CM Jagan: కొనకనమిట్ల మేమంతా సిద్ధం సభలో సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వంలో మంచి జరుగుతోందని గీతాంజలి చెప్పడమే ఆమె చేసిన పాపమని.. తన మనుషులతో సోషల్‌మీడియాలో గీతాంజలిని వేధించి చంపారని ఆయన ఆరోపించారు. 20 జెలొసిల్ ట్యాబ్లెట్లు వేసుకున్నా తగ్గని కడుపుమంట చంద్రబాబులో కనిపిస్తోందన్నారు. అసూయ, కుళ్లు, కడుపు మంటతో చంద్రబాబు బాధపడుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. చంద్రబాబు పేరు చెబితే ఒక్క పథకమైనా గుర్తుకువస్తుందా అంటూ ప్రశ్నించారు. మహిళల సాధికారితకు పెద్దపీట వేశామని.. ఆక్వారైతులకు రూపాయిన్నరకే విద్యుత్ అందించామని, వందేళ్ల తర్వాత భూముల్ని రీ సర్వే చేయిస్తున్నామని సీఎం జగన్ వివరించారు. ప్రతీ ఇంటికీ మంచి కోసం మనం అధికారాన్ని ఉపయోగించామన్నారు. మేం చేసిన పనులన్నీ కళ్ల ముందు కనిపిస్తున్నాయని.. చంద్రబాబు మాత్రం దోచుకోవడం కోసం అధికారాన్ని దుర్వినియోగం చేశారని సీఎం జగన్ విమర్శించారు. చంద్రబాబు చరిత్ర ఏంటో అందరికీ తెలుసన్నారు. జన్మభూమి కమిటీలతో పేదలను ఇబ్బంది పెట్టారన్నారు 2014లో ఈ ముగ్గురే కూటమిగా ఏర్పడ్డారు. ముఖ్యమైన హామీలు అంటూ చంద్రబాబు ఇంటింటికి కరపత్రాలు పంపించారని.. 2014లో ఈ మూడు పార్టీలు ఏం హామీలిచ్చాయో అందరికి తెలుసన్నారు. పొదుపు సంఘాల రుణాలు పూర్తిగా మాఫీ చేస్తామన్నారు.. చేశారా?. నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు.. నెలకు రూ.2వేలు ఇచ్చారా?’’ అంటూ సీఎం జగన్ నిలదీశారు.
Read Also: Chandrababu: పామర్రు ప్రజాగళంలో చంద్రబాబు కొత్త హామీ
డీబీటీ ద్వారా పేదలకు నేరుగా న్యాయం చేశామన్న సీఎం జగన్.. పేదలకు పథకాలు ఇస్తుంటే రాష్ట్రం శ్రీలంక అవుతుందని చంద్రబాబు ప్రచారం చేస్తున్నారన్నారు. ప్రజలకు సేవ చేస్తున్న వాలంటీర్లపై అన్యాయంగా అభాండాలు వేస్తున్నారని మండిపడ్డారు. ప్రతీ గ్రామానికి, నగరానికి, రాష్ట్రంలోని ప్రతీ ప్రాంతానికి, వర్గానికి మంచి చేశామని చూపిస్తున్నామని.. 2.75 లక్షల కోట్లు పేదల ఖాతాల్లోకి నేరుగా జమ చేశామన్నారు. ఎన్నికలప్పుడు మ్యానిఫెస్టోలో చెప్పినవన్నీ చేయటం చూపించామన్నారు. ప్రతీ ఇంటా జగన్ మార్క్ ఏంటో చూపించామని సీఎం తెలిపారు. 58 నెలల ప్రోగ్రెస్ రిపోర్ట్ చూస్తే అందరికీ అర్థం అవుతుందన్నారు. గ్రామ గ్రామాన వార్డు, గ్రామ సచివాలయాలు.. ప్రతీ గ్రామాన రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. గ్రామ గ్రామాన విలేజ్ హెల్త్ క్లినిక్.. ఫ్యామిలీ డాక్టర్, ఆరోగ్య సురక్షా.. ప్రతీ అవ్వా, తాతకు ఇంటికి మూడు వేల పెన్షన్ అందించామని సీఎం తెలిపారు.
సీఎం జగన్ మాట్లాడుతూ..” రైతన్నలకు భరోసా.. ఉచిత పంట భీమా.. ఆక్వా రైతులకు రూపాయిన్నరకే కరెంట్.. పాడి రైతులకు ధరలు పెంచింది మీ బిడ్డ జగన్.. 100 ఏళ్ల తర్వాత భూముల రీ సర్వే.. ఇన్ని విప్లవాలు ఒక్క మీ బిడ్డ జగన్ పాలనలోనే.. మన పాలన, సంక్షేమం చూస్తుంటే చంద్రబాబుకు 20 జెలుసిల్ మాత్రలు వేసుకున్నా తగ్గనంత అసూయ.. నాడు, నేడుతో ప్రభుత్వ బడుల రూపు రేఖలు మారాయి.. చదువులు మారాయి.. ప్రతీ ఒక్కరికీ ఇంగ్లీష్ మీడియం విద్య.. అమ్మఒడి, విద్యా కానుక, గోరుముద్ద పథకాలు.. విద్యార్దులకు ట్యాబ్‌లు.. పేదలు అప్పులపాలు కాకుండా ఆరోగ్య శ్రీ విస్తృతం చేశాం.. వైద్య రంగంలో 54 వేల పోస్టులు.. రాష్ర్టంలో కొత్తగా 17 మెడికల్ కళాశాలలు.. ప్రతీ అక్కచెళ్లెమ్మల భద్రత కోసం ఫోన్‌లో దిశా యాప్.. స్వయం ఉపాధికి తోడుగా అన్నీ వర్గాలకు ప్రభుత్వ సాయం.. 50 శాతం మహిళలకు రిజర్వేషన్లు.. సామాజిక న్యాయానికి అర్థం చెబుతూ 2.31 లక్షల పోస్టులు.. ఉద్యోగాల్లో 80 శాతం నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకే.. 13 జిల్లాలను 26 జిల్లాలు చేశాం.. ప్రతీ గ్రామంలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి కనిపిస్తుంది. పది ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం జరుగుతుంది.. భోగాపురం ఎయిర్ పోర్టు నిర్మాణ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి.. నేను చెప్పినవన్నీ వాస్తవాలు.. ఏవీ కల్పితాలు కావు.” అని సీఎం తెలిపారు.