తెలంగాణ పెరిగిన భూముల ధరలు రేపటి నుంచి అమల్లోకి రానున్నాయి. ఇప్పటికే రేట్ల పెంపుపై ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్… వ్యవసాయ భూములపై 50 శాతం పెంచింది. కనిష్ఠ మార్కెట్ విలువ ఎకరాకు 75 వేలుగా నిర్ణయించింది. ప్రస్తుతం ఆయా ఏరియాల్లో ఉన్న మార్కెట్ విలువలకు అనుగుణంగా 3 స్లాబ్ లు చేసింది. ఓపెన్ ప్లాట్ల చదరపు గజం కనీస ధర 100 రూపాయల నుంచి 200 లకు పెంచిన సర్కార్… 50 శాతం, 40 శాతం, 30 శాతం లెక్కన శ్లాబులుగా చేసింది. అపార్ట్‌మెంట్ల ఫ్లాట్ల చదరపు అడుగు కనీస విలువ 800 నుంచి1000కి పెంచిన ప్రభుత్వం.. చదరపు అడుగుపై 20 శాతం, 30 శాతం లెక్కన పెంచింది. ఆదాయ వనరులు పెంచుకునేందుకు కసరత్తు చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం.. కేబినెట్ సబ్ కమిటీ ప్రతిపాదనలకు అనుగుణంగా భూముల మార్కెట్ ధరలు పెంచాలని, రిజిస్ట్రేషన్ చార్జెస్ హైక్ చేయాలని నిర్ణయించింది. 2013 లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చివరిసారిగా భూముల విలువను సవరించింది అప్పటి ప్రభుత్వం. అప్పటి నుంచీ ల్యాండ్ వాల్యూస్ రివైజ్ చేయలేదు. ఇప్పుడు రాష్ట్ర స్థూల ఉత్పత్తి, తలసరి ఆదాయం రెట్టింపు కావడంతో భూముల విలువ పెంచింది సర్కార్. కేబినెట్ సబ్ కమిటీ సూచనలతో ఈ నిర్ణయం తీసుకుంది.
పెంచిన భూముల ధరలు రేపటి నుంచి అమలులోకి వస్తాయని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది తెలంగాణ ప్రభుత్వం. భూములు, ఆస్తుల విలువ పెంపునకు సంబంధించిన సాఫ్ట్‌వేర్‌ను కూడా సిద్ధం చేశారు అధికారులు. దీంతో రిజిస్ట్రేషన్ చార్జెస్ తో పాటు ఇతర సేవలు గిఫ్ట్ డీడ్, కుటుంబీకుల మధ్య రిజిస్ట్రేషన్లు, ఒప్పందాల రేట్లు కూడా పెరగనున్నాయి. అయితే, కరోనాతో అంచనా వేసుకున్నంత ఆదాయం ప్రభుత్వానికి రావడం లేదు. మరో వైపు ప్రభుత్వ వ్యయం పెరిగిపోతుంది. దీంతో ఆదాయం పెంచుకునేందుకు కసరత్తు చేస్తున్న ప్రభుత్వం.. వాటి కోసం వివిధ మార్గాలను వెతికింది. అందులో భాగంగా భూముల విలువల్ని, రిజిస్ట్రేషన్ ఛార్జీలను పెంచింది సర్కార్. గత వార్షిక బడ్జెట్‌లో రిజిస్ట్రేన్ల ద్వారా 10 వేల కోట్లు అంచనా వేస్తే.. కరోనా, ఇతర కారణాలతో టార్గెట్ రీచ్ కాలేదు. 2019-20లో అంచనా కన్నా ఎక్కువ ఆదాయం వచ్చినా.. 2020-21లో మాత్రం దెబ్బపడింది. టార్గెట్‌లో 52.43 శాతం మాత్రమే రీచ్ అయింది.
ఈ ఆర్థిక సంవత్సరంలో 12 వేల 500 కోట్ల ఆదాయం టార్గెట్‌గా పెట్టుకుంది ప్రభుత్వం. అయితే ఏప్రిల్, మే నెలలో వచ్చింది మాత్రం 957 కోట్లు మాత్రమే. ప్రస్తుతం రివైజ్డ్ చేసిన ధరల వల్ల ప్రభుత్వానికి నెలకు అదనంగా 250 కోట్ల రూపాయలు ఆదాయం వస్తుందని రిజిస్ట్రేషన్ల శాఖ భావిస్తోంది. భూముల మార్కెట్ విలువలు, రిజిస్ట్రేషన్ ఛార్జ్‌లు రెండూ ఒకేసారి పెంచడంపై మిశ్రమ స్పందన వస్తోంది. ఏదో ఒకటి పెంచి మరో దానికి గడువు ఇస్తే బాగుండేదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇన్నేళ్లు ఆగి ఇప్పుడు రెండూ ఒకే సారి పెంచడం వల్ల తీవ్ర భారం పడుతుందంటున్నారు విశ్లేషకులు. భూ సేకరణ కోసమే ప్రభుత్వం ఇన్ని రోజులు మార్కెట్ విలువను సవరించలేదని విమర్శిస్తున్నారు. భూముల విలువలు పెరిగినా.. ప్రస్తుత బహిరంగ మార్కెట్‌లో ఉన్న ధరలకు.. పెంచిన మార్కెట్ ధరలకు వ్యత్యాసం ఎక్కువగానే ఉంది. ధరలు పెంచడం వల్ల కొద్దీ మేరకు నల్ల ధనాన్ని నివారించవచ్చు. లోన్లకు కూడా ఇబ్బంది ఉండదు అనే సానుకూలత కూడా వ్యక్తమవుతోంది.