శ్రీ కృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా ఆలయాల్లో పూజలు ఘనంగా జరుగుతున్నాయి. గురువారం సాయంత్రం జన్మాష్టమి వేడుకలు ప్రారంభం కావడంతో మధురలోని ఆలయాలకు భక్తులు పోటెత్తారు. నగరంలోని ఆలయాలను రంగురంగుల దీపాలతో అలంకరించారు.
ఏఐఏడీఎంకే నేత ఇ.పళనిస్వామికి మద్రాసు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఆయన నియామకం చెల్లదని హైకోర్టు ఇవాళ తీర్పునిచ్చింది. పళనిస్వామితో తీవ్ర అధికార పోరులో చిక్కుకున్న ఓ పన్నీర్‌సెల్వంకు ఈ తీర్పు తీపికబురుగా మారింది. పార్టీ నాయకత్వం విషయంలో జూన్ 23కి ముందు ఉన్న స్థితిని కొనసాగించాలని న్యాయస్థానం ఆదేశించింది.
మహారాష్ట్రలోని గోండియాలో ఘోర ప్రమాదం జరిగింది. బుధవారం తెల్లవారుజామున ప్యాసింజర్ రైలు మూడు బోగీలు పట్టాలు తప్పడంతో 50 మందికి పైగా గాయపడ్డారు. గూడ్స్ రైలును ప్యాసింజర్ రైలు ఢీకొనడంతో తెల్లవారుజామున 2.30 గంటలకు జరిగిన ఈ ఘటనలో ఎలాంటి మరణాలు సంభవించలేదు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాని మాటలను కూడా వక్రీకరించారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఆరోపించారు. ప్రజలకు కేసీఆర్ అన్నీ అబద్ధాలే చెబుతున్నారన్నారు. కేసీఆర్‌కు ఎప్పుడూ రాజకీయం తప్పితే వేరే ధ్యాస లేదన్నారు.
ఆర్థిక నేరగాడు సుకేష్ చంద్రశేఖర్ ప్రధాని నిందితుడిగా ఉన్న మనీలాండరింగ్ కేసులో బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నిందితురాలిగా పేర్కొంది. ఈ మేరకు ఈ కేసులో దాఖలు చేసిన అనుబంధ ఛార్జ్‌షీట్‌లో ఆమె పేరును చేర్చింది.
ఆగస్టు 21న మునుగోడులో బీజేపీ బహిరంగ సభ జరగనుందని తెలంగాణ బీజేపీ వ్యవహారాల ఇంఛార్జి తరుణ్ చుగ్ వెల్లడించారు. ఈ సభకు కేంద్ర మంత్రి అమిత్ షా హాజరవుతారని తెలిపారు. కేసీఆర్ పాలనలో జరుగుతున్న అన్యాయాలపై మాట్లాడుతారన్నారు.
తెలంగాణ భవన్‌లో స్వాత్రంత్య వజ్రోత్సవాల సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కేశవరావు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. పలువురు టీఆర్‌ఎస్ కార్యకర్తలు రక్తదానం చేశారు.
మునుగోడు కాంగ్రెస్ అడ్డా అని.. అక్కడ హస్తం పార్టీదే గెలుపు అని కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి ధీమా వ్యక్తం చేశారు. మునుగోడు ప్రచారానికి వెళ్తానని ఆమె ప్రకటించారు. పెళ్లి కాదు.. పిలిస్తేనే వెళ్లాలి అనడానికి తప్పకుండా వెళ్లి కాంగ్రెస్‌ను గెలిపించుకుంటామన్నారు.