పదవులు అనేవి కొంచెం కాలమే ఉంటాయని, పుట్టిన ప్రతి మనిషికి ఎప్పుడూ అవే పదవులు శాశ్వతం అనుకోవద్దని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. పదవి శాశ్వతం అని ఎవరైనా అనుకుంటే అది పగటి కలలు కన్నట్లే అని వ్యాఖ్యానించారు. ఎంతోమంది ముఖ్యమంత్రులు, ప్రధాన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పదవులు అనుభవించి కాలగర్భంలో కలిసిపోయారని, కానీ ప్రజల కోసం పాటు పడినవారే ప్రజల గుండెల్లో నిలిచిపోతారని చెప్పారు. చనిపోయినా, పదవినుంచి దిగిపోయినా, ఏ పదవీ లేకున్నా ప్రజల మనసుల్లో స్థానం ఉన్నవాళ్లకే మళ్లీ అవకాశం ఉంటుందన్నారు. ఏ పదవి లేకున్నా ప్రజలమధ్యకు వెళ్తే ప్రజల అభిమానం ప్రతి నాయకుడికి, ప్రజాప్రతినిధికి అవసరం అన్నారు. స్వాతంత్రం వచ్చి ఐదు దశాబ్దాలు దాటినా.. నేటికీ తెలంగాణ రాష్ట్రంలోని మారుమూల పల్లెల్లో పూరి గుడిసెల్లో పేదవాళ్ల ఉన్నమాట వాస్తవమే అని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధికారంలో ఉన్నప్పుడు పేదల సంక్షేమం కోసం పని చేయాలని, అప్పుడు వారికి న్యాయం జరుగుతుందన్నారు.
వైరా పట్టణంలో యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహావిష్కరణలో అన్ని రాజకీయ పార్టీలు పాల్గొన్నాయి. అయితే ఎమ్మెల్యే రాములు నాయక్ మాత్రం హాజరు కాలేదు.. పొంగులేటి పాల్గొంటుండడంతో ఎమ్మెల్యే రాములు నాయక్ పాల్గొనలేదని సమాచారం. పొంగులేటి వైరా పర్యటనలో భాగంగా మున్సిపాలిటీలో రెండు చోట్ల జరిగిన అంబేద్కర్ విగ్రహావిష్కరణలో ట్విస్టులు చోటు చేసుకున్నాయి. అయినా వైరా మున్సిపాలిటీ పరిధిలో జరిగిన అంబేద్కర్ విగ్రహావిష్కరణలకు టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే వర్గీయులు హాజరు కాలేదు. టీఆర్‌ఎస్ పార్టీ నేత రాష్ట్ర మార్కెటింగ్ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్, మున్సిపల్ చైర్మన్ జైపాల్, టీఆర్‌ఎస్ పార్టీకి చెందిన ఎంపీపీ మధు, ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పువాళ్ల దుర్గాప్రసాద్, సీపీఐ, ప్రజపందా నేతలు పాల్గొన్నారు.