ప్రత్యేక హోదాయే మార్గం.. ఇప్పుడు అవకాశం వచ్చింది..
గత ప్రభుత్వంలో కంటే ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి లక్ష కోట్ల పైగా బడ్జెట్ కావాల్సి ఉంది.. ప్రభుత్వం మరి ఏ విధంగా ఆదాయ వనరులు సమకూరుస్తుందో చూడాలన్నారు సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ.. విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన.. కొత్త ప్రభుత్వానికి (కూటమి) శుభాకాంక్షలు తెలిపారు.. అయితే, అన్నీ నెరవేలంటే ఏపీకి ప్రత్యేక హోదా ఒక్కటే మార్గం అన్నారు.. ఆదాయ వనరులు లేకుంటే అప్పుల ఊబిలో కూరుకుపోతుందని.. గతంలో వైసీపీ ప్రభుత్వం ఆ ప్రయత్నం చేయలేదు.. ఇప్పుడు అవకాశం వచ్చింది.. ప్రత్యేక హోదా, విభజన హామీలు నెరవేర్చాలని విజ్ఞప్తి చేశారు. విశాఖ రైల్వే జోన్ ను దేశంలో ఎక్కడ లేని విధంగా విభజన చేశారు.. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలి, ఈ 5 ఏళ్లు చాలా కీలకం, ఇప్పుడు కానీ అభివృద్ధి చేయకపోతే రాష్ట్రం చాలా వెనుకబడిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు జేడీ లక్ష్మీనారాయణ.
ఎన్నికల ఫలితాలపై మాజీ మంత్రి అమర్నాథ్ కీలక వ్యాఖ్యలు
ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయాన్ని చవిచూసింది.. ఇక, ఎన్నికల ఫలితాలపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు.. ఎన్నికల్లో ఓటమిపై పార్టీలో సుదీర్ఘంగా చర్చ జరగాలన్నారు. అడగకుండానే అన్నీ ఇచ్చినా.. ఎందుకు ప్రజల ఆదరణ లభించ లేదో తేల్చుకోవాలన్నారు. వ్యవస్థల్లో తెచ్చిన మార్పులు, సంస్కరణల కారణంగా పార్టీ కేడర్ కు గౌరవం దక్క లేదు.. నాయకత్వం, కేడర్ ను నిర్లక్ష్యం చేయాలనే ఉద్దేశం లేకపోయినా.. ప్రభుత్వం – పార్టీ మధ్య దూరం పెరిగిందన్నారు. పథకాలు, పరిపాలన ప్రజల ఇంటికే తెచ్చిన సచివాలయం, వాలంటీర్ వ్యవస్థలను ప్రవేశ పెట్టినా.. ఎందుకు గెలవలేకపోయామోసమాధానం వెతుక్కోవాలన్నారు. ఇక, ప్రభుత్వం మారిన 48 గంటలు తిరగక ముందే రాష్ట్రంలో దాడులు పెరిగాయి అని ఆవేదన వ్యక్తం చేశారు గుడివాడ అమర్నాథ్.. వైసీపీకి ఓటేశారనే కక్షతో ఇళ్లకు వెళ్లి మరీ కొడుతున్నారు.. కానీ, దాడుల సంస్కృతి ప్రజాస్వామ్యానికి మంచిది కాదని హితవుపలికారు.. ‘వాయిస్ ఆఫ్ ది వాయిస్ లెస్’ అనే మా అధినాయకుడు చెప్పిన మాటకు కట్టుబడి ప్రజా సమస్యలపై మా పోరాటం కొనసాగుతుందన్నారు. ఉమ్మడి విశాఖ జిల్లా సమస్యలు, ప్రజా అవసరాల కోసం పొరాడతాం.. ప్రతిపక్షంగా ప్రభుత్వానికి ఏడాది సమయం ఇస్తాం.. హామీలు నిలబెట్టు కోకపోతే ప్రభుత్వాన్ని ఎండగడతాం అన్నారు.
రాజధానిపై అమర్నాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు
విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పై ప్రజా తీర్పు కచ్చితంగా రిఫరెండమే అన్నారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్.. ఈ రోజు మీడియాతో మాట్లాడిన ఆయన.. సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై స్పందించారు.. అయితే, మూడు రాజధానులు అని ప్రకటించినా.. అమరావతికి మేం ఎప్పుడూ వ్యతిరేకం కాదన్నారు. గత ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా వచ్చిన ప్రజాభిప్రాయం పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందన్నారు. అమరావతితో పాటు వైజాగ్ నగరం అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. గత ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తి చేయాలని డిమాండ్ చేశారు అమర్నాథ్. పేర్లు మార్పు ప్రారంభించిన కొత్త ప్రభుత్వం.. ఎన్టీఆర్ జిల్లాకు పెట్టిన పేరు కూడా మారుస్తారా..? అని ప్రశ్నించారు అమర్నాథ్.. ఇక, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా తన అభిప్రాయం మీడియా ముందు చెప్పారు.. ఇది రాజా ఒక్కడి అభిప్రాయమా? లేక అందరికీ ఇబ్బందులు వున్నాయా? అనేది సమీక్షించుకుంటాం అన్నారు. ఈవీఎం ట్యాంపరింగ్ అనే ప్రచారం నమ్మితే తప్పు అవుతుంది.. జనం అభిప్రాయంగా స్వీకరిస్తేనే సమీక్షకు అవకాశం లభిస్తుందన్నారు. ప్రజలను సంతృప్తి పరచడం ఎంత గొప్ప నాయకుడు వల్ల కాదనేది ఫలితాలను బట్టి అర్థం అవుతుందన్నారు. రాష్ట్రంలో అతిపెద్ద నియోజకవర్గాలు భీమిలి, గాజువాక సహా అన్ని చోట్ల కూటమి మెజారిటీలు నమోదు అవ్వడానికి 100 శాతం ఓటు ట్రాన్స్ ఫర్ అవ్వడమే కారణంగా చెప్పుకొచ్చారు. కేంద్రంలో భాగస్వామి అయ్యే అవకాశం టీడీపీకి వచ్చినందున విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణను అడ్డుకోవడానికి చొరవ తీసుకోవాలని సూచించారు. మా ఓట్ షేర్ బలంగా వుంది… మేం ఎవరికి మద్దతు ప్రకటించాల్సిన అసరం ఉండదన్నారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్.
వైసీపీ నేతలంతా బీజేపీలోకి క్యూ కడుతున్నారు..!
పులివెందులలో కూడా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నామరూపాలు లేకుండా పోబోతుంది.. వైసీపీ నాయకులంతా బీజేపీలోకి క్యూ కడుతున్నారని వ్యాఖ్యానించారు జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి.. విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చిన ఆయన.. బీజేపీ రాష్ట్ర సంఘటనా ప్రధాన కార్యదర్శి మధుకర్ జీ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సన్నారెడ్డి దయాకర్ రెడ్డితో భేటీ అయ్యారు. ఆదినారాయణ రెడ్డిని శాలువాతో సత్కరించారు బీజేపీ రాష్ట్ర నేతలు.. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన.. బీజేపీకి 10 స్థానాల్లో 8 అసెంబ్లీ స్థానాల్లో గెలుపు కూటమికి బలాన్ని చేకూర్చిందన్నారు. ఇప్పటికే బీజేపీలో చేరుతామని జమ్మలమడుగులో క్యూ కడుతున్నారని తెలిపారు. రాష్ట్రంలో కూటమి గెలుపునకి పవన్ కల్యాణ్ తోడ్పడ్డారని వెల్లడించారు ఆదినారాయణరెడ్డి.. రాష్ట్రంలో పుష్ప సినిమా రీతిలో స్మగ్లింగ్ చేశారు.. వైసీపీ అన్ని వ్యవస్థలని నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. గ్రామీణ ఉపాధిని తుంగలో తొక్కారు.. రైల్వే జోన్ కి స్థలం ఇవ్వలేదు అని విమర్శించారు. వారం రోజుల్లోపే వైసీపీ ఎమ్మెల్యేలు జంపింగ్ కి సిద్ధం అవుతున్నారు.. పులివెందులలో కూడా వైసీపీ నామరూపాలు లేకుండా పోబోతుందని వ్యాఖ్యానించారు. వైసీపీ నాయకులందరూ బీజేపీలోకి లైన్ కడుతున్నారన్నారు ఆదినారాయణరెడ్డి..
రాజకీయ వైరం..! మరో కార్యకర్త దారుణ హత్య
ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ తర్వాత పలు ప్రాంతాల్లో హింస చెలరేగింది.. మరోవైపు ఫలితాలు వెల్లడైన తర్వాత కూడా కొన్ని ప్రాంతాల్లో దాడులు కొనసాగుతున్నాయి.. ఇక, నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం చింతలాయ పల్లె గ్రామంలో టీడీపీ కార్యకర్త మంజుల నాగేంద్ర అనే 40 ఏళ్ల వ్యక్తి దారుణ హత్య ఘటన చోటుచేసుకుంది. గత రాత్రి గ్రామ సమీపంలోని గంగమ్మ రహదారి మార్గం నుండి వస్తున్న నాగేంద్రపై ప్రత్యర్ధులు ఇనుప సుత్తి, కర్రలు, బండరాళ్లలో దాడిచేశారు.. దారుణంగా కొట్టి హత్య చేశారు. పోలీసు రికార్డుల్లో ఫ్యాక్షన్ సమస్యాత్మక గ్రామంగా ఉన్న చింతలాయ పల్లెలో టీడీపీ-వైసీపీ వర్గాల మధ్య పచ్చ గడ్డి వేస్తే బగ్గుమనే పరిస్థితి ఉంటుంది. గత 2019 ఎన్నికలు పూర్తయిన కొద్ది రోజుల్లోనే టీడీపీ నాయకుడు మంజుల సుబ్బారావును వైసీపీకి చెందిన ప్రత్యర్థులు బెలుంగుహల వద్ద బండరాళ్లతో కొట్టి అత్యంత దారుణంగా హత్య చేసిన ఘటన అప్పట్లో జిల్లాలో సంచలనం సృష్టించింది. ప్రస్తుతం ఈ ఏడాది ఎన్నికలు పూర్తయి ఫలితాలు వెలువడగానే అదే గ్రామంలో మరో టీడీపీ కార్యకర్త దారుణ హత్య ఘటన చోటు చేసుకోవడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. 2019లో హత్య గురైన మంజుల సుబ్బారావుకు బంధువైన.. మంజుల నాగేంద్ర ప్రస్తుతం హత్యకు గురయ్యాడు.. ప్రత్యర్థుల దాడిలో తీవ్రంగా గాయపడిన నాగేంద్రను కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు, తలకు బలమైన గాయాలు కావడం.. తీవ్ర రక్త స్రావం కావడంతో బాధితుడు నాగేంద్ర కోలుకోలేక మృతి చెందాడు. అయితే, ఈ వ్యవహారంపై పోలీసులు స్పందించనట్టుగా తెలుస్తోంది.
నేడు రాష్ట్రానికి జస్టిస్ పీసీ ఘోష్.. రేపు మేడిగడ్డలో ఉత్తమ్ పర్యటన
జస్టిస్ పినాకి చంద్రఘోష్ నేడు హైదరాబాద్ రానున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ జరుపుతున్న ఆయన నేడు నగరానికి రానున్నారు. 7, 8 తేదీల్లో అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను పరిశీలిస్తారు. బ్యారేజీల మరమ్మతు, పునరుద్ధరణ పనులను ఈ నెల 10వ తేదీలోగా పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇప్పటికే బ్యారేజీలను నిపుణుల కమిటీ కూడా పరిశీలించింది. పనులు ఎంతవరకు జరిగాయో తెలుసుకునేందుకు పీసీ ఘోష్ క్షేత్రస్థాయిలో పర్యటించనున్నారు. మరోవైపు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలతో పాటు కడెం ప్రాజెక్టును మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి రేపు (శుక్రవారం) పరిశీలించనున్నారు. కడెం ప్రాజెక్టు మరమ్మతులకు ప్రభుత్వం రూ.3.81 కోట్లు కేటాయించగా, ఆ నిధులతో పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మంత్రి ఉత్తమ్ పనులను పరిశీలించి తగు సూచనలు చేయనున్నారు. ఆ తర్వాత సుందిళ్ల, అన్నారం, మేడిగడ్డ బ్యారేజీలను కూడా పరిశీలిస్తారు.
నేటి నుంచి బడిబాటకు శ్రీకారం.. 19 వరకు కార్యక్రమం నిర్వహణ..
నేటి నుంచి బడిబాట కార్యక్రమాన్ని విద్యాశాఖ చేపట్టింది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదును పెంచేందుకు ప్రయివేటు, కార్పొరేట్ విద్యాసంస్థలు విద్యార్థుల కోసం వెతుక్కుంటూ తమ పాఠశాలల్లో చేర్పిస్తున్నారు. ఈ మేరకు ప్రత్యేక బృందాలను నియమించి జల్లెడ పడుతున్నారు. తమ పాఠశాలల్లో అందిస్తున్న విద్యను వివరిస్తూ రాయితీల వల విసురుతూ పిల్లల తల్లిదండ్రులను ఆకర్షిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యనభ్యసించే విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు ప్రభుత్వం బడిబాట కార్యక్రమాన్ని చేపట్టింది. నేటి నుంచి 19వ తేదీ వరకు విద్యాశాఖ అధికారులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదును పెంచేందుకు ప్రభుత్వం ఏటా ‘ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట’ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా 2024-25 విద్యా సంవత్సరంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో పాఠశాల వయస్సు పిల్లలను ప్రధానంగా ప్రాథమిక పంచాయతీల ఆధారంగా గుర్తిస్తారు. ప్రభుత్వ విద్యలో నాణ్యత, ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను తల్లిదండ్రులకు వివరించారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని కోరారు. అలాగే స్వచ్ఛంద సంస్థల సహకారం తీసుకుని ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తామన్నారు.
కేంద్ర మంత్రివర్గ కూర్పుపై బీజేపీ-ఆర్ఎస్ఎస్ నేతల సమాలోచనలు
కేంద్రంలో మూడోసారి ఎన్డీఏ కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు కొనసాగుతున్న వేళ బీజేపీ అగ్రనేతలు సమావేశమయ్యారు. కేంద్ర మంత్రివర్గ కూర్పు, కూటమి పక్షాలతో సమన్వయంపై భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో ఇవాళ ( గురువారం) ఆర్‌ఎస్‌ఎస్ శాఖలోని ప్రముఖులతో పాటు పార్టీ అగ్రనేతలతో చర్చిస్తున్నారు. కొత్త ప్రభుత్వ ఏర్పాటు, మిత్రపక్షాలకు మంత్రివర్గంలో చోటుపై కసరత్తు చేస్తున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్, సురేష్ సోని, అరుణ్ కుమార్, దత్తాత్రేయ హొసబెళె తదితరులు ఈ భేటీలో పాల్గొన్నారు. మిత్రపక్షాలకు మంత్రి పదవుల కేటాయింపుతో పాటు కీలకమైన అంశాలపై ఈ సమావేశంలో చర్చిస్తున్నట్లు తెలుస్తుంది. అలాగే, ఢిల్లీకి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వెళ్లారు. ఇక, ఈ రోజు ఎన్నికైన లోక్ సభ సభ్యుల జాబితాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు కేంద్ర ఎన్నికల సంఘం సమర్పించనుంది. రేపు ఉదయం ముందుగా బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం కానున్నారు. ఆ తర్వాత బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం అనంతరం ఎన్డీయే ఎంపీలతో మీటింగ్ జరగనుంది. ఇక, ఎన్డీయే కూటమి నాయకుడిగా ఏకగ్రీవంగా మోడీని ఎంపీక చేశారు. దీనికి చంద్రబాబు, నితీశ్ కుమార్ తో పాటు 23 పార్టీలు మద్దతు ఇచ్చాయి. కాగా, రాష్ట్రపతిని కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించమని ఎన్డీయే భాగస్వామ్య పక్షాల నేతలు కోరనున్నారు.
యోగి ఆదిత్యనాథ్‌పై ఒత్తిడి తెచ్చేందుకు ఫడ్నవీస్ రాజీనామా..
లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత బీజేపీకి సీట్లు తగ్గడంపై సర్వత్రా చర్చలు జరుగుతున్నాయి. నిన్న మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తన రాష్ట్రంలో బీజేపీ పని తీరుకు బాధ్యత వహిస్తూ రాజీనామా చేశారు. ఆయన తీరుపై శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ స్పందించారు. ఇది యోగి ఆదిత్యనాథ్‌పై ఒత్తిడి తెచ్చేందుకు ఓ ఎత్తుగడ అని అన్నారు. కొత్త ఎన్డీయే ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని పేర్కొన్నారు. నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేయనివ్వండి.. స్వీట్లు పంచి పెట్టమని మేము సూచిస్తాం.. ఈ ప్రభుత్వం ఎక్కువ కాలం కొనసాగదని సంజయ్ రౌత్ అన్నారు. ఈ నిర్ణయం ఉద్ధవ్ ఠాక్రే, శరద్ పవార్‌లకు అనుకూలంగా ఉందన్నారు. ఈసారి మహారాష్ట్రలో బీజేపీకి తొమ్మిది సీట్లు మాత్రమే వచ్చాయి.. దాని మిత్రపక్షం ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన ఏడు స్థానాల్లో గెలుపొందగా, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్‌సీపీ ఒక స్థానాన్ని గెలుచుకుంది అని శివసేన (యూబీటీ) సంజయ్ రౌత్ పేర్కొన్నారు.
ఆమెకు జోడీగా నటించడం నా వల్ల కాదు.. విజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి త్వరలోనే ‘మహారాజ’తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ క్రైం, సస్పెన్స్ థ్రిల్లర్‌ను నిథిలన్ స్వామినాథన్ తెరకెక్కించారు. ప్యాషన్ స్టూడియోస్, ది రూట్‌పై సుధన్ సుందరం, జగదీష్ పళనిస్వామి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో అనురాగ్ కశ్యప్, భారతీరాజా, అభిరామి, మమత మోహన్ దాస్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. మహారాజ జూన్ 14న థియేటర్స్‌లో విడుదల కానుంది. ఈ సినిమా ప్రచారంలో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో హీరోయిన్ కృతి శెట్టి గురించి మరోసారి విజయ్ సేతుపతి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కూతురిగా భావించిన కృతి శెట్టికి జోడీగా నటించడం తన వల్ల కాదని విజయ్ సేతుపతి తెలిపారు. ‘నేను నటించిన డీఎస్పీ సినిమాలో కృతి శెట్టిని హీరోయిన్‌గా తీసుకుంటే.. చేయలేనని దర్శకనిర్మాతలకు చెప్పా. అందుకు కారణం ఉప్పెన చిత్రంలో ఆమెకు తండ్రిగా నటించడమే. కుమార్తెగా నటించిన అమ్మాయితో రొమాంటిక్ సీన్స్ అస్సలు చేయలేను. అందుకే డీఎస్పీ సినిమాలో కృతి వద్దు అని చిత్ర బృందంకు చెప్పా. ఉప్పెనలో కొన్ని క్లైమాక్స్ సన్నివేశాల్లో నటిస్తున్నప్పుడు కృతి చాలా కంగారు పడింది. నాకు నీ వయసు ఉన్న కుమారుడు ఉన్నాడు, నన్ను నీ తండ్రిగా భావించు అని ధైర్యం చెప్పా. కూతురిగా భావించిన ఆమెకు జోడీగా ఎలా నటించాలి. అది నా వల్ల కాదు’ అని విజయ్ తెలిపారు.
హాలీవుడ్ సినిమా చేయడానికి కారణం అదే: అలియా
హాలీవుడ్ చిత్రంలో భాగమవడానికి కారణం కథలో ఉన్న భావోద్వేగమే అని బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ తెలిపారు. అన్ని భాషల సినిమాలు తాను చూస్తానని, భాషపై దృష్టి పెట్టకుండా భావోద్వేగాలకు మాత్రమే కనెక్ట్ అవుతా అని చెప్పారు. కెరీర్ తొలినాళ్ల నుంచి వైవిధ్యమైన పాత్రలు చేసే అవకాశం రావడం తన అదృష్టం అని, భిన్నమైన పాత్రలు చేస్తేనే ప్రేక్షకులకు చేరువవుతామని అలియా పేర్కొన్నారు. గతేడాది ‘హార్ట్ ఆఫ్ స్టోన్’తో హాలీవుడ్‌లో అలియా అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఇటీవల ‘మెట్ గాలా’లో అలియా భట్ మెరిశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అలియా పలు విషయాలపై స్పందించారు. ‘నేను అన్ని భాషల సినిమాలు చూస్తాను. భాషపై దృష్టి పెట్టకుండా.. భావోద్వేగాలకు మాత్రమే కనెక్ట్ అవుతా. నేను హాలీవుడ్‌లో హార్ట్ ఆఫ్ స్టోన్ సినిమా చేయడానికి కూడా కారణం ఇదే. కథ నాకు బాగా నచ్చింది. సరిహద్దులను అధిగమించేది కథనంలోని భావోద్వేగాలు మాత్రమే. అందుకే హాలీవుడ్‌లో అవకాశం వస్తే నటించా’ అని అలియా చెప్పారు.