Pastor Praveen: హైదరాబాద్ కు చెందిన పాస్టర్ ప్రవీణ్ పగడాల అనుమానాస్పద మృతి కేసు దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. వివిధ కోణాల్లో పూర్తిస్థాయి నివేదికలతో తూర్పు గోదావరి జిల్లా పోలీసులు రేపు మీడియాకు వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. ఇక, ఫోరెన్సిక్ ఆధారంగా పూర్తిస్థాయి పోస్టుమార్టం రిపోర్టును పోలీసులు బయట పెట్టాల్సి ఉంది. ఇప్పటికే పాస్టర్ ప్రవీణ్ పోస్టుమార్టం నివేదికను సీల్డ్ కవర్ లో జిల్లా ఎస్పీకి ఆసుపత్రి సూపరింటెండెంట్ అందజేశారు. అయితే, ప్రవీణ్ కేసుకు సంబంధించి హైదరాబాద్ నుంచి రాజమండ్రి ఘటన స్థలం వరకు సుమారు 200 సీసీ కెమెరాలు నుంచి సేకరించిన 13 గంటల సీసీ కెమెరాలు ఫుటేజ్ ను పోలీసులు పరిశీలించారు.
Read Also: Shalini Pandey : నన్ను అలియాతో పోల్చడం నచ్చలేదు..
ఇక, విజయవాడలో నాలుగు గంటల పాటు గడిపిన పాస్టర్ ప్రవీణ్ ఏం చేశారు ఎవరెవరిని కలిశారు అనేది మిస్టరీగా మారింది. ఈ నాలుగు గంటలకు సంబంధించిన సీసీ కెమెరా ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పాస్టర్లు క్రైస్తవ సంఘాలు ఆందోళనకు దిగాయి. సోషల్ మీడియాలో వైరల్ అయిన విజువల్స్ పై పోలీసులు ఇంత వరకు నోరు మెదపలేదు. మరోవైపు పాస్టర్‌ని హత్య చేశారని సోషల్ మీడియాల్లో మాట్లాడిన వారికి పోలీసులు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. విజయవాడలో సీసీ కెమెరా ఫుటేజ్, పోస్టుమార్టం నివేదికలకు సంబంధించి పోలీసులు మీడియాతో ఏం చెప్తారు అనేది చర్చనీయాంశంగా మారింది.