Pawan Kalyan: అమరావతిలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఆదివారం జరిగిన పీఏసీ సమావేశంలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఏపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. విశాఖ కేంద్రంగా అధికార పార్టీ వైసీపీ విధ్వంసం చేయాలని చూస్తోందని ఆరోపించారు. అక్కడి ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టి ఘర్షణలు సృష్టించాలని ప్రయత్నాలు చేస్తోందని మండిపడ్డారు. వివాదాలు సృష్టించి కల్లోలాలు రేపాలని ప్రయత్నాలు మొదలుపెట్టిందని పవన్ విమర్శలు చేశారు. ఇందులో భాగంగానే ఈనెల 15న జరిగిన జనసేన జనవాణి కార్యక్రమంపై ఆంక్షలు విధించిందన్నారు. ఉత్తరాంధ్రపై తనకున్న ప్రేమ మాటల్లో వ్యక్తం చేయలేనిదని తెలిపారు. సిక్కోలు ఉద్యమం తనకు పోరాట అడుగులు నేర్పితే అక్కడి ఆట పాట తనను చైతన్యవంతుడిని చేశాయని పవన్ కళ్యాణ్ అన్నారు.
అధికార పార్టీకే భావ స్వేచ్ఛ ఉంటుందని రాజ్యాంగంలో ఎక్కడైనా ఉందా అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. వైసీపీకి కొత్తగా కొమ్ములు పుట్టుకు రాలేదని.. కొత్తగా రాజ్యాంగం లేదని స్పష్టం చేశారు. వైసీపీ వ్యవహరిస్తున్న తీరుకు చెప్పు చూపించక ఏం చూపించాలని నిలదీశారు. పెద్ద స్థాయి అధికారులు కూడా వంగి వంగి సలాం చేస్తుంటే చెప్పు చూపించక ఏం చూపించాలన్నారు. తాము అధికారంలోకి రాగానే సీపీఎస్ రద్దు చేస్తామని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు.
Read Also: Perni Nani: పవన్ కళ్యాణ్‌పై దాడికి కుట్ర చేశామా? అరాచకాలు సృష్టించిన వారికి సన్మానాలా?
అటు తూర్పుగోదావరి జిల్లా రాజానగరంకు చెందిన జనసేన నేత బలరామకృష్ణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 3 అంబులెన్స్ సర్వీసులను పవన్ కళ్యాణ్ ఆదివారం నాడు ప్రారంభించారు. దాదాపు రూ.30 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన ఈ 3 అంబులెన్సులు రాజానగరం నియోజకవర్గంలో ఉచితంగా సేవలు అందిస్తాయని జనసేన వర్గాలు తెలిపాయి. వీటిలో అత్యాధునిక వెంటిలేటర్లు, అధునాతన లైఫ్ సపోర్ట్ యంత్రాలతో పాటు 40 రకాల వైద్య పరికరాలు అందుబాటులో ఉంటాయని పేర్కొంది.