Janmashtami 2022: శ్రీ కృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా ఆలయాల్లో పూజలు ఘనంగా జరుగుతున్నాయి. గురువారం సాయంత్రం జన్మాష్టమి వేడుకలు ప్రారంభం కావడంతో మధురలోని ఆలయాలకు భక్తులు పోటెత్తారు. నగరంలోని ఆలయాలను రంగురంగుల దీపాలతో అలంకరించారు. “జై శ్రీకృష్ణ” నినాదాలు నగరమంతా మారుమోగుతున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న కృష్ణ దేవాలయాల్లోనూ ఇదే భక్తిభావం వెల్లివిరుస్తోంది. ముంబైలోని ఇస్కాన్ దేవాలయం వద్ద స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు గుమిగూడారు. నోయిడాలోని ఇస్కాన్ దేవాలయం వద్ద, ఉదయం హారతి సంగ్రహావలోకనం పొందడానికి ప్రజలు భారీగా తరలివచ్చారు. కేరళలోని కోజికోడ్‌లో కృష్ణ జన్మాష్టమి సందర్భంగా చేపట్టిన ఊరేగింపులో చిన్నారులతో పాటు భక్తులు పాల్గొన్నారు.తెలుగు రాష్ట్రాల్లోనూ భక్తులు ఆలయాలకు పోటెత్తుతున్నారు. ప్రత్యేక అలంకరణల నడుమ రాధా కృష్ణులు.. భక్తులకు దర్శనమిస్తున్నారు.
ఇదిలా ఉండగా, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జన్మాష్టమి సందర్భంగా దేశప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. “మన ఆలోచనలు, మాటలు, చర్యలలో ధర్మం యొక్క మార్గాన్ని అనుసరించడానికి జన్మాష్టమి అందరీ ప్రేరేపించాలని రాష్ట్రపతి ప్రార్థించారు. శ్రీకృష్ణుడి జీవితం, బోధనలలో శ్రేయస్సు, ధర్మం అనే సందేశం ఉందని రాష్ట్రపతి తన సందేశంలో పేర్కొన్నారు. శ్రీ కృష్ణ భగవానుడు ‘నిష్కం కర్మ’ అనే భావనను ప్రచారం చేసి, ధర్మ మార్గం ద్వారా పరమ సత్యాన్ని పొందేలా ప్రజలకు జ్ఞానోదయం కలిగించాడని ఆమె తెలిపారు. ఈ జన్మాష్టమి పండుగ మన ఆలోచన, మాట, క్రియలలో పుణ్య మార్గాన్ని అనుసరించేలా ప్రేరేపించాలని ప్రార్థిస్తున్నాను అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సందేశంలో వెల్లడించారు. జన్మాష్టమి శుభ సందర్భంగా భారతదేశం, విదేశాలలో నివసిస్తున్న తోటి పౌరులందరికీ రాష్ట్రపతి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
శ్రీకృష్ణుని జయంతిని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా జన్మాష్టమిని ప్రతి సంవత్సరం జరుపుకుంటారు. భక్తులు దేవాలయాలలో ఉపవాసం, ప్రార్థనలు చేస్తారు. హిందూ క్యాలెండర్ ప్రకారం, శ్రీకృష్ణుడు విష్ణువు యొక్క అవతారం, భాద్ర మాసం ఎనిమిదవ రోజున జన్మించాడు. పాశ్చాత్య క్యాలెండర్ ప్రకారం ఈ రోజు ఎక్కువగా ఆగస్టు లేదా సెప్టెంబర్ నెలల్లో వస్తుంది.