The Kerala Story: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘ ది కేరళ స్టోరీ’ సినిమా కలెక్షన్ల పరంగా దూసుకుపోతోంది. వివిధ రాష్ట్రాలు అభ్యంతరాలు తెలిపినా, వివిధ రాజకీయ పార్టీలు అడ్డంకులు సృష్టించినా సినిమా రూ.80 కోట్ల వరకు కలెక్ట్ చేసినట్లు మూవీ మేకర్స్ చెబుతున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాను పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం బ్యాన్ చేసిన సంగతి తెలిసిందే. సమాజంలో ఓ వర్గాన్ని ఉద్దేశించి సినిమా తీశారని చెబుతూ ది కేరళ స్టోరీని నిషేధిస్తున్నట్లు మమతా బెనర్జీ ప్రకటించారు. ఈ బ్యాన్ ను ఛాలెంజ్ చేస్తూ సినిమా నిర్మాతలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తమిళనాడు రాష్ట్రం శాంతిభద్రతల పేరుతో మల్టిప్లెక్స్ థియేటర్లలో సినిమా ప్రదర్శనలు నిలిపేసింది.
ఇదిలా ఉంటే ఈ సినిమాను పశ్చిమ బెంగాల్ సర్కార్ నిషేధించడం వెనక ఉన్న కారణాలు తెలపాలని సుప్రీంకోర్టు ఈ రోజు కోరింది. ‘‘ దేశవ్యాప్తంగా ఈ సినిమా నడుస్తోంది, పశ్చిమ బెంగాల్ సర్కార్ ఈ సినిమాను ఎందుకు నిషేధించాలి..?’’ అని కోర్టు బెంగాల్, తమిళనాడు ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది.
Read Also: Karnataka Elections: బీజేపీ, కుమారస్వామి మంతనాలు చేయనివ్వండి.. మాదే విజయమన్న డీకే శివకుమార్..
‘ ది కేరళ స్టోరీ ’ నిషేధించిన మొదటి రాష్ట్రంగా పశ్చిమబెంగాల్ నిలిచింది. ఇది శాంతి భద్రతలకు భంగం కలిగిచేలా ఉందని పేర్కొంది. రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడేందుకు ఎలాంటి ద్వేషం లేదా హింసాత్మక సంఘటనలు జరగకుండా ఉండేందుకు సినిమా ప్రదర్శనను నిషేధిస్తున్నట్లు ప్రభుత్వం సోమవారం నోటిఫికేషన్‌లో పేర్కొంది. సినిమా నిర్మాతలు బెంగాల్ బ్యాన్‌ను సుప్రీంకోర్టులో సవాలు చేసారు, ప్రతిరోజూ తమకు నష్టం వాటిల్లుతోందని సుప్రీంకు విన్నవించారు.
కేరళలో మతమార్పిడులు, 32,000 మంది మహిళలు మతం మార్చుకోవడం, ఉగ్రవాద సంస్థ ఐసిస్ లో చేరినట్లు ఈ సినిమా ట్రైలర్ లో చూపించడం వివాదాస్పదం అయింది. ఈ సినిమా విపక్ష పాలిత రాష్ట్రాల్లో అడ్డంకులు ఎదుర్కొంది. కేరళ సీఎం పినరయి విజయన్ ఈ సినిమా సంఘ్ పరివార్ స్పాన్సర్డ్ సినిమాగా కొట్టిపారేశారు. మధ్యప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్ వంటి రాష్ట్రాలు ఈ సినిమాకు పన్ను మినహాయింపును ఇచ్చాయి. బీజేపీ సీఎంలు ఈ సినిమాను థియేటరల్లో చూస్తున్నారు.