Balineni Srinivasa Reddy: తెలంగాణలో సెటిలర్స్ ఉన్న ప్రాంతాల్లో టీడీపీ పూసుకుని, రాసుకుని ప్రచారం చేయటం వల్లే కాంగ్రెస్ ఓడిందని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. టీడీపీ ప్రచారం చేసిన ప్రాంతాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఓడారు.. కాబట్టి ఇక్కడ కూడా అదే పరిస్థితి ఉంటుందన్నారు. టీడీపీ వాళ్లు ఎంత రోడ్ల మీదకు వచ్చినా ప్రజలు వైసీపీ వెంటే ఉన్నారని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణలో టీడీపీ సపోర్ట్ కాంగ్రెస్‌కు.. జనసేన సపోర్ట్ బీజేపీకి ఉందన్నారు. ఇక్కడ టీడీపీ, జనసేన పొత్తులు పెట్టుకుంటాయని.. వైసీపీ సీఎం జగన్ నాయకత్వంలో సింగిల్‌గా పోటీ చేస్తుందని ఆయన పేర్కొన్నారు. అసలు ఆ రెండు పార్టీలకు నైతికత ఉందా అంటూ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రశ్నించారు. అక్కడ ఎందుకు వ్యతిరేకంగా ఉన్నారు.. ఇక్కడ ఎందుకు కలిసి పనిచేయాలనుకున్నారో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలన్నారు.
Read Also: KP Nagarjuna Reddy: పార్టీలకతీతంగా ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు
ఓ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని ఓ స్నేహితుడితో జరిగిన పందెం గురించి మాట్లాడా మరో అంశం లేదన్నారు. మా అబ్బాయి బీఆర్ఎస్ గెలుస్తుందన్న నమ్మకంతో ఉన్నారని పందెం వేయలేదని చెప్పానన్నారు. మంత్రిగా ఉన్నప్పుడు ఎవరైనా పార్టీ కార్యక్రమాల కోసం ఇస్తే తీసుకున్నానని చెప్పానని.. రాజకీయాల కోసం నా ఆస్తులు పోగొట్టుకున్నానని బాలినేని తెలిపారు. సీఎం జగన్ తుఫాను బాధితుల పరామర్శకు వస్తే ఇష్టానుసారం మాట్లాడుతున్నారన్నారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు సైకిల్ మీద తిరిగారా అంటూ మండిపడ్డారు. సీఎం జగన్ అధికారులను అప్రమత్తం చేయటం వల్లే నష్టం తగ్గిందన్నారు. గుండ్లకమ్మ గేటు కొట్టుకుపోతే మొత్తం వైసీపీ మీద నెపం నెట్టాలని చూస్తున్నారని.. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ నేతలు ఏం చేశారని ఆయన ప్రశ్నించారు. త్వరలో గుండ్లకమ్మ గేట్లు ఏర్పాటు చేస్తామన్నారు. సీఎం జగన్ మరోసారి ముఖ్యమంత్రి కావటం ఖాయమన్న ఆయన.. ప్రతీ పేదవారు సీఎం జగన్‌ను గుండెల్లో పెట్టుకుని చూస్తున్నారన్నారు. 2024లో మళ్లీ సీఎంగా జగన్ అధికారంలోకి వస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. నాకు దాచుకునే అలవాటు లేకపోవటం వల్లే అన్నీ మాట్లాడేస్తున్నానని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వెల్లడించారు.