ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యేకి సొంత పార్టీ నేతల నుంచే సెగ తగులుతోందా ? సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఎర్త్ పెట్టేందుకు…మాజీ మంత్రి ప్రయత్నాలు మొదలు పెట్టేశారా ? పోయిన చోటే వెతుక్కోవాలన్న లక్ష్యంతో…సొంత పార్టీకి అన్యాయం చేస్తున్నారా ? ఇంతకీ ఎవరా మాజీ మంత్రి ? సిట్టింగ్ ఎమ్మెల్యేపై చేస్తున్న కుట్రలేంటి ? ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో వైసీపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. గత సార్వత్రిక ఎన్నికల్లో కూటమి వేవ్‌లో కూడా వైసీపీ గెలిచిన స్థానాల్లో ఇదొకటి. దీంతో వైసీపీలో ఉంటే ఈ అసెంబ్లీ నుంచి పోటీ చేయాలనుకుంటున్నారో ఏమో కానీ…మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ మనసు పారేసుకున్నారట. మార్కాపురంలో నివాసం ఉండే ఆదిమూలపు సురేష్…2009లో ఎర్రగొండపాలెం కాంగ్రెస్ అభ్యర్దిగా పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత వైసీపీలోకి వెళ్లారు. అప్పటికే వైసీపీ ఎర్రగొండపాలెం సీటును పాలపర్తి డేవిడ్ రాజుకు కేటాయించటంతో…సంతనూతలపాడు నుంచి పోటీ చేసి గెలిచారు. డేవిడ్ రాజు టీడీపీ గూటికి చేరటంతో తిరిగి ఎర్రగొండపాలెంకు రీబ్యాక్ అయ్యారు. 2019లో అదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచి వైసీపీ ప్రభుత్వంలో కీలక శాఖలకు మంత్రిగా కూడా పనిచేశారు సురేష్. 2024లో కొండెపి నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఎర్రగొండపాలెంలో తాటిపర్తి చంద్రశేఖర్ గెలిచారు. నియోజకవర్గంలో చంద్రశేఖర్‌కు చెక్ పెడితే తాను తిరిగి రావచ్చనుకున్నారో ఏమో కానీ…సొంత పార్టీకే డ్యామేజ్ చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి.
త్రిపురాంతకంలో ఎంపీపీ, పుల్లలలచెరువు వైస్ ఎంపీపీ ఎన్నికల్లో లోపాయికారీగా ఆదిమూలపు సురేష్ టీడీపీకి సపోర్ట్ చేశారన్న టాక్ వినిపిస్తోంది. త్రిపురాంతకంలో గత ఎన్నికల్లో 18కి 18 వైసీపీ దక్కించుకుంది.. పుల్లలచెరువులో 15 స్దానాలకు 10 వైసీపీ, 5 టీడీపీ గెలిచింది. కోట్ల సుబ్బారెడ్డి తొలి రెండున్నరేళ్లు, ఆళ్ల ఆంజనేయరెడ్డి తర్వాత రెండున్నరేళ్లు ఎంపీపీ పదవిని నిర్వహించేలా అధిష్టానం ఒప్పించింది. కోట్ల సుబ్బారెడ్డి రాజీనామాతో ఎన్నిక వచ్చింది. అదే సమయానికి ఆళ్ల ఆంజనేయరెడ్డి జైలులో ఉండటంతో 17 మంది ఎంపీటీసీలు హాజరయ్యారు. ఒక దశలో వైసీపీకి 8, టీడీపీకి 8 మంది ఎంపీటీసీ మద్దతు లభించటంతో ఎంపీటీసీ మాలపాటి సృజన ఓటు కీలకమైంది. ఆమె కూడా టీడీపీకే మద్దతు ఇస్తుందని భావించారు. అనూహ్యంగా సృజన వైసీపీకే జై కొట్టడంతో ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించింది. ఆదిమూలపు సురేశ్‌కు చెందిన జార్జ్ కళాశాలలో ఎంపీటీసీ సృజన సోదరి మాలపాటి వసుంధర అధ్యాపకురాలిగా పని చేస్తున్నారు. చల్లా జ్యోతికి అనుకూలంగా సృజన ఓటు వేయకపోవడంతోనే…ఆమె సోదరిని విధుల నుంచి తప్పించారనే ప్రచారం జరుగుతోంది. దీంతో ఆదిమూలపు సురేష్ తెరవెనుక తతంగం బయటకు వచ్చింది.
పుల్లలచెరువు వైస్ ఎంపీపీ ఎన్నికల్లోనూ…వైసీపీ 7, టీడీపీ 7 ఓట్లు రావడంతో డ్రా తీశారు. డ్రాలో వైసీపీ అభ్యర్థి రాములును విజయం వరించింది. ఇక్కడ కూడా మాజీమంత్రి సురేష్ వర్గీయులుగా ఉన్న వారే టీడీపీకి మద్దతు ఇచ్చారట. జరుగుతున్న పరిణామాలను ఎమ్మెల్యే చంద్రశేఖర్ హైకమాండ్‌కు చేరవేస్తున్నారట. దీంతో హైకమాండ్ ఆదిమూలపు సురేశ్‌కు గట్టిగానే క్లాస్ పీకినట్లు తెలుస్తోంది. పొరపాటు జరిగిందని ఒప్పుకున్న సురేశ్…తిరిగి విధుల్లో చేరాలని వసుంధరను కోరారట. దీంతో పాటు పెద్దమొత్తంలో వారికి డబ్బు ఇచ్చేందుకు సిద్దమవడంతో…వారు సున్నితంగా తిరస్కరించినట్లు సమాచారం. టీడీపీకి మద్దతు ఇచ్చిన మాజీ ఎంపీపీ కోట్ల సుబ్బారెడ్డిని తీసుకుని…ఎంపీ వైవీ సుబ్బారెడ్డి దగ్గరకు వెళ్లి పొరపాటు జరిగిందని చెప్పే ప్రయత్నం చేయటంతో…ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఎన్నిక సమయంలో పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వ్యక్తులను ఎలా తీసుకువస్తారని ఆయన కూడా గట్టిగానే క్లాస్ తీసుకున్నట్లు సమాచారం. ఎర్రగొండపాలెం విషయంలో వేలు పెడితే చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని మందలించారట. సురేష్ రీఎంట్రీ కోసమే నియోజకవర్గంలో పార్టీని రెండు గ్రూపులుగా చేసి ఉంటారని పార్టీ నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారట. కష్టకాలంలో పార్టీకి అండగా ఉండాల్సిన ఆయన టీడీపీతో జట్టుకట్టడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట. ఎమ్మెల్యే చంద్రశేఖర్…జనసేనలోకి వెళ్తారని ప్రచారం చేసింది కూడా సురేశ్ వర్గీయులేనని హైకమాండ్‌కు సమాచారం ఉంది. ఎంత రాజకీయం చేసినా సొంత పార్టీకి వెన్నుపోటు పోడవటం కరెక్ట్ కాదని అంటున్నారట. మాజీ మంత్రి సురేష్ కూడా టీడీపీకి వెళ్తున్నారని ప్రచారం జరగటం.. గతంలో కొందరు…తాజాగా ఇంకొందరు టీడీపీలోకి వెళ్లడం కూడా యాదృచ్చికం కాదని…పక్కా ప్లాన్ అని ఉందని వైసీపీ నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎర్రగొండపాలెం నియోజకవర్గ వైసీపీలో ఏం జరుగుతుంది.. ఏం జరగబోతోందనేది తెలియాలంటే వేచిచూడాలి.