Kamran Akmal Younis Khan Reacts To Jay Shah Comments On Asia Cup: వచ్చే ఏడాది ఆసియా కప్ వన్డే టోర్నీని పాకిస్తాన్ వేదికగా నిర్వహిస్తే.. టీమిండియా పాక్‌కు వెళ్లదని బీసీసీఐ కార్యదర్శి జై షా చేసిన వ్యాఖ్యలు క్రీడా వర్గాల్లో తీవ్ర అలజడి సృష్టిస్తున్నాయి. తటస్థ వేదికపైనే నిర్వహిస్తామని, పాక్‌లో నిర్వహిస్తే మాత్రం భారత్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ టోర్నీలో పాల్గొనదని ఆయన తేల్చి చెప్పాడు. ఈ వ్యాఖ్యలు తమను తీవ్ర నిరాశకు గురి చేశాయని ఇప్పటికే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు స్పందించగా.. తాజాగా పాక్ మాజీ క్రికెటర్లు కమ్రాన్ అక్మల్, యూనిస్ ఖాన్ స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఒక న్యూస్ ఛానెల్‌తో కమ్రాన్ అక్మల్ మాట్లాడుతూ.. ‘‘జై షా ఈ విధమైన ప్రకటన చేస్తారని ఊహించలేదు. చూస్తుంటే.. ఆయన కేవలం రాజకీయాలకే ఆయన పరిమితం అయినట్లు అనిపిస్తోంది. క్రీడల్లోకి రాజకీయాలను లాగాల్సిన పనిలేదు. ఒకవేళ వచ్చే ఏడాది ఆసియా కప్ టోర్నీని పాకిస్తాన్‌లో నిర్వహించకపోతే.. ఇకపై ఇండియాతో పాక్ ఎప్పుడూ ఆడబోదు. ఐసీసీ ఈవెంట్లలోనూ ఇండియాతో మ్యాచ్ ఆడదు. అసలు ఆసియా కప్ దాకా ఆగాల్సిన అవసరం లేదు.. టీ20 వరల్డ్‌కప్‌లో భాగంగా అక్టోబరు 23న నిర్వహించిన మ్యాచ్‌లోనూ ఇండియాతో పాక్ ఆడదు’’ అంటూ చెప్పుకొచ్చాడు. ఇక యూనిస్ ఖాన్ స్పందిస్తూ.. ‘‘పాకిస్తాన్‌కు రాకూడదనే నిర్ణయానికి బీసీసీఐ కట్టుబడి ఉంటే.. పాక్ కూడా వచ్చే ఏడాది వన్డే వరల్డ్‌కప్ కోసం ఇండియాకు వెళ్లదు’’ అని పేర్కొన్నాడు.
ఈ విధంగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు, పాక్ మాజీ ప్లేయర్లు చేసిన వ్యాఖ్యలపై మన టీమిండియా ఫ్యాన్స్ సెటైర్లు వేస్తున్నారు. ఇండియాతో ఆడకపోతే నష్టపోయేది పాకిస్తాన్ జట్టేనని.. తాటాకు చప్పుళ్లకు బెదిరే ప్రసక్తే లేదని కౌంటర్ ఎటాక్‌కి దిగారు. కాగా.. టీ20 వరల్డ్‌కప్-2022లో భాగంగా ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ వేదికగా అక్టోబరు 23న భారత్, పాక్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో ఎవరు గెలవనున్నారనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.