ఆదిలాబాద్ జిల్లాలో టీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య వార్ నడుస్తోంది. అధికారంను అడ్డంపెట్టుకోని అరెస్ట్‌లు చేయిస్తున్నారని బీజేపీ నేతలు రాస్తారోకో చేపట్టగా ఆసమయంలో మహిళ ఎస్సై పై బీజేపీ నేత చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి. మహిళ సంఘాలు, టీఆర్ఎస్ నేతలు బీజేపీ నేత వ్యాఖ్యలపై మండిపడ్డారు. అరెస్ట్ చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇంతకీ నేత ఎవ్వరు ఏమన్నారు…ఆ ఇష్యూ ఏంటీ..
ఆదిలాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు పాయల్ శంకర్ జైనాథ్ ఎస్ఐ పెర్సిస్ బిట్లనుద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశాడని మహిళసంఘాలు ఆందోళన బాటపట్టాయి.. జైనాథ్ మండలం ఆనంద్ పూర్ గ్రామానికి చెందిన విశాల్ అనే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను ఓ కేసులో పోలీసులు అరెస్ట్ చేసారు. అయితే అక్రమంగా తీసుకెళ్లి.. ఎక్కడో పెట్టారని బీజేపీ నాయకులు, కాంగ్రెస్ నాయకులు జైనాథ్ పోలీస్ స్టేషన్ ముందు రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు. ఈక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్ మహిళా ఎస్ఐ ని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు..
ఈ వ్యాఖ్యలపై పెద్దదుమారం రేగింది.. మరుసటి రోజు టీఆర్ఎస్ మహిళా విభాగం ఆధ్వర్యంలో కలెక్టరేట్ చౌరస్తా వద్ద పాయల్ శంకర్ ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. పాయల్ శంకర్ ను అరెస్ట్ చేయాలని ఏకంగా డీఎస్పీకి సైతం ఫిర్యాదు చేశారు.
పాయల్ శంకర్ వ్యాఖ్యలను టీఆర్ఎస్ నేతలు తీవ్రంగా ఖండించారు. అలాగే పోలీసు అసోసియేషన్ సైతం మహిళ ఎస్ఐని కించపర్చే వ్యాఖ్యలు చేసిన శంకర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ నేతలు ప్రెస్ మీట్ పెట్టి మరీ బీజేపీ నేతల వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక మరో వైపు జైనాథ్ పోలీస్ స్టేషన్ ముందు ధర్నా ఇష్యూలో పాయల్ శంకర్ సహా ఐదుమందిపై కేసునమోదు చేసారు పోలీసులు.