాత్రి మెలకువగా ఉండి ఎవర్ని కుట్రలతో మోసం చేయాలనే ఆలోచిస్తారని.. కేసీఆర్ బాల్యమంతా దొంగతనాలతోనే గడిచిందని ఆయన ఆరోపించారు.
బ్యాంక్ ఆఫ్ బరోడా 114 సంవత్సరాలు పూర్తి చేసుకుని 115వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్న శుభసందర్భంగా బ్యాంకు స్ట్రీట్ శాఖ పలు సేవా కార్యక్రమాలు చేపట్టింది. ఇందులో భాగంగా ఈ రోజు మౌలాలిలో గల షాలోమ్ వృద్ధుల ఆశ్రమానికి రూ.25 వేల నిలువ గల వాషింగ్ మెషీన్‌ను బ్యాంకు సిబ్బంది అందజేశారు.
కరీంనగర్ కలెక్టరేట్ ఎదురుగా వీఆర్ఏల ఆందోళనకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ మద్దతు ప్రకటించారు. వీఆర్ఏల ఆందోళన న్యాయబద్ధమైనదని.. వారికి ప్రభుత్వం తక్షణమే పే స్కేల్, ప్రమోషన్ ఇవ్వాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు.
గిరిజన బిడ్డగా చొరవచూపి గిరిజనుల రిజర్వేషన్ల కోసం కేంద్రాన్ని ఒప్పించాలని మంత్రి కేటీఆర్ ద్రౌపది ముర్మును కోరారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో పర్యటించిన మంత్రి కేటీఆర్.. రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపది ముర్ముకు శుభాకాంక్షలు తెలియజేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లు పాస్ చేయించాలని రాష్ట్రపతి ద్రౌపదీముర్ముకు విజ్ఞప్తి చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా అర్హతకు తగినది కాదని కేంద్రం స్పష్టం చేసిందని కాంగ్రెస్ సీనియర్ నేత, నల్గొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు. బీజేపీ, టీఆర్‌ఎస్‌లు పొలిటికల్ డ్రామాలు చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు.