తెలంగాణ కాంగ్రెస్‌లో పదవుల భర్తీ ఎప్పుడు జరుగుతుంది ? అనేది వేయి డాలర్ల ప్రశ్న. వర్కింగ్ ప్రెసిడెంట్ పదవులు భర్తీలో…సామాజిక సమీకరణాలకు పెద్ద వేస్తుందా ? రేసులో ఉన్న నేతలెవరు ? టాప్ పోస్టుల భర్తీలో మహిళలు ఛాన్స్ ఇస్తారా ? తెలంగాణ కాంగ్రెస్‌లో వర్కింగ్ ప్రెసిడెంట్ల నియామకంపై కసరత్తు జరుగుతోంది. అయితే ఈ పదవికి చాలా డిమాండ్ పెరిగినట్టు కనిపిస్తోంది. సామాజిక సమీకరణాలకి అనుగుణంగా పదవుల భర్తీ చేయాలని అధిష్టానం భావిస్తోంది. మీరు ఎంతో మీ వాటా అంత అనే నినాదం ఎత్తుకున్న కాంగ్రెస్ పార్టీ…పదవుల పంపకంలో కూడా దీన్ని అనుసరించాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే పిసిసి కమిటీ నియామకంలో కూడా సామాజిక సమీకరణాలను బెరీజు వేసుకుంటూ ముందడుగు వేయాలని చూస్తోంది. నాలుగు వర్కింగ్ ప్రెసిడెంట్ల నియామకం చేపట్టాలని పార్టీ భావిస్తోంది. పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ల రేసులో ఉన్న వారి సంఖ్య భారీగా పెరుగుతోంది. అందులోనూ… పిసిసి ఆర్గనైజేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్‌కి పోటీ తీవ్రంగా ఉంది. సామాజిక సమీకరణాలు బేరీజు వేసుకుంటూ…పదవుల భర్తీ చేయాలని చూస్తుంది హస్తం పార్టీ. బీసీ నుంచి బలమైన నాయకుడు ఎవరన్న దానిపై వెతుకులాట ప్రారంభించింది. ఓసీ జాబితా చాలా పెద్దదిగా కనిపిస్తోంది. ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యే వంశీ చంద్ రెడ్డి.. ఖైరతాబాద్ డీసీసీ రోహిన్ రెడ్డి, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పోటీ పడుతున్నారు. దీంట్లో పార్టీ వ్యవహారాలు చూసే బాధ్యతల కోసం రోహిన్ రెడ్డి, చామల, వంశీ చంద్ ప్రయత్నిస్తున్నారు.
ఎస్సీ కోటాలో మాదిగలకి అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఇప్పటికే మాల సామాజిక వర్గానికి పదవులు ఎక్కువ అయ్యాయి అనే ఫీలింగ్ ఉంది. దీంతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి మాదిగలకి ఇవ్వాలని చూస్తోంది. మాజీ ఎమ్మెల్యే సంపత్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరు లక్ష్మణ్ పేర్లు వినపడుతున్నాయి. ఎస్టీ కోటాలో ఎంపీ బలరాం నాయక్‌తో పాటు బెల్లయ్య నాయక్ పోటీ పడుతున్నారు. ప్రస్తుతం గిరిజన విభాగం చూస్తున్న బెల్లయ్య నాయక్…గతంలో మహబూబాబాద్ సీటు ఆశించారు. కానీ టికెట్ దక్కకపోవడంతో… ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వాలని పట్టుబడుతున్నట్టు సమాచారం. వర్కింగ్ ప్రెసిడెంట్లలో ఒకరు మహిళా ఉండేలా చూడాలని అధిష్టానం లెక్కలు వేస్తోంది. అది బీసీ కోటలో ఇవ్వాలనే ఆలోచన కూడా ఉన్నట్టు తెలుస్తుంది. Bc మహిళ ఎవరనేది ఇప్పటికీ సస్పెన్స్ గానే ఉంది.