Supreme Court : ఢిల్లీలో బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై సుప్రీం కోర్టులో మరోసారి విచారణ ప్రారంభమైంది. ఈ మేరకు జస్టిస్ బీఆర్ గవాయ్, ఆగస్టీన్ జార్జ్ మసీహ్‌ల ద్విసభ్య ధర్మాసనం వాదనలు వింటోంది. కేసులో ఇప్పటికే బీఆర్‌ఎస్ తరఫున ఆర్యమా సుందరం వాదనలు వినిపించగా, అసెంబ్లీ స్పీకర్ తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ తన వాదనలు వినిపిస్తున్నారు.
కేసులో సింగిల్ బెంచ్ తీర్పును కొట్టేసిన డివిజన్ బెంచ్ తీర్పు సరైందేనని ముకుల్ రోహత్గీ పేర్కొన్నారు. స్పీకర్‌కు గడువు విధించిన హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పు సరికాదని ఆయన వాదించారు. అయితే, ధర్మాసనం స్పష్టమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. కోర్టు ధిక్కరణ కేసులో అసెంబ్లీ స్పీకర్‌ను కూడా కోర్టులో నిలబెట్టామనే విషయాన్ని మర్చిపోవద్దని కోర్టు స్పష్టం చేసింది.
పార్టీ ఫిరాయింపులను అడ్డుకునేందుకు రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ఉందని, అలాంటప్పుడు ఫిరాయింపులపై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోతే రాజ్యాంగాన్ని అవమానపరిచినట్లేనని కోర్టు తెలిపింది. ఈ కేసులో ఇప్పటికే బీఆర్ఎస్ వాదనలు ముగియగా, కేటీఆర్, కౌశిక్ రెడ్డి తరఫున న్యాయవాదులు స్పీకర్ నాలుగు వారాల్లోగా నిర్ణయం తీసుకునేలా ఆదేశించాలని కోరారు. అయితే, కోర్టులు స్పీకర్‌ను ఆదేశించలేవని, కేవలం సూచన మాత్రమే చేయగలవని ప్రతివాదుల తరఫు లాయర్ ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు.
దీంతో… అనర్హత పిటిషన్లపై నాలుగేళ్ల పాటు స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే కోర్టులు చూస్తూ ఊరుకోవాలా? అని న్యాయమూర్తి జస్టిస్ గవాయి ప్రశ్నించారు. తమ నిర్ణయాన్ని స్పీకర్‌కు తెలియజేస్తామని, ఆర్టికల్ 142 ప్రకారం కోర్టుల శక్తి పరిమితమైనది కాదని స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు నోటీసు జారీ చేసిన తర్వాతే స్పీకర్ ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారనే అంశాన్ని న్యాయమూర్తులు ప్రస్తావించారు.
ముగ్గురు ఎమ్మెల్యేలపై మూడు వేర్వేరు సమయాల్లో పిటిషన్లు దాఖలైనందున నోటీసుల జారీకి ఆలస్యమైందని ముకుల్ రోహత్గీ వాదించారు. ఈ నేపథ్యంలో తదుపరి విచారణలో మరింత స్పష్టత రాబోతోందని విశ్లేషకులు భావిస్తున్నారు.