Off The Record: వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడికి ఇక మీదట చుక్కలు కనిపించబోతున్నాయా? అంటే… అవును… జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే… అలాగే అనిపిస్తోందని అంటున్నారు పొలిటికల్ పండిట్స్. 2019 -24 మధ్య వైసీపీ తరపున పవర్‌లో ఉన్న బొల్లా…. ప్రత్యర్థుల్ని గట్టింగానే వేధించారని, ఇక నోటి దురద గురించి అయితే చెప్పేపనేలేదన్నది లోకల్ టాక్. అప్పటి ఆ చర్యలు, మాటలే ఇప్పుడు రియాక్షన్స్, సైడ్ ఎఫెక్ట్స్ రూపంలో బయటపడుతున్నట్టు చెప్పుకుంటున్నారు. చిన్న, పెద్ద తారతమ్యం లేకుండా, సొంత పార్టీనా, పక్క పార్టీనా అన్నది కూడా మర్చిపోయి.. ఒంటికాలు మీద, ఆదోరకం పంచ్ డైలాగులతో, చెలరేగిపోయేవారట ఆయన. ఆ పాత లెక్కలన్నీ ఇప్పుడు సెట్ అయ్యే వాతావరణం కనిపిస్తోందని నియోజకవర్గంలోని బొల్లా అనుచరులే గుసగుసలాడుకుంటున్న పరిస్థితి. నియోజకవర్గంలోని ఓ మాజీ ఎమ్మెల్యే, పల్నాడు జిల్లాలోని ఇంకో సిట్టింగ్ ఎమ్మెల్యే, ఓ మాజీ మంత్రి, పల్నాడు జిల్లాకే చెందిన ఓ ఎంపీ, డెల్టా ప్రాంతానికి చెందిన మరో ఎమ్మెల్యే…. ఇలా అంతా కలిపి పాత లెక్కల్ని తిరగరాసే పనిలో బిజీగా ఉన్నట్టు సమాచారం. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అడ్డూ అదుపూ లేకుండా ప్రవర్తించి చివరికి తమ కుటుంబాల పరువు కూడా తీసేసిన బ్రహ్మనాయుడు ఇప్పుడు ఏ విషయంలో దొరుకుతాడా అని భూతద్దం పట్టుకుని తిరుగుతున్నారట సదరు లీడర్స్. ఆయన హయాంలో జరిగిన అవకతవకలపై దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది.
Read Also: CM Chandrababu: ఇసుకపై సీఎం సమీక్ష.. ఫిర్యాదుల నేపథ్యంలో కీలక ఆదేశాలు.. రేపటి నుంచి ఐవీఆర్ఎస్ కాల్స్
2004 -2014 మధ్య కాంగ్రెస్ టైంలో…టెక్స్‌టైల్ పార్క్ పేరుతో నామమాత్రపు ధరకు ప్రభుత్వ భూమిని తీసుకున్నారన్న ఆరోపణలు బొల్లా బ్రహ్మనాయుడు మీద ఉన్నాయి. అందులో ఇప్పటిదాకా టెక్స్‌టైల్ పార్క్ కాదు కదా… కనీస నిర్మాణం కూడా లేదట. పైగా మధ్యలో ఆ ల్యాండ్‌ని వేరే ఎవరికో అమ్మే ప్రయత్నం చేసినట్టు చెప్పుకుంటున్నారు. దీంతో ఎవరికి అమ్మే ప్రయత్నం చేశారు? అసలిప్పుడు ఆ భూమి ఎవరి చేతుల్లో ఉంది? ప్రభుత్వ నిబంధనల ప్రకారం టెక్స్‌టైల్ పార్క్ ఏర్పాటు చేయకుంటే.. ఆ ల్యాండ్ మొత్తాన్ని వెనక్కి తీసుకోవచ్చుగనుక ఆ పని ఎందుకు చేయకూడదని బొల్లా ప్రత్యర్థులు ఆలోచిస్తున్నట్టు సమాచారం. దీనికి తోడు నియోజకవర్గంలో జగనన్న కాలనీ స్థలం విషయంలో భారీ అవకతవకలు జరిగాయని, కొన్ని ప్రభుత్వ స్థలాలను మాజీ ఎమ్మెల్యే తన పొలాల్లో కలిపేసుకున్నారన్న ఆరోపణలున్నాయి. ఈ విషయమై అందరికంటే…ఎక్కువగా ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు పట్టుదలగా ఉన్నట్టు తెలిసింది. గతంలో ఇద్దరూ ఒకే పార్టీలో ఎమ్మెల్యే, ఎంపీగా ఉన్నారు కాబట్టి… అమ్మ పుట్టిల్లు మేనమామకు తెలియదా అన్న రీతిలో… గుట్టుమట్లన్నిటినీ బయట పెట్టడానికి ఎంపీ సిద్ధమవుతున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావు వర్గం కూడా ఇందుకు సై అంటోందట. మొదట్లో బొల్లా, లావు సఖ్యతగానే ఉన్నప్పటికీ… నరేంద్ర అనే ఓ రైతు వ్యవహారంలో బ్రహ్మనాయుడు మాట్లాడిన తీరు, అదే ఊపులో శ్రీకృష్ణ దేవరాయలు మీద నోరు పారేసుకోవడం లాంటి కారణాలతో ఆ వర్గం హర్ట్ అయిందట.
Read Also: High Court: హైదరాబాద్‌లోని అన్ని చెరువులపై పర్యవేక్షణ మాదే..
దీంతో అప్పుడు సొంత పార్టీ ఎమ్మెల్యేను కూడా కాదని కార్యకర్తగా ఉన్న, రైతు పక్షాన నిలబడ్డారు ఎంపీ కృష్ణదేవరాయలు. దీంతో నాడు కొద్ది రోజులు వైసీపీలోనే రెండు వర్గాలు నడిచాయి. ఆ తర్వాత కొన్నాళ్ళకు ప్యాచప్ అయినట్టు పైకి కనిపించింది. కానీ… శ్రీకృష్ణదేవరాయలు పార్టీ మారతారని తెలియగానే… అప్పటిదాకా అణుచుకున్న అసహనాన్ని ఒక్కసారిగా బయటపెట్టారు బొల్లా. నరసరావుపేట సభలో ఎంపీని నానా దుర్భాషలాడారు. ఎంపీని వ్యక్తిగతంగానే కాకుండా… కుటుంబ పరంగా కూడా ఇష్టానుసారం మాట్లాడటం అప్పట్లో కలకలం రేపింది. ఎలక్షన్ టైం కాబట్టి అప్పటికి కామ్‌గా ఉన్న కృష్ణదేవరాయలు… ఇప్పుడిక లెక్కల పుస్తకాన్ని ఓపెన్ చేశారట. ఒక వేళ ఆయన కామ్‌గా ఉందామనుకున్నా… అలా ఉండనీయకుండా ఎప్పటికప్పుడు గుర్తు చేసేలా వినుకొండలో ఓ టీమ్ కూడా ఏర్పాటైనట్టు తెలిసింది. బొల్లా బ్రహ్మనాయుడుకు చెందిన ఫ్యాక్టరీల్లో ఇటీవల వరుస తనిఖీలు ఇందులో భాగమే అయి ఉండవచ్చంటున్నారు. దీంతో ఇప్పుడే ఏమైంది… ఇన్‌ఫ్రంట్ దేరీజ్ క్రోకడైల్ ఫెస్టివల్ అంటున్నారట కొందరు.
బొల్లా బాధితుల తరపున ముందుండి పోరాటాలు చేయడానికి కూడా స్కెచ్ రెడీ అవుతోందట. ఈ క్రమంలో వినుకొండ కేంద్రంగా పల్నాడు పాలిటిక్స్ ఎలా మారబోతున్నాయోనని ఆసక్తిగా గమనిస్తున్నాయి రాజకీయ వర్గాలు.