TDLP Meeting: రేపు సీఎం చంద్రబాబు అధ్యక్షతన టీడీఎల్పీ సమావేశం జరగనుంది. మధ్యాహ్నం రెండున్నర గంటలకు టీడీఎల్పీ సమావేశాన్ని నిర్వహించనున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాంపై టీడీఎల్పీలో చర్చించనున్నారు. అసెంబ్లీ సమావేశాలకు పూర్తి స్థాయిలో సబ్జెక్టులను ప్రిపేరై రావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు టీడీపీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు దిశా నిర్దేశం చేయనున్నారు. నియోజకవర్గాల్లో సమస్యలను సభలో ప్రస్తావించేలా స్టడీ చేసి రావాలని చంద్రబాబు సూచించనున్నారు. బయట చేస్తున్న దుష్ప్రచారాన్నే వైసీపీ సభలో కూడా చేస్తే గట్టి కౌంటర్లివ్వాలని టీడీపీ భావిస్తోంది.
Read Also: Ambati Rambabu: ఆ వివరాలు ఢిల్లీలో బయటపెడతాం..
ఏపీలో రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. రేపటి నుంచి 5 రోజుల పాటు ఈ సమావేశాలు జరగనున్నాయి. ఈ నెలాఖరుతో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌గడువు పూర్తి కానున్నందున మరో మూడు నెలలకు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. అక్టోబర్‌లో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. సోమవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే సమావేశాల్లో ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగిస్తారు. గవర్నర్ ప్రసంగం అనంతరం స్పీకర్ అయ్యన్నపాత్రుడు అధ్యక్షతన బీఏసీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై నిర్ణయం తీసుకోనున్నారు. 23న ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లును సభలో ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అధికార టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ముందుగా ఉదయం 8.30 గంటలకు వెంకటపాలెంలో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించిన అనంతరం పసుపు రంగు దుస్తులు, సైకిల్ గుర్తు కండువాలతో అసెంబ్లీకి రావాలని టీడీఎల్పీ సూచించింది.