Telangana Congress
జుట్టు ఉంటే ఎన్ని కొప్పులైనా పెట్టుకోవచ్చన్నట్టుగా ఉంది తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి. కాకపోతే పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా దానిపై ముందుగా మొదలయ్యేది తలనొప్పులే. కాంగ్రెస్‌ను గ్రేటర్ హైదరాబాద్‌లో బలోపేతం చేసేందుకు సంస్థాగతంగా 3 భాగాలుగా విభజించారు. ఈ నిర్ణయాన్ని తొలి నుంచి వ్యతిరేకిస్తూ వస్తున్నారు సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్.. మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్. నగరంలో కాంగ్రెస్‌కు పూర్వ వైభవం తీసుకురావాలంటే మూడు ముక్కలు చేయాల్సిందేనని పార్టీ గట్టిగా భావించి అడుగులు వేసింది. హైదరాబాద్, సికింద్రాబాద్, ఖైరతాబాద్‌లుగా విభజించేసింది.
గడిచిన రెండు అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కాంగ్రెస్ పరిస్థితి ఏ మాత్రం బాగోలేదని భావిస్తోంది పీసీసీ. ఇన్నాళ్లూ నగరంలో పార్టీ బాధ్యతలను అంజన్‌కుమార్‌కు అప్పగించినా.. ఆశించిన ప్రయోజనం లేదని చర్చ సాగుతోంది. కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు సైతం గ్రేటర్ హైదరాబాద్‌లో పూర్‌గానే ఉంది. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో పార్టీకి సానుకూల వాతావరణం ఉంటే.. సిటీలో అంతా రివర్స్‌లో ఉందనేది గాంధీభవన్ వర్గాల టాక్. రాష్ట్రంలో అధికారంలోకి రావాలంటే హైదరాబాద్ నగరం కూడా చాలా కీలకమన్నది పీసీసీ ఆలోచన. ప్రస్తుతం సిటీ పరిధిలో కాంగ్రెస్‌కు ఒక్క ఎమ్మెల్యే కూడా లేరు.
ఖైరతాబాద్, నాంపల్లి, కార్వాన్, గోషామహల్, అంబర్‌పేట అసెంబ్లీ నియోజకవర్గాలతోపాటు ఖైరతాబాద్ జిల్లాను ఏర్పాటు చేశారు. ఇక్కడ పార్టీ జిల్లా అధ్యక్ష బాధ్యతలను రేవంత్‌కు సన్నిహితంగా ఉండే రోహిన్‌రెడ్డి, ఫిషర్‌మెన్ కాంగ్రెస్ ఛైర్మన్ మెట్టు సాయికుమార్ ఆశిస్తున్నారు. ఇక హైదరాబాద్ జిల్లాలో చార్మినార్, బర్కత్‌పురా, మలక్‌పేట, యాకత్‌పురా, చాంద్రాయణగుట్ట నియోజకవర్గాలు ఉన్నాయి. పార్టీ నేతలు ఫిరోజ్‌ఖాన్, మైనారిటీ సెల్ అధ్యక్షుడు సోహైల్‌లు జిల్లా అధ్యక్ష బాధ్యతలు చేపట్టడానికి రెడీగా ఉన్నారు. సికింద్రాబాద్, జూబ్లీహిల్స్, కంటోన్మెంట్, సనత్‌నగర్, ముషీరాబాద్ నియోజకవర్గాలు సికింద్రాబాద్ జిల్లాలో ఉన్నాయి. ఇక్కడ పార్టీ బాధ్యతలను ఆశిస్తున్నవారిలో అంజన్ కుమార్ కుమారుడు అనిల్, పార్టీ నేతలు జగదీశ్వర్, ఉత్తమ్ కుమార్‌కు సన్నిహితంగా ఉండే ఆడం సంతోష్‌లు ఉన్నారు.
హైదరాబాద్‌లో కాంగ్రెస్ బలోపేతం కావాలంటే.. నేతల మధ్య పోటీ పెరగాలన్నది పీసీసీ పెద్దల అభిప్రాయంగా ఉంది. ఆలోచనలు అద్భుతంగా ఉన్నా.. క్షేత్రస్థాయిలో నేతల మధ్య ఉన్న విభేదాలతో ఎంత వరకు ఫలితాలను అందుకుంటారన్నది పెద్ద ప్రశ్న. ముఖ్యంగా హైదరాబాద్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఐదారు మినహాయిస్తే మిగతా చోట్ల పోటీ చేయడానికి చెప్పుకోదగ్గ లీడర్స్ లేరు. అక్కడ ఇంఛార్జులను సిద్ధం చేయడం.. ఆపై అభ్యర్థులను వెతకడం పెద్ద సవాలే. దానికంటే ముందు మూడు కొత్త జిల్లాలకు సారథుల ఎంపిక అంతకంటే సవాల్. మరి..ఈ సమస్యను పీసీసీ ఎలా అధిగమిస్తుందో చూడాలి.