Mahesh Goud: తెలంగాణ రాజకీయాల్లో కీలకంగా మారిన బీసీ రిజర్వేషన్లపై టీపీసీసీ నేత మహేష్ గౌడ్ స్పందించారు. రాహుల్ గాంధీ బీసీ గర్జనకు హాజరవుతారని కాంగ్రెస్ ఎప్పుడు ప్రకటించలేదని స్పష్టం చేశారు. వక్ఫ్ బిల్లుతో సంబంధం ఉన్న అంశాల కారణంగా రాహుల్ గాంధీ ఈ కార్యక్రమానికి రాలేకపోయారని తెలిపారు. అయితే, బీసీ రిజర్వేషన్ల అంశంపై రాహుల్ గాంధీ పూర్తి మద్దతు ఇస్తారని హామీ ఇచ్చారు. అలాగే హైదరాబాదులోని HCU భూములపై ఇటీవల జరుగుతున్న చర్చ పై కూడా ఆయన స్పందించారు. HCU భూములు ప్రభుత్వానికి చెందినవేనని, ఇది కోర్టు పరిధిలో ఉన్న అంశమని ఆయన తెలిపారు. విద్యాసంస్థల అవసరాల కోసమే ఈ భూములను వినియోగించుకుంటామని స్పష్టం చేశారు.
Read Also: MLC Nagababu: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసి ఎమ్మెల్సీ నాగబాబు
కేసీఆర్ హయాంలో జరిగిన భూ అక్రమాలపై చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, అవి నిరూపించగలమని మహేష్ గౌడ్ అన్నారు. ప్రభుత్వ భూములు అక్రమంగా ఆక్రమణకు గురైన వాటిని తిరిగి స్వాధీనం చేసుకునేందుకు హైడ్రా (HYDRA) తీసుకువచ్చామని వివరించారు. తెలంగాణ అభివృద్ధికి బీఆర్ఎస్, బీజేపీ అడ్డుపడుతున్నాయని మహేష్ గౌడ్ విమర్శించారు. ప్రభుత్వం తీసుకుంటున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఈ రెండు పార్టీలే ప్రధాన అడ్డంకిగా మారుతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు.
HCU భూముల నుంచే మై హోమ్‌కు వంద అడుగుల రోడ్డు అనుమతి ఎలా ఇచ్చారని మహేష్ గౌడ్ ప్రశ్నించారు. గత ప్రభుత్వ హయాంలో ఇదే ఎలా జరిగిందో తమకు అనుమానం ఉందని, దానిపై విచారణ జరిపిస్తామని ప్రకటించారు. మూడేళ్లలో మేము అధికారంలోకి వస్తామని కేటీఆర్ పగటి కలలు కంటున్నాడు అంటూ మహేష్ గౌడ్ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నదని, రాబోయే ఎన్నికల్లో ప్రజలు తమకు తిరిగి అవకాశం కల్పిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. అయితే ప్రస్తుతం జరగాల్సిన మంత్రివర్గ విస్తరణలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.