నాడు ఎంపీ టికెట్ల కోసం పోటీ పడ్డారు. పార్టీ కార్యాలయంతో పాటు అధినేత చుట్టూ చక్కర్లు కొట్టారు. అధికారం కోల్పోయి…తాము ఓడిపోగానే…ముఖం చాటేశారు. పార్టీ కార్యక్రమాలకు సైతం దూరమయ్యారు. కష్టకాలంలో అండగా ఉండాల్సిన నేతలు…అడ్రస్ లేకుండా పోయారు. పదేళ్ల పాటు తిరుగులేని ఆధిపత్యం సాగించిన బిఆర్ఎస్‌కు…అధికారం కోల్పోగానే సొంత నాయకులే దూరమైపోతున్నారు. నాడు టికెట్ల కోసం తెలంగాణ భవన్ చుట్టూ ప్రదర్శనలు చేసిన ఎంపీ అభ్యర్ధులు…ఓటమి తరువాత ముఖం చాటేశారు. తెలంగాణ గళం, బలం ఢిల్లీలో వినిపించాలంటే…బిఆర్ఎస్ ఎంపీలు గెలవాలని గులాబీ బాస్ కేసీఆర్ భావించారు. సామాజిక సమీకరణాలు లెక్కలేసుకొని..సీట్లు కేటాయించారు. అయితే పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్కటంటే ఒక్క సీటు గెలవలేకపోయింది. ఖమ్మం లోక్‌సభ నుంచి పోటీ నామా నాగేశ్వరరావు…ఎన్నికల తర్వాత తెలంగాణ భవన్ మెట్లు ఎక్కిన దాఖలాలే కనపడలేదు. భువనగిరి అభ్యర్థి క్యామ మల్లేష్…ఎక్కడున్నారో తెలియడం లేదు. చేవెళ్ళ నుంచి పోటీ చేసిన కాసాని జ్ఞానేశ్వర్…పరిస్థితి అంతే. పాలమూరు నుంచి పోటీ చేసిన మన్నె శ్రీనివాస రెడ్డి…ఓడిపోయిన తర్వాత అసలు కనబడలేదు. ఇక హైదరాబాద్ పార్లమెంటు స్థానం నుంచి బరిలోకి దిగిన గడ్డం శ్రీనివాస్ యాదవ్, మెదక్ లోక్‌సభ అభ్యర్థి వెంకట్రాంరెడ్డి, ఆదిలాబాద్ అభ్యర్థి ఆత్రం సక్కు…పార్టీ కార్యక్రమాల్లో ఎక్కడా కనిపించడం లేదు. జహీరాబాద్ అభ్యర్ధిగా పోటీ చేసిన గాలి అనిల్ కుమార్… పార్టీ ఓటమి తరువాత కాంగ్రెస్ గూటికి చేరారు.
అటు నల్లగొండ నుంచి పోటీ చేసిన కంచర్ల కృష్ణారెడ్డి భవన్ వైపు చూడడమే మానేశారు. అడపదడప ఏదో చిన్న చిన్న పార్టీ కార్యక్రమాల్లో మాత్రమే ప్రత్యక్షం అవుతున్నారు. కరీంనగర్ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ కేసీఆర్ కుటుంబానికి సన్నిహితుడు. తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశాలకే పరిమితం అవుతున్నారనే విమర్శను ఎదుర్కొంటున్నారు. సికింద్రాబాద్ నుంచి పోటీ చేసిన పద్మారావు వాళ్ళ నియోజకవర్గాలకే పరిమితం అవుతున్నారు. నిజామాబాద్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి, వరంగల్ అభ్యర్థి మారపల్లి సుధీర్ కూమార్, మహబూబాబాద్ పోటీ చేసిన మాలోత్ కవిత… అడపాదడప పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అయితే కవిత హైదరాబాద్ కే పరిమితం అవుతుందని విమర్శలు ఉన్నాయి. నాగర్‌కర్నూలు అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, పెద్దపల్లి అభ్యర్థి కొప్పుల ఈశ్వర్, మల్కాజిగిరి అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి…మిగిలిన వారి కంటే యాక్టివ్ వ్యవహరిస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు కెసిఆర్ చుట్టూ తెలంగాణ భవన్ చుట్టూ ప్రదర్శనలు చేసిన నాయకులు.. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల తర్వాత ముఖం చాటేశారు. బెల్లం ఉన్నప్పుడే ఈగలు వాలినట్లు…అధికారంలో ఉన్నప్పుడు ప్రదక్షిణలు చేశారు. బీఆర్ఎస్ అధికారం కోల్పోగానే…తెలంగాణ భవన్‌వైపు కన్నెత్తి చూడటం లేదు. ప్రజా సమస్యలపై పోరాటం చేసే నాయకులకే సీట్లు ఇస్తే…పార్టీకి పూర్వ వైభవం వస్తుందని పార్టీ కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు.