Adipurush Movie: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తాజా చిత్రం ‘ఆదిపురుష్’ ఈ నెల 16న విడుదల కానుంది. ‘ఆదిపురుష్’ విడుదల తేదీ దగ్గర పడే కొద్దీ ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతోంది. భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా బిజినెస్ ఎలా సాగింది అన్న అంశంపై చర్చ కూడా సాగుతోంది. మన దేశంలో మిగతా రాష్ట్రాల సంగతేమోకానీ, తెలుగునాట మాత్రం ఓ స్టార్ హీరో నటించిన పౌరాణిక చిత్రం రావడం విశేషంగానే మారింది. దాదాపు పుష్కరం తరువాత తెలుగునాట ఓ పౌరాణికం వెలుగు చూడబోతోంది. బాలకృష్ణతో బాపు తెరకెక్కించిన ‘శ్రీరామరాజ్యం’ తరువాత ‘ఆదిపురుష్’ రూపంలో మరో పురాణ చిత్రం వస్తోంది. పన్నెండేళ్ల తరువాత వస్తున్న పౌరాణిక చిత్రం కూడా రామాయణం ఆధారంగానే తెరకెక్కింది కావడం విశేషం! దీంతో ‘ఆదిపురుష్’పై చర్చోపచర్చలు సాగుతున్నాయి. ఈ సినిమా దాదాపు 500 కోట్ల రూపాయలతో తెరకెక్కినట్లు సమాచారం. మరి ఈ భారీ బడ్జెట్ కు తగ్గట్లే బిజినెస్ సాగిందా!?
Also Read: Sai Dharam Tej: ఆ హీరోయిన్ తో సాయి ధరమ్ తేజ్ ప్రేమాయణం?
‘ఆదిపురుష్’ ఓమ్ రౌత్ దర్శకుడు. ఈయనతో పాటు భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేశ్ నాయర్ కలసి ‘ఆదిపురుష్’ను నిర్మించారు. మోషన్ కాప్చర్ టెక్నిక్ తో రూపొందిన ‘ఆదిపురుష్’ను అత్యంత భారీగా రూపొందించడంతో బడ్జెట్ ఐదు వందల కోట్లు అయిందని ముంబై టాక్. ఈ సినిమాను హిందీలో నిర్మించి, తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ భాషల్లోకి అనువదించారు. తెలుగులోనే బిజినెస్ 170 కోట్ల వరకూ జరిగిందని టాక్. హీరో ప్రభాస్ తెలుగువాడు కావడంతో పాటు ‘బాహుబలి’తో వచ్చిన క్రేజ్ దృష్ట్యా ‘పీపుల్స్ మీడియా’ సంస్థ 170 కోట్లతో ‘ఆదిపురుష్’ తెలుగు వర్షన్ రైట్స్ ను సొంతం చేసుకుందట.
Also Read: Rakul Preet Singh: వామ్మో.. సినిమా కోసం అంత పెద్ద సాహసం చేసిందా?
మరి ఆ స్థాయిలో బిజినెస్ జరిగిందా!? ప్రస్తుతానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ‘ఆదిపురుష్’ బిజినెస్ 120 కోట్ల రూపాయలు అయినట్టు సమాచారం. నైజామ్ లోఈ సినిమాను 50 కోట్లకు మైత్రీ మూవీ మేకర్స్ కొని విడుదల చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ మొత్తం 70 కోట్ల బిజినెస్ జరిగిందట! ఇందులో ఉత్తరాంధ్ర 14.50 కోట్లు కాగా, ఈస్ట్, వెస్ట్ కలిపి 16 కోట్ల రూపాయలట. గుంటూరు, కృష్ణా, నెల్లూరు కలిపి
21.90 కోట్లు పలికిందట. సీడెడ్ లో ఈ సినిమా 17.60 కోట్లు బిజినెస్ చేసిందట. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కలిపి 120 కోట్ల బిజినెస్ చేయగా ఇంకా 50 కోట్ల మేర బిజినెస్ కావలసి ఉంది. ఇండియాలో మిగిలిన రాష్ట్రాలలో తెలుగు వర్షన్ కు మరో పది కోట్ల వరకూ రావచ్చని అంచనా! విదేశాల్లో ‘ఆదిపురుష్’ తెలుగు వర్షన్ కు రూ.40 కోట్లు వస్తే పెట్టుబడికి తగ్గ రాబడి వచ్చినట్టు. అయితే సినిమా బంపర్ హిట్టయి, ఓవర్ ఫ్లోస్ వస్తే కొన్నవారికి భారీ లాభాలు వస్తాయి. వినిపిస్తున్న దాని ప్రకారం ఈ సినిమాపై ఉన్న క్రేజ్ కు తెలుగు వర్షన్ కనీసం 200 కోట్ల గ్రాస్ పోగేస్తుందని టాక్. మరి బయటకు వినిపిస్తున్న నంబర్స్ అన్నీ నిజమైతే, కొన్నవారు బయటపడినట్టే అనీ కొందరి మాట! ఏమవుతుందో చూడాలి!