CM Chandrababu: రాష్ట్రవ్యాప్తంగా ఇసుక సరఫరాపై సమీక్ష నిర్వహించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులు, ఇబ్బందుల నేపథ్యంలో కీలకమైన ఆదేశాలు జారీ చేశారు.. ఇసుక లభ్యత, పారదర్శకంగా సరఫరా, అక్రమాల నియంత్రణ వంటి అంశాలపై స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.. రాష్ట్రవ్యాప్తంగా ఇసుక డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో లభ్యత పెంచాల్సిందిగా స్పష్టం చేశారు.. జిల్లాల్లో ఇసుక రీచ్ లలో పూర్తిస్థాయిలో ఇసుక తవ్వకాలపై చర్యలు చేపట్టాల్సిందిగా జిల్లాస్థాయి శాండ్ కమిటీలు, అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.. వ్యక్తిగత అవసరాల కోసం ఇసుక తీసుకెళ్లే వారిని ఇబ్బందులు పెట్టొద్దని మరోమారు అధికారులకు సూచనలు చేశారు.. రీచ్ లలో స్వయంగా ఇసుక తవ్వి తీసుకెళ్లేందుకు అనుమతించాలని పేర్కొన్నారు సీఎం..
Read Also: Top Headlines @ 9 PM: టాప్ న్యూస్
ఇక, ఇసుక ధరల్ని కట్టడి చేసేందుకు జిల్లా స్థాయిలో ధరలను మరల సమీక్షించాలని ఆదేశించారు సీఎం చంద్రబాబు.. స్థానిక ఇసుక రీచ్ ల వద్ద తవ్వకం కోసం నిర్దేశించిన రుసుము మాత్రమే వినియోగదారుల నుంచి వసూలు చేయాల్సిందిగా మరోమారు స్పష్టం చేసిన ఆయన.. ఈ అంశంలో ఏమైనా ఫిర్యాదులు వస్తే సహించబోమని తేల్చి చెప్పారు.. ఇసుక పై ఖర్చు తగ్గేలా రవాణా, తవ్వకం వ్యయం అతి తక్కువగా ఉండేలా చూడాల్సిందిగా సూచించిన ఆయన.. ఇసుక సరఫరాపై ప్రజల నుంచి మరిన్ని వివరాలు తెలుసుకునేలా ఆర్టీజీఎస్ ద్వారా ఐవీఆర్ఎస్ కాల్స్ చేయాల్సిందిగా ఆదేశించారు.. రేపటి నుంచి ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా ప్రజల నుంచి ఫిర్యాదులు, సూచనలు సేకరించాల్సిందిగా సీఎం ఆదేశాలు ఇచ్చారు.. ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని ఆదేశించిన సీఎం.. నిరంతరం సర్వియలెన్స్ కెమెరాలతో అంతర్రాష్ట్ర చెక్ పోస్టులు నడపాలని సూచించారు.. పోలీసులు జిల్లాల్లో జరిగే అక్రమ రవాణాపై నిరంతరం దృష్టి పెట్టి అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.. రాష్ట్రవ్యాప్తంగా ప్రజల నుంచి అందే ఫీడ్ బ్యాక్ తో పాటు ఫిర్యాదులపై తదుపరి సమావేశంలో సమీక్షిస్తామని ఈ సందర్భంగా వెల్లడించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..