Off The Record: నలుగురికి నచ్చ చెప్పే నాయకుడు! అధిష్టానం దగ్గర చొరవ ఉన్న నేత! ఆలాంటి సీనియర్ లీడర్ ఇప్పుడు అలిగి కూర్చున్నారు! పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు! పైగా పార్టీ మారిపోతారని ప్రచారం జరుగుతోంది! ఇంత జరుగుతున్నా అధిష్టానం రియాక్ట్ కావడం లేదేంటి?అంటే.. ఆయన్ని లైట్ తీసుకుందా? ఇంతకూ ఎవరా నేత? ఏంటా కథ!
ఉమ్మడి జిల్లాలోనే కాదు, ఉమ్మడి రాష్ట్రంలో కూడా తనదైన శైలిలో రాజకీయాలు నడిపిన దళిత సామాజికవర్గానికి చెందిన నేత- మాజీమంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్! ప్రస్తుతం వైసీపీలో కొనసాగుతున్న ఆయన, గుంటూరు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చూస్తున్నారు. అయినా ఎక్కడో అసంతృప్తి డొక్కాను వెంటాడుతోంది. కొద్ది నెలలుగా ఆయన పార్టీలో ఆంటీ ముట్టినట్లుగానే ఉంటున్నారు. తాడికొండ నియోజకవర్గంలో జరిగిన సామాజిక సభలో నేరుగా ఒక్కసారి సీఎంని కలిసే అవకాశం కల్పించండి అంటూ బహటంగానే కామెంట్లు చేశారు. అది అప్పట్లో తీవ్ర చర్చనీయాంశం అయింది. అధిష్టానం కూడా ఈ వ్యవహారంపై సీరియస్ అయినట్లు తెలిసింది. అందుకే ఆ తర్వాత డొక్కాను పార్టీ పెద్దగా పట్టించుకోవడం లేదని చర్చ జరిగింది. ఎందుకంటే అధిష్టానాన్ని సుతిమెత్తగా కోరాల్సిన నాయకులు, బాహాటంగా బహిరంగ సభల్లో టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేయటం అధిష్టానానికి ఆగ్రహం తెప్పించింది. ఈ నేపథ్యంలోనే డొక్కా మాణిక్య వరప్రసాదును నేరుగా పక్కన పెట్టేయకుండా, ప్రియారిటీ తగ్గించారన్న చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో ఆయన కూడా తన పాత గూటికి చేరేందుకు సిద్ధమైపోతున్నారని వార్తలొస్తున్నాయి. మరి ఆ పూర్వాశ్రమం కాంగ్రెస్ పార్టీనా, లేదంటే మొన్నటి వరకు కొనసాగిన టీడీపీనా అన్నదే ఇప్పుడు అసలు ప్రశ్న?
అయితే డొక్కా మాత్రం పైకి పార్టీ మారేది లేదని, యాక్టివ్‌గా లేనంతే అని చెప్తున్నా.. లోపల మాత్రం వేరే పార్టీకి దగ్గరవుతున్నారనే మాట గట్టిగానే వినబడుతోంది. ఈ నేపథ్యంలోనే పల్నాడులోని ఓ మంత్రి రెండురోజుల క్రితం డొక్కాను కలిసి పార్టీని వదిలొద్దని, అధిష్టానంతో మాట్లాడి అన్ని సెట్ చేస్తానని.. అంతవరకు వేచి చూడమని సలహా కూడా ఇచ్చారట. అయితే డొక్కా మాత్రం ఒకటి క్లియగా చెప్పినట్టు తెలుస్తోంది. ఇప్పుడు తనకు పార్టీ మారే ఉద్దేశం ఉన్నా లేకపోయినా పార్టీలో తన పరిస్థితి ఏంటో, తన బాధ్యత ఏంటో అధిష్టానం చెప్పే వరకు యాక్టివ్ కాలేనని చెప్పారట.
తాడికొండ నియోజకవర్గం నుంచే డొక్కా రెండుసార్లు గెలిచారు. అక్కడి నుంచే తన రాజకీయ భవిష్యత్తును వెతుక్కున్న వరప్రసాద్ ఇప్పటికీ ఆ నియోజకవర్గం నుంచే పోటీ చేయాలని కోరుకుంటున్నారు. కానీ వైసీపీ అధిష్టానం ఇప్పటికే సీట్లు డిక్లేర్ చేసింది. దాదాపుగా గేట్లు క్లోజ్ చేసేసినట్లే. ఈ పరిస్థితుల్లో వేరే పార్టీకి వెళ్లినా సీటు వచ్చే అవకాశం లేదు. ఈ క్రమంలో పార్టీ మారితే అసలుకే ఎసరొచ్చే ప్రమాదం ఉందని అంచనా వేస్తున్నారు అయితే గతంలో రాజకీయ పార్టీల్లో తనకున్న పలుకుబడి, నాయకులతో ఉన్న పరిచయాలతో, పార్టీ మారినా ఎలాంటి ఢోకా, ఇబ్బంది ఉండదని సెకండ్ థాట్‌లో ఉన్నారట! ఈ తర్జన భర్జన క్రమంలో.. వైసీపీ అధిష్టానానికి దూరంగా జరిగితే.. దగ్గరయ్యేది ఏపార్టీకి? ఎలాంటి పాత్రలో ఆయన రీ ఎంట్రీ ఇస్తారు? లెట్స్ వెయిట్ అండ్ సీ!