నాగార్జున గారు.. చూశారా సర్ నా పర్ ఫార్మెన్స్.. దూకుడు సినిమాలో బ్రహ్మనందం చెప్పిన ఈ డైలాగ్.. అందరికీ గుర్తుండే ఉంటుంది కదా.. ఇప్పుడు సేమ అదే తరహాలోనే జగన్మోహన్ రెడ్డి గారు.. చూశారా సర్ నా పర్ ఫార్మెన్స్ అంటున్నారు ఆ మాజీ ఎంపీ. ఎక్కడో సీమ నుంచి గుంటూరుకి వచ్చి ఆయన చూపించిన నటనను రాజకీయ నాయకులే కాదు…ప్రజలు కూడా చర్చించుకుంటున్నారా ? అధినేత దృష్టిలో పడటానికే ఆయన పాట్లు పడుతున్నారా ? క్యారెక్టర్‌లో అంత ఇన్వాల్వ్ అయి…పోలీస్ కేసుల్లో ఇరుక్కున్న ఆ నేత ఎవరు ?
యాక్షన్‌కి ఓవర్ యాక్షన్‌కి చాలా తేడా ఉంటుంది. యాక్షన్ చేస్తే అంతా చూస్తారు కానీ.. ఓవర్ యాక్షన్ చేస్తే…కథే వేరేలా ఉంటుంది. ప్రజలు పసిగట్టేస్తారు. ప్రస్తుతం హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ విషయంలో కూడా అదే ప్రచారం సాగుతోంది. మొదటి నుంచి కాంట్రవర్సీలకు కేరాఫ్ అయిన గోరంట్ల మాధవ్…తాజాగా తన పర్ ఫార్మెన్స్‌తో మరో వివాదంలో చిక్కుకున్నారు. ఒకప్పుడు పోలీస్ అధికారిగా గబ్బర్‌సింగ్ తరహాలో రూలింగ్ చేశారు. సీఐగా ఉన్న సమయంలో అప్పటి ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిపై మీసం తిప్పి హీరోలా కలరింగ్ ఇచ్చారు. ఒక పోలీస్ అధికారి ఇలా చేయడం కొత్త కావడంతో అంతా యాక్సెప్ట్ చేశారు. దీంతో ఆయనకు ఇమేజ్ పెరిగింది. అదే స్పీడ్‌తో ఖాకీ వదిలేసి ఖద్దరు తొడిగారు. వచ్చి రాగానే వైసీపీ అధినేత జగన్ ఎంపీ టికెట్ ఇవ్వడం…హిందూపురం నుంచి ఎంపీగా గెలవడం అన్నీ చకచకా జరిగిపోయాయి. అయితే ఎంపీగా వచ్చినా.. ఆయన స్టైల్ మాత్రం మారలేదు. అదే వివాదాలతో వార్తల్లో నిలిచే వారు. కానీ ఆయన న్యూడ్ వీడియో…మాధవ్ పొలిటికల్ కెరీర్‌ను పతనం చేసింది. దాన్నుంచి కోలుకునేందుకు ఆయన ఎన్ని రకాలుగా ప్రయత్నించినా.. అంత వర్కౌట్ కాలేదు. గడిచిన ఎన్నికల్లో టికెట్ కూడా రాకుండా చేసింది.
వైసీపీ ఓటమి తర్వాత మాధవ్ తనకు టికెట్ రాకపోవడమే మంచిదైందని అనుకున్నారు. వచ్చే ఎన్నికల నాటికి పొలిటికల్‌గా మళ్లీ పుంజుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఎప్పటిలానే దూకుడుగా తెలుగుదేశం, చంద్రబాబు, లోకేశ్, పవన్ కల్యాణ్ వంటి నేతలపై నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ…జగన్ దృష్టిలో పడేందుకు ప్రయత్నిస్తున్నారు. తనకంటూ ఒక నియోజకవర్గం ఉండాలని… రాప్తాడుపై గురి పెట్టారు. రాప్తాడులో తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి యాక్టీవ్‌గా లేని సమయం చూసి అక్కడ పాగా వేయాలని చూశారు. కానీ ప్రకాష్ రెడ్డి ఒక్కసారిగా యాక్టీవ్ కావడం.. హంద్రీనీవా కాలువ వెడల్పు, రామగిరి ఎంపీపీ, వైసీపీ నేత కురుబ లింగమయ్య హత్య ఇలాంటివన్నీ కలిసి వచ్చాయి . పైగా పెనుకొండలో ఎంపీటీసీలను కాపాడుకునే క్రమంలో ఆయన పోలీసులపైకి, టీడీపీ నాయకులపైకి దూసుకెళ్లిన ఘటనలతో కేసులు నమోదు అయ్యాయి. అదే స్థాయిలో దూకుడు ప్రదర్శిస్తే…పార్టీ అధినేత దృష్టిలో పడొచ్చని అనుకున్నారు.
జగన్ వద్ద ప్రకాష్ రెడ్డికి మంచి మార్కులు పడటంతో…మనం కూడా అదే స్థాయి పర్ ఫార్మెన్స్ ఇవ్వాలని అనుకున్నాడో ఏమో… సీన్ కట్ చేస్తే మాధవ్ ఏది చేసినా రోటీన్‌కు భిన్నంగా ఉంటుంది. పైగా సినిమా స్టైల్లో ఉంటుంది. పెనుకొండ తహసీల్దార్ కార్యాలయంలో ప్రకాష్ రెడ్డి నటనను గుర్తుకు తెచ్చుకుని.. నేను ఇంతకంటే బాగా చేయాలని డిసైడ్ అయ్యాడట. సరిగ్గా అదే టైంలో చేబ్రోలు కిరణ్ అనే ఐటీడీపీ మెంబర్ చేసిన కామెంట్స్ దుమారం రేపాయి. టీడీపీ కూడా ఆయన్ని సస్పెండ్ చేసింది. పోలీసులు కూడా కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఈ మ్యాటర్ హాట్‌హాట్‌గా ఉండటంతో మాధవ్ కన్ను కిరణ్ పై పడింది. కిరణ్‌ను ఎస్పీ కార్యాలయానికి తరలిస్తుండగా… వెంటపడ్డారు. చుట్టుగుంట సెంటర్‌లో పోలీస్ కాన్వాయిని ఆపి…కిరణ్‌పై దాడికి యత్నించారు. అది కూడా సినిమా స్టైల్‌లో… మాధవ్ దూసుకుని రావడం… పోలీసులు అడ్డుకోవడం…వెనుక తన అనుచరులు సెల్ ఫోన్లలో వీడియోలు తీయడంతో బాగా పబ్లిసిటీ వచ్చింది. అదే సమయంలో మాధవ్ యాక్షన్ కాస్త ఓవర్ యాక్షన్ అయిందన్న చర్చ నడుస్తోంది. పోలీసులు కూడా సీరియస్‌గా తీసుకుని మాధవ్ పై కేసులు పెట్టారు.