ఎప్పుడో చనిపోయిన నెహ్రూ, ఇందిరాగాంధీ పేర్లతో రాజకీయమేంది?
కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం జరిగింది.. దేశంలో 157 మెడికల్ కాలేజీలు ఇస్తే తెలంగాణకు ఒక్కటి కూడా రాలేదని అసెంబ్లీలో సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఇదేనా ఫెడరల్ వ్యవస్థ?.. తెలంగాణకు రావాల్సిన రూ.470 కోట్లు ఏపీకి ఇచ్చారన్నారు. తెలంగాణరకు నిధులు ఇవ్వాలని ఏడేళ్ల నుంచి అడుగుతున్నామన్నారు. కానీ అధికార ప్రతిపక్షాలు పట్టించుకోవట్లేదని ఆరోపించారు. నువ్వెన్ని ప్రభుత్వాలు కూలగొట్టావంటే నువ్వెన్ని అంటూ మోడీ, రాహుల్ గొడవపడుతున్నారన్నారు. ఎప్పుడో చనిపోయిన నెహ్రూ, ఇందిరాగాంధీ పేర్లతో రాజకీయమేంది?. బీజేపీ అధికారంలోకి వచ్చాక 20 లక్షల మంది దేశ పౌరసత్వాన్ని వదిలేశారని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.. ఇంత దౌర్భాగ్య పరిస్థితి ఎందుకు వచ్చింది? . పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు.. ఢిల్లీకి కూడా నీళ్లు ఇవ్వడం లేదన్నారు కేసీఆర్. మోడీ కంటే మన్మోహన్‌సింగ్ ఎక్కువ పనిచేశారు. ఆయన బాగా పనిచేసినా బీజేపీ బద్నాం చేసిందని బీజేపీని ఉద్దేశించి కేసీఆర్ ప్రసంగించారు. కాంగ్రెస్ బాగా పనిచేయలేదని 2014లో మోడీకి ఓటేశారు.. పెనంపై నుంచి పొయ్యిలో పడ్డట్టు అయ్యింది.. మన్మోహన్ కంటే మోడీ పాలనలో దేశం ఎక్కువ నష్టపోయింది. దేశం పరిస్థితి క్రిటికల్‌గా ఉంటే మోడీ మాట్లాడట్లేదని కేసీఆర్ అన్నారు.
తెలంగాణ మండలి డిప్యూటీ ఛైర్మన్ గా బండ ప్రకాష్
తెలంగాణ శాసన మండలి డిప్యూటీ చైర్మన్‌గా ఎమ్మెల్సీ బండ ప్రకాశ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ బండ ప్రకాశ్ కు శుభాకాంక్షలు తెలిపారు. వెనుకబడిన సామాజిక వర్గం నుంచి అత్యున్నత స్థానానికి ఎదిగారని కేసీఆర్ అన్నారు. ఈ మేరకు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రకాశ్ ఎన్నిక గురించి ప్రకటించారు. బండ ప్రకాశ్‌ను ముఖ్యమంత్రి సాదరంగా ఆహ్వానించి చైర్‌లో కూర్చోబెట్టారు. అనంతరం సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. మండలి డిప్యూటీ చైర్మన్‌గా బండ ప్రకాశ్ ఏకగ్రీవంగా ఎన్నికవడం తమకెంతో ఆనందదాయకమని చెప్పారు. మంచి విద్యాధికులుగా పేరు తెచ్చుకున్నారని వెల్లడించారు. విద్యార్థిగా ఉంటూనే రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్నారని తెలిపారు. కౌన్సిల్ డిప్యూటీ చైర్మన్‌గా పదవీ బాధ్యతలు చేపట్టడం గర్వకారణమన్నారు. ఆయన సేవలు తెలంగాణ ప్రజానీకానికి ఎంతో అవసరమని చెప్పారు. డిప్యూటీ చైర్మన్‌గా సభలో ఫలవంతమైన చర్చలకు అవకాశం కల్పించాలని కోరుకుంటున్నాని తెలిపారు.
ప్రధాని మోడీపై భట్టి కౌంటర్లు.. శాస్త్రీయ దృక్పథం లేదని విమర్శలు
సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రధాని నరేంద్ర మోడీపై విమర్శలు గుప్పించారు. ప్రధానికి శాస్త్రీయ దృక్పదం లేదని.. కరోనా వస్తే చప్పట్లు కొట్టండి, దీపాలు పెట్టండి అన్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. బహుళ జాతి సంస్థలను అమ్మేస్తున్నారని మండిపడ్డారు. ఆర్థికంగా ఉన్నవారు, ఆర్థికంగా లేనివారుగా దేశాన్ని విభజిస్తున్నారని ఆరోపించారు. సెక్యులర్ ఆలోచన కలిగిన నాయకత్వం ఈ దేశానికి అవసరమన్నారు. పాలమూరు రంగారెడ్డి ఏమైందని ప్రశ్నించిన ఆయన.. తెలంగాణకి కృష్ణా నదిలో నీటి వాటా ఎందుకు జరగడం లేదు? దశాబ్ద కాలం అవుతున్నా ఎందుకిలా జరుగుతుంది? దీనిపై పోరాటం చేయాల్సిందేనని పిలుపునిచ్చారు. ఈసారి ప్రవేశపెట్టిన బడ్జెట్ చాలా పెద్దదని, ఇప్పటివరకూ మొత్తం 9 బడ్జెట్‌లు ప్రవేశ పెట్టారని అన్నారు. నిధులు, నీళ్లు, నియమకాల కోసం ఉద్యమం జరిగిందని.. తెలంగాణ ఉద్యమంతో పాటు నక్సల్ బరి ఉద్యమం కూడా జరిగిందని భట్టి విక్రమార్క గుర్తు చేసుకున్నారు. అయితే.. ఎన్ని ఉద్యమాలు చేసినా ఫెయిల్ అవ్వడంతో, సమస్యల పరిష్కారానికి తెలంగాణ రాష్ట్రమే దిక్కు అని నిర్ణయానికి వచ్చారని అన్నారు. పోరాటంలో అందరూ కలిసి పని చేశారని.. తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలంతా సహకరించారని అన్నారు. రాష్ట్రం ఏర్పడాలి, ఆకాంక్షలు నెరవేరాలి అనేదే అందరి లక్ష్యం, ఉద్దేశమన్నారు. ఇప్పుడు నిరుద్యోగం అతిపెద్ద సమస్యగా మారిందని, అందరికీ ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పారు. విద్యకు కేటాయింపులు పెంచాలని, పొడుభూముల పంపకం తేదీ త్వరగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. పంచాయతీ నిధులుపై ఫ్రీజింగ్ పెడుతున్నారని, అలా చేయొద్దని కోరారు. జర్నలిస్టులకి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని అడిగారు.
ఏయూలో గంజాయి కలకలం
ఏపీలో ప్రతిరోజూ ఏదో ఒక ప్రాంతంలో గంజాయి గుప్పుమంటోంది. గంజాయి, మత్తుపదార్ధాలు యథేచ్ఛగా రవాణా అవుతున్నాయి. తాజాగా ఆంధ్రా యూనివర్శిటీలో గంజాయి దొరకడం కలకలం రేపుతోంది. ఆంధ్రావిశ్వవిద్యాలయంలో గంజాయి విక్రయిస్తున్నారు సెక్యూరిటీ గార్డులు. ఈనేపథ్యంలో సమాచారం అందుకున్న పోలీసులు దాడులు చేశారు. రెడ్ హ్యండెడ్ గా పట్టుకున్నారు పోలీసులు. ఏయూ సెక్యూరిటీ ఆఫీసర్ కారు డ్రైవరే కీలక సూత్రధారిగా తేలింది. నలుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. పరారీలో ఉన్న మరొకరి కోసం గాలిస్తున్నారు. రెండు వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి,దర్యాప్తు చేస్తున్నారు త్రీ టౌన్ పోలీసులు. చదువుల నిలయం ఏయూలో గతంలో గంజాయి వాడుతున్నారని ఆరోపణలు వచ్చాయి. తాజాగా సెక్యూరిటీ గార్డులే గంజాయిని రవాణా చేస్తూ అడ్డంగా దొరికిపోవడం సంచలనంగా మారింది. అధికారులు ఇలాంటి చర్యల పట్ల అప్రమతంగా ఉండాలని, బాధ్యులను కఠినంగా శిక్షించాలని విద్యార్ధులు, విద్యార్థి సంఘాలు కోరుతున్నాయి.
కులం నా అతి పెద్ద రాజకీయ ప్రత్యర్థి
ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమల్‌హాసన్ కులంపై కీలక వ్యాఖ్యలు చేశారు. కులం తన అతిపెద్ద రాజకీయ ప్రత్యర్థి అంటూ అభివర్ణించారు. ప్రముఖ తమిళ సినీ దర్శకుడు పా.రంజిత్ తన నీలం కల్చరల్ సెంటర్‌లో నీలం బుక్స్‌ని ప్రారంభించిన తర్వాత మక్కల్ నీది మయ్యం అధ్యక్షుడు కమల్‌హాసన్ ప్రసంగించారు. “నా అతిపెద్ద ప్రత్యర్థి, నా రాజకీయ ప్రత్యర్థి కులం, ఇది నేను 21 సంవత్సరాల వయస్సు నుండి చెబుతున్నాను. నేను ఇప్పటికీ చెబుతున్నాను, నా అభిప్రాయం ఎప్పుడూ మారలేదు.” అని కమల్‌హాసన్ చెప్పారు. చక్రం తర్వాత మనిషి సృష్టించిన గొప్ప సృష్టి భగవంతుడు.. మన సొంత సృష్టి మనపై దాడి చేస్తే మనం అంగీకరించలేమని ఆయన అన్నారు. ఈ సందర్భంగా కమల్‌హాసన్‌పై రంజిత్ ప్రశంసలు కురిపించారు. విమర్శకుల ప్రశంసలు పొందేలా సినిమాల్లో నటించారని కమల్ గురించి కొనియాడారు. తన నీలం పుస్తకాల గురించి మాట్లాడుతూ.. రాజకీయాలు ప్రజలకు అర్థమయ్యేలా, రాజకీయంగా బాధ్యత వహించే పుస్తకాలను మాత్రమే ఉంచాలనుకుంటున్నానని ఆయన చెప్పారు.
కేంద్రం తక్షణం బీసీల జన గణన జరపాలి
ఏపీలో స్తబ్ధుగా ఉన్న మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత ఎన్.రఘువీరా రెడ్డి మళ్లీ యాక్టివ్ అవుతున్నారు. సమాజంలో కులాల తీసివేత సాధ్యం కాదన్నారు. యాబై ఏళ్ల క్రితం బీపీ మండల్ బీసీ జనగణన చేయాలని రిపోర్ట్ ఇస్తే ఇప్పటి వరకు అమలు జరగలేదు. కేంద్రం తక్షణం బీసీల జన గణన జరపాలన్నారు. బీపీ మండల్ కమిషన్ రిపోర్ట్ అమలు చేయాలి. చట్ట సభలలో జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ లు రావాలన్నారు రఘువీరారెడ్డి. జనాభా ప్రాతిపదికన 52 శాతం విద్య ఉద్యోగాల్లో రిజర్వేషన్ లు ఇవ్వాలి. బీసీ ల కుల జన గణన జరగాలి. బీహార్, రాజస్తాన్ ప్రభుత్వాలు బీసీ జనగణన చేస్తున్నారు..మన రాష్ట్ర ప్రభుత్వం కూడా త్వరలోనే బీసీ జనగణన చేయబోతుందన్నారు. బీపీ మండల్ సిఫారసులు అమలయ్యే వరకు పార్టీల కు అతీతంగా నాయకులు అందరూ పోరాటం చేయాలన్నారు. మంత్రులతో బీసీ నాయకుల అజెండా సాధనా ప్రమాణం చేయించారు మాజీ మంత్రి రఘువీరా రెడ్డి.
మండలిలో మంత్రి తలసాని, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డిల మధ్య మాటల యుద్ధం
తెలంగాణ అసెంబ్లీలోని శాసనమండలిలో మంత్రి తలసాని, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డిల మధ్య ఒక మినీ యుద్ధమే చోటు చేసుకుంది. బీసీ వెల్ఫేర్ ప్రశ్నపై సభ్యులు, మంత్రి మాట్లాడుతున్న సమయంలో.. మంత్రి తలసాని మధ్యలో కల్పించుకొని మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ, బీసీల మీద ప్రశ్నలు వచ్చినప్పుడు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. గతంలో పాలకు ఎవ్వరూ ఇన్సెంటివ్ ఇవ్వలేదని.. తమ ప్రభుత్వం మాత్రమే ఇచ్చిందన్నారు. ఇందుకు జీవన్ రెడ్డి బదులిస్తూ.. నువ్వు ముందు నీ శాఖకు సంబందించిన పనులు చూసుకో అని, తర్వాత వేరే శాఖ మీద మాట్లాడు అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాను ఆల్రెడీ ఎస్సీ వెల్ఫేర్ గురించి మాట్లాడానని, అప్పుడు నువ్వు నిద్రపోయినట్టున్నావని ఎద్దేవా చేశారు. నీ శాఖలో పాలకు ఇన్సెంటివ్ రూ.4 ఇస్తానని చెప్పి నాలుగేళ్లు అవుతుందని, అది ఎప్పుడు ఇస్తారో చెప్పు అని నిలదీశారు. ఇంతలో మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అందుకొని.. ఒక లీటర్ పాలకు ఒక రూపాయి ఇన్సెంటివ్ ఇవ్వాలని సీఎం కేసిఆర్‌ను కోరితే.. రూ. 4 ఇచ్చిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు.
మంత్రి అమర్నాథ్ ఆస్తులపై విచారణ జరగాలి
ఏపీలో మంత్రి గుడివాడ అమర్నాథ్, టీడీపీ, జనసేన నేతల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. ఉత్తరాంధ్ర టీడీపీ జోనల్ ఇన్ఛార్జ్ బుద్ధా వెంకన్న మంత్రి అమర్నాథ్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆస్తులపై బహిరంగ చర్చకు రావాలని సవాల్ చేశారు. ఎన్నికల అఫిడవిట్లో ఇచ్చిన నీ ఆస్తులు ఎంత ఇప్పుడు ఉన్న నీ ఆస్తులు ఎంత? గుడివాడ అమర్నాథ్ ఫస్ట్ అండ్ లాస్ట్ ఎమ్మెల్యే. నువ్వు ఎక్కడ పోటీ చేసిన ఓడిపోతావు.. ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటావా?
మంత్రి అమర్నాథ్ కు దమ్ముంటే మా సవాల్ స్వీకరించాలి అన్నారు బుద్దా వెంకన్న. రాయలసీమ తరహాలో ఇక్కడ వ్యాపారస్తుల నుండి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నావు. విస్సన్నపేటలో 600 ఎకరాలు భూ కబ్జాలో విజయసాయి రెడ్డికి వాటా ఇచ్చావు కాబట్టి, నీకు మంత్రి పదవి ఇచ్చారు. గుడ్డు కోడి అవడానికి సమయం పడుతుంది అన్నావు. గుడ్లు మీరే తినేస్తే ఇక కోడి ఎలా అవుతుంది? కాపు సామాజిక వర్గం పేరుతో గెలిచిన నీవు సిగ్గు లేకుండా కాపులను తిడుతున్నావు. మాజీ మంత్రి చేగొండి హరి రామ జోగయ్యకి లేఖ రాయడం కాదు, పార్టీ కోసం కష్టపడ్డ షర్మిలకు మంత్రి పదవి ఇవ్వమని మీ ముఖ్యమంత్రికి లేఖ రాయాలన్నారు బుద్దా వెంకన్న.
భర్తను అవమానిస్తే నయన్ ఊరుకుంటుందా.. అందుకే ఆ పని..?
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ ఈమధ్యనే తెగింపు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. అయితే ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అయితే అందుకోలేకపోయింది. దీంతో అజిత్ అభిమానులు కొద్దిగా నిరాశను వ్యక్తపరిచారు. ఇక ఈ సినిమా తరువాత అజిత్, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ విగ్నేష్ శివన్ దర్శకత్వంలో AK62 ప్రకటించిన విషయం తెల్సిందే. ఈ చిత్రంలో అజిత్ సరసన లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ గా ఫిక్స్ అయ్యినట్లు వార్తలు వచ్చాయి. నయన్, విగ్నేష్ పెళ్లి తరువాత చేస్తున్న మొదటి ప్రాజెక్ట్ అవడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు పెరిగిపోయాయి. అంతేకాకుండా అజిత్- నయన్ ది హాట్ కాంబో. వారిద్దరు కలిసి మూడు సినిమాలు తీయగా.. మూడు బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నాయి దీంతో ఈ సినిమా కూడా హిట్ టాక్ అందుకుంటుందని అజిత్ అభిమానులు ధీమాగా ఉన్నారు. అయితే ఇప్పుడు ఇదంతా తల్లకిందులుగా మారినట్లు తెలుస్తోంది.
రెండుపార్టీలు ప్రజల్లోకి వెళ్ళే పరిస్థితి లేదు
ఏపీలో అధికార వైసీపీ, విపక్ష టీడీపీపై విరుచుకుపడ్డారు బీజేపీ నేత, జాతీయ కార్యదర్శి సత్యకుమార్. అనంతపురంలో ఆయన మాట్లాడుతూ.. రెండు రోజుల కిందట జగనాసుర రక్తచరిత్ర అని టీడీపీ పుస్తకం విడుదల చేసింది. టీడీపీని సమర్థించక పోయినా అందులో నిజం ఉంది. రెండు పార్టీలు టైటిల్ పెట్టి బుక్కులు వేశారు. వివేకానందరెడ్డి కేసులో అసలైన సూత్రధారులు ఎవరు అన్నది తేలాలి. ఇప్పటికే పాత్రదారులు లోపల ఉన్నారు. ఏ ప్యాలెస్ నుంచి ఏ టైంలో ఎంతసేపు మాట్లాడారు అన్నది విచారణలో బయటికి వస్తుంది. లిక్కర్ స్కాం లో ఎవరు ఉన్నా చట్టం ప్రకారం శిక్ష తప్పడం లేదు. రెండు పార్టీ ల విమర్శలతో ఏపీలో అభివృద్ధిపై చర్చ చేయలేదు. మార్చి 13 న ఎమ్మెల్సీ ఎన్నిక ఉంది. జగన్ నాలుగేళ్ళలో ఏమి చేయక పోగా అన్ని వర్గాలను మోసం చేశారు.ప్రజల్లోకి వెళ్ళే పరిస్థితి లేదు. గతం లో చేసిన టక్కుటమార విద్యల తో గెలవాలని చూస్తున్నారు. రాష్ట్రానికి ఫ్యాక్టరీ లు తెమ్మంటే దొంగ ఓట్లు ఫ్యాక్టరీ తెచ్చారు. పెద్ద ఎత్తున దొంగ ఓట్లు నమోదు చేశారు. వాటి పై ఎన్నికల కమిషన్ కి ఆధారాలతో ఫిర్యాదు చేస్తాం. రేపు జరిగే ఎన్నికల్లో అవకతవకలకు పాల్పడి ముందస్తుకు వెళ్ళాలి అని చూస్తున్నారని విమర్శించారు సత్య కుమార్.