శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్‌న్యూస్ చెప్పింది. ఇవాళ ఆన్‌లైన్‌లో టికెట్లను విడుదల చేయనుంది. నేడు ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో అంగప్రదక్షణ టికెట్లు విడుదల చేయనుంది టీటీడీ. ఏప్రిల్ నెలకు సంబంధించి అంగప్రదక్షణ టోకెన్లను టీటీడీ విడుదల చేయనుంది.
అంగన్వాడీల అంశంపై రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ పత్రికా ప్రకటన విడుదల చేశారు. పలు జిల్లాల్లో అంగన్‌వాడీలు విధుల్లో హాజరవుతున్నారని మంత్రి బొత్సా సత్యనారాయణ తెలిపారు. రెండు మూడు జిల్లాల్లో పూర్తిస్థాయిలో తిరిగి విధులకు హాజరయ్యారని.. మిగిలిన జిల్లాల్లో కూడా అంగన్‌వాడీలు తిరిగి విధులకు హాజరవుతున్నారని చెప్పారు.
ఏపీలో ఓటర్ల జాబితాలో అవకతవకలపై మరోసారి వైసీపీ, టీడీపీ పరస్పర ఫిర్యాదులు చేసుకున్నాయి. కొత్త ఆరోపణలను రెండు పార్టీలు తెరపైకి తెచ్చాయి. వైసీపీలో మారిన ఇన్‌ఛార్జ్‌లు తమ అనుచరులను కొత్త నియోజకవర్గాల్లో ఓటర్లుగా చేరుస్తున్నారని టీడీపీ ఆరోపించింది. జనసేనకు ఇచ్చే సీట్లలోని టీడీపీ ఓటర్లను వేరే నియోజకవర్గాలకు మారుస్తున్నారని వైసీపీ ఆరోపించింది.
తుది ఓటర్ల జాబితా విడుదల చేశామని, ఏపీలో మొత్తంగా 4.08 కోట్ల ఓటర్లున్నారని ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ఎంకే మీనా వెల్లడించారు. ముసాయిదా ఓటర్ల జాబితాతో పోల్చుకుంటే 5.85 లక్షల ఓటర్ల మేర పెరిగారని ఆయన చెప్పారు.
ఈ నెల 24న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరుపతిలో పర్యటించనున్నారు. ఇండియా టుడే ఎడ్యుకేషన్ సమ్మిట్‌లో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు. మధ్యాహ్నం 2.45 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి సీఎం బయలుదేరి వెళ్లనున్నారు.
అంగన్వాడీలకు మద్దతుగా ఏపీ బంద్‌కు రాష్ట్ర అఖిలపక్ష ట్రేడ్ యూనియన్లు పిలుపునిచ్చాయి. 24వ తేదీన అంగన్వాడీలకు మద్దతుగా రాష్ట్ర బంద్ జయప్రదం చేయాలని పిలుపును ఇచ్చాయి. అంగన్వాడీలకు సంఘీభావంగా రాష్ట్ర బంద్ చేయడం అవసరమని రాష్ట్ర అఖిలపక్ష ట్రేడ్ యూనియన్లు భావించాయి.
చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలో దళితులపై జరిగిన దాడులు దేశంలో ఎక్కడా జరిగి ఉండవని మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. బీసీలపై పడి వారిని భయబ్రాంతులను చేసిన పరిస్థితి ఆ సమయంలో నెలకొందన్నారు. బీసీలను బాక్ వర్డ్‌గానే చంద్రబాబు చూశారని.. బీసీలను బాక్ బోన్‌లా సీఎం జగన్ కాపాడుతున్నారని ఆయన చెప్పారు.
ఏపీలో విధుల్లో చేరని అంగన్వాడీల తొలగింపునకు ప్రభుత్వం రంగం సిద్దం చేస్తోంది. జిల్లాల్లో అంగన్వాడీల టెర్మినేషన్ ఆర్డర్ల జారీకి సర్కారు ఆదేశాలు ఇచ్చింది. దాదాపు 80 వేల మందికి పైగా అంగన్వాడీల టెర్మినేషన్‌కు ఏపీ ప్రభుత్వం సిద్దమవుతోంది. సోమవారం ఉదయం 9.30 గంటలలోపు విధుల్లో చేరనివారిని తొలగించాలని ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది.
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల సన్నద్ధతపై సచివాలయంలో సీఎస్ జవహర్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. జనవరి 31వ తేదీలోగా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల విధులతో సంబంధం ఉన్న అధికారులు, సిబ్బంది బదిలీలపై సమీక్ష చేపట్టారు.