Tirumala: తిరుమల శ్రీవారిని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం ఆయన కుటుంబ సమేతంగా శ్రీవారి తోమాల సేవలో పాల్గొన్నారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ దంపతులకు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్వాగతం పలికారు. కేంద్ర మంత్రికి దర్శన ఏర్పాట్లు చేశారు. స్వామివారిని దర్శించుకుని ఆయన మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం కేంద్ర మంత్రి దంపతులకు పండితులు వేదాశీర్వచనం పలికారు. శ్రీవారి దర్శనానంతరం టీటీడీ తరపున ఛైర్మన్ సుబ్బారెడ్డి, కేంద్ర మంత్రికి జ్ఞాపికలు , స్వామివారి తీర్థ ప్రసాదాలను అందచేశారు. దర్శనం అనంతరం కేంద్ర మంత్రి మీడియాతో మాట్లాడారు. దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని దేవుడిని ప్రార్థించినట్లు చెప్పారు. ప్రజాసేవ చేసే శక్తిని తనకు ప్రసాదించాలని కోరుకున్నట్లు చెప్పారు.
Also Read: Chandrayaan 3: చంద్రయాన్ -3 రిహార్సల్ లాంచ్ పూర్తి.. కౌంట్ డౌన్ షురూ
ఇదిలా ఉండగా.. ఎస్వీ యూనివర్సిటీ స్టేడియంలో నేడు గడ్కరీ భారీ సభలో పాల్గొననున్నారు. సభలో జాతీయ రహదారులను జాతికి అంకితం ఇవ్వనున్నారు. మరోవైపు ఇవాళ మధ్యాహ్నం మదనపల్లెలో కేంద్ర మంత్రి పర్యటించనున్నట్లు తెలుస్తోంది. మధ్యాహ్నం 2 గంటలకు బీటీ కళాశాల గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు కేంద్ర మంత్రి చేరుకోనున్నారు. మంత్రికి రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా, ఎంపీ మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే నవాజ్ బాషా స్వాగతం పలకనున్నారు. అనంతరం సత్సంగ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలోని స్వాస్థ్య హాస్పిటల్‌ను నితిన్ గడ్కరీ ప్రారంభించనున్నారు.
మరోవైపు.. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. టోకెన్లు లేకుండా క్యూలైన్లలో వచ్చిన భక్తులకు శ్రీవారి సర్వ దర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. స్వామి దర్శనానికి మొత్తం 31 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. బుధవారం మొత్తంగా 72,664 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 32,336 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.