Botsa Satyanarayana: గతంలో పొరుగు రాష్ట్రాలు చూడడానికి వెళ్లామని, ఇప్పుడు పొరుగు రాష్ట్రాలు మన ప్రభుత్వం వైపు చూసి వెళ్తున్నాయని ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. విజయనగరం జిల్లా శృంగవరపుకోట శిరికి రిసార్ట్స్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్.కోట మండల స్థాయి విస్తృత సమావేశంలో ముఖ్యఅతిధిగా మంత్రి పాల్గొన్నారు. ఏనాడూ చూడని సంక్షేమం ఈ ఐదేళ్లలో చూశామన్నారు. పార్టీలో పదవులు, అధికారం అనుభవించిన వాళ్లు పార్టీ నుంచి పోతే వాళ్లను తలదన్నే వాళ్లు వస్తారన్నారు. వాళ్లు పార్టీ మారినా భయం లేదని.. వాళ్లు గొప్పవాళ్లమని అనుకుంటున్నారని.. అదేమీ లేదని అంతా భ్రమ అని అన్నారు. పార్టీ మారడమనేది వ్యక్తిగతమని.. పార్టీ నుంచి వెళ్లేవారు పదవులకు రాజీనామా చేసి వెళ్లాలన్నారు.
Read Also: Ambati Rambabu : చంద్రబాబుకు నన్ను విమర్శించే నైతిక హక్కు లేదు
పార్టీ బీఫాంతో తీసుకున్న పదవులు పెట్టుకుని ప్రజల్ని మోసం చేయడం నాయకత్వమా అంటూ మంత్రి ప్రశ్నించారు. ఈ గెంతులు, ఎత్తులు 40 రోజులేనని.. మళ్లీ జగన్ అన్న ప్రభుత్వం రావటం ఖాయమన్నారు. ఇంత బలం ఉన్న వారు ముసుగులు వేసుకుని ఎందుకు తిరుగుతున్నారని ప్రశ్నించారు. అందరికి ఎమ్మెల్యేగా తాను, ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ అందుబాటులో ఉంటామన్నారు. పిటిషన్లు పెట్టి, ఫిర్యాదులు చేసి పింఛన్లను అడ్డుకున్న వాళ్లు ఇప్పుడు మాకు సంబంధం లేదనటం చూస్తే సిగ్గేస్తోందన్నారు. కూటమిలో కొత్త కుట్రలు పురుడు పోసుకుంటూ ఉన్నాయన్న మంత్రి.. వాటిని చూసి భయపడాల్సిన అవసరం లేదన్నారు. ఒక అమ్మ కలెక్టర్లు, ఎస్పీలను మార్చాలని అంటోందని.. గత ప్రభుత్వంలో పనిచేసిన వాళ్లు కాదా అంటూ మంత్రి ప్రశ్నించారు. వాళ్లను మేము నియమించామా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.