ఏపీలో బీజేపీ అభ్యర్థుల జాబితా ప్రకటన నాటి నుంచి కొనసాగుతున్న సస్పెన్స్ వీడిపోయింది. నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు టీడీపీలో చేరారు. పాలకొల్లు ప్రజాగళ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో ఆయన సైకిల్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఎంపీ రఘురామకృష్ణంరాజుకు చంద్రబాబు టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఏపీలో పింఛన్ దారుల్లో వాలంటీర్లకు మంచిపేరు తెచ్చి పెట్టిందని ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోసాని కృష్ణ మురళి తెలిపారు. చంద్రబాబు హయాంలో రెండు మూడు రోజుల సమయం పట్టేదని.. పింఛన్ కోసం వెళ్లి ఎంతో మంది చనిపోయారని ఆయన విమర్శించారు. వాలంటీర్లు పింఛన్ దారులకు దేవుళ్లుగా కనిపించారన్నారు.
రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో ప్రజాగళంకు భారీ స్పందన వస్తోందని.. వచ్చే 39రోజుల్లో జోరు పెరగాలి, ఫ్యాన్ తుక్కు తుక్కు కావాలని టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. తూర్పు గోదావరి జిల్లా నల్లజర్ల ప్రజాగళం సభలో చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో దొంగలు పడ్డారు.. బందిపోట్లు పడ్డారు.. వారందరికీ నాయకుడు జగన్ అంటూ విమర్శించారు.
చంద్రబాబు 14 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా చేశారని.. మరి ఆయన చేసిన ఒక మంచి పనైనా గుర్తుకు వస్తుందా సీఎం జగన్ ప్రశ్నించారు. ఆయన మార్క్ పథకం ఏదీ లేదని.. ఆయన పేరు చెబితే గుర్తుకు వచ్చేది వెన్ను పోట్లు.. అబద్ధాలు.. కుట్రలు, కుతంత్రాలు అని విమర్శించారు. అందుకే నా అనేవాళ్ళు కోట్ల మంది ఉంటే చంద్రబాబుకు మాత్రం పక్క రాష్ట్రంలో ఉన్నారన్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబును కాపాడేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి ఎప్పుడూ ముందుంటారని మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. పురంధేశ్వరి బీజేపీ నేతగా కంటే చంద్రబాబుకు మేలు చేసేలా పని చేస్తున్నారని విమర్శించారు.