ఆ నియోజకవర్గంలో కూటమి పార్టీ శ్రేణులు అర్ధరాత్రి రోడ్డెక్కి దందా చేస్తున్నారా ? ఎమ్మెల్యే పేరును…ఎక్కడ పడితే అక్కడ వాడేస్తున్నారా ? వరుసగా జరుగుతున్నఘటనలతో ఆ ఎమ్మెల్యేకి చెడ్డపేరు వస్తోందా ? ఇంతకీ పార్టీ శ్రేణుల దందా శాసనసభ్యుడి తెలుసా ? అర్ధరాత్రి వసూళ్ల వ్యవహారంపై కూటమి ఎమ్మెల్యే మౌనమెందుకు ? కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గం నిత్యం వార్తల్లో ఉంటోంది. వైసీపీ హయాంలో భూ ఆక్రమణలు, ఎమ్మెల్యే అనుచరుల దౌర్జన్యాలతో తరచూ వార్తల్లో నిలిచేసింది. కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా పరిస్థితి మాత్రం మారడం లేదట. కాస్త రూపం మారింది కానీ దందాలు ఆగడం లేదన్నది స్థానికుల మాట. ఆదోని ఎస్కేడి కాలనీలో కోట్లు విలువ చేసే భూమిని…బీజేపీ ఎమ్మెల్యే డా.పార్థసారథి సన్నిహితుడు డా.కిరణ్…తల్లి పేరుతో రిజిస్ట్రేషన్ వ్యవహారం దుమారం రేపుతోంది. నకిలీ డాక్యుమెంట్లు సృష్టించిన భూమిని స్వాహా చేయడంతో బాధితులు ఆందోళనకు దిగారు. పరిస్థితి సీరియస్‌గా మారడంతో తప్పనిసరి పరిస్థితుల్లో రిజిస్ట్రేషన్‌ను రద్దు చేశారు. రిజిస్ట్రేషన్ ఆఫీస్ సిబ్బందిని సస్పెండ్ చేశారు. కేసు నమోదు చేసినా అక్రమాలకు పాల్పడిన ప్రైవేటు వ్యక్తులపై ఇప్పటి వరకు చర్యలు తీసుకోకపోవడంపై రకరకాల ప్రచారం జరుగుతోంది. తాజాగా అర్థరాత్రి వేళ బీజేపీ శ్రేణులు రోడ్డెక్కి లారీలు, ట్రిప్పర్లు, ట్రాక్టర్లను వెంటాడుతున్నారట. డ్రైవర్లపై దాడి చేసి నెలసరి మామూళ్లు మాట్లాడుకోవాలని హెచ్చరికలు జారీ చేయడంతో బీజేపీ పరువు బజారున పడిందట.
కర్ణాటక నుంచి తెలంగాణకు బూడిద రవాణా చేసే టిప్పర్లను వదల్లేదట బీజేపీ శ్రేణులు. కర్ణాటకలోని కుడితిని పవర్ ప్లాంట్ నుంచి వచ్చే బూడిద…తెలంగాణలోని అయిజ, గద్వాల ప్రాంతాలకు రవాణా చేస్తారు. ఈ నెల 7వ తేదీ అర్ధరాత్రి ఇద్దరు బీజేపీ క్రియాశీల కార్యకర్తలు…శ్రీనివాస భవన్ నుంచి కంట్రోల్ రూమ్ వరకు వెంబడించి బూడిద టిప్పర్‌ను అడ్డగించారట. డ్రైవర్ నుంచి సెల్ ఫోన్ లాక్కొని యజమానికి ఫోన్ చేసి బెదిరించారట. రెండు నెలలుగా చెబుతున్నా రావడం లేదని, వచ్చి మాట్లాడుకోవాలని వార్నింగ్ ఇవ్వడం కలకలం రేపుతోంది.ఇప్పుడే వచ్చి మాట్లాడుకోవాలని, లారీ ఇక్కడే ఆపేస్తాని హెచ్చరించడంతో…ఎమ్మెల్యే పీఏగా పరిచయం చేసుకుని మరీ బెదిరింపులకు దిగారట. ఈ వాదన ఆడియో కాల్ వైరల్ కావడంతో పాటు టిపర్ల వీడియోలు , ఆడియో కలకలం సృష్టించాయి. మరుసటి రోజు అర్ధరాత్రి ఇసుక తరలిస్తున్న టిప్పర్, ట్రాక్టర్లను ఎమ్మిగనూరు బైపాస్ రోడ్డులో 8 మంది బీజేపీ కార్యకర్తలు వెంటాడి అడ్డుకున్నారు. పర్మిట్ స్లిప్పులను చించేసి డ్రైవర్లపై దాడి చేశారట. ఎమ్మెల్యే అనుచరులుగా చెప్పుకొని ట్రాక్టర్‌కి నెలకు 15 వేలు, టిప్పర్ ట్రిప్‌కు 1500 చొప్పున మామూళ్లు ఇవ్వాలని ఆదేశించినట్లు ప్రచారం జరుగుతోంది.
ఆదోనిలో అర్ధరాత్రి దందా…తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దందా చేస్తున్న వారి పేర్లు స్పష్టంగా తెలిసినా, పీఏగా చెప్పుకున్నా… ఎమ్మెల్యే పార్థసారథి ఎందుకు మౌనం వహిస్తున్నారనేది చర్చ నీయాంశంగా మారింది. ఈ పరిణామాలు ఎమ్మెల్యే పార్థసారథికి చెడ్డ పేరు తెస్తున్నాయట. ఇంతకీ బీజేపీ శ్రేణుల దందా గురించి ఎమ్మెల్యే పార్థసారథికి తెలుసా, తెలియదా అనే టాక్ నడుస్తోంది. బీజేపీలో క్రియాశీలంగా ఉంటూ…అర్ధరాత్రి రోడ్డెక్కి దందా చేస్తుంటే బీజేపీ నేతలు చర్యలు తీసుకోరా అనే ప్రశ్నలు వస్తున్నాయి. అ పార్టీకి కళంకం కాదా అనే చర్చ జరుగుతోందట. ఇసుక ట్రాక్టర్, టిప్పర్లను అడ్డుకొని దాడి చేసిన వ్యవహారంపై బీజేపీ శ్రేణులు మరో నాటకానికి తెరలేపారట. దాడి తరువాత డ్రైవర్లు, ఓనర్లు మీడియాను పిలిపించి జరిగిన సంఘటనపై చెప్పారు. అయితే మీడియాకు తప్పుడు సమాచారం ఇచ్చామని…డ్రైవర్ల చేత చెప్పించి వీడియో తీయించి లోకల్ బీజేపీ గ్రూపులోను, మరో గ్రూపులోను అప్లోడ్ చేశారట. ఇంతా జరిగాక… ఇసుక అక్రమ రవాణాను అడ్డుకునేందుకు సైనికుల్లా పని చేస్తున్నారని, అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్లను నిలిపారని మీడియా ముందు కట్టుకథలు చెబుతున్నారట. మామూళ్ల కోసం ఓనర్లను ఫోన్‌లో బెదిరించిన ఆడియోలు బయటికి రావడంతో…తాము ఎవరిని బెదిరించలేదని వివరణ ఇస్తున్నారట. ఈ మొత్తం వ్యవహారం ఎమ్మెల్యే పార్థసారథికి, బీజేపీకి చెడ్డపేరు తెచ్చేలా ఉన్నాయని, దందాలను సమర్థించుకుంటారా…లేదంటే లోకల్ కేడర్‌ను నియంత్రిస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది.