ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు సమయం దగ్గర పడుతోన్న వేళ మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సంచలన ప్రకటన చేశారు.. ఇవే నా చివరి ఎన్నికలు.. నేను చివరి సారిగా ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను అని తెలిపారు. అయితే, వచ్చే ఎన్నికల్లో మా అబ్బాయి పోటీ చేస్తారు అని వెల్లడించారు.
ఒంగోలు ఎంపీ సీటుపై ఎవరికి? అనే చర్చ సాగుతూ వచ్చింది.. ఈ సారికి సిట్టింగ్ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డికి సీటు ఇచ్చే అవకాశం లేదనే చర్చ సాగింది.. అంతేకాదు.. ఆయన టీడీపీవైపు చూస్తున్నారని.. వైసీపీ టికెట్ రాకుంటే.. ఫ్యాన్ కింద నుంచి జరిగి.. సైకిల్ ఎక్కడం ఖాయమనే ప్రచారం విస్తృతంగా సాగింది.. అయితే, ఒంగోలు ఎంపీ సీటు విషయంలో అనిశ్చితి తొలగినట్లు సమాచారం..
వచ్చే ఎన్నికల్లో తాను వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచే.. అదికూడా ఒంగోలు నుంచే పోటీచేస్తానని స్పష్టం చేశారు బాలినేని.. విలువతోనే రాజకీయాలు చేస్తున్నా.. విలువల కోసమే మంత్రి పదవిని వదులకుని.. సీఎం వైఎస్ జగన్ వెంట నడిచానని తెలిపారు. సామాజిక సమీకరణాల నేపథ్యంలోనే ఎమ్మెల్యే స్ధానాల మార్పు జరుగుతోందన్నారు.
తెలంగాణలో సెటిలర్స్ ఉన్న ప్రాంతాల్లో టీడీపీ పూసుకుని, రాసుకుని ప్రచారం చేయటం వల్లే కాంగ్రెస్ ఓడిందని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. టీడీపీ ప్రచారం చేసిన ప్రాంతాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఓడారు.. కాబట్టి ఇక్కడ కూడా అదే పరిస్థితి ఉంటుందన్నారు.
నిరాధారంగా నాపై ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదు.. టీడీపీ నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడటానికి సిగ్గుండాలి అంటూ బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.