డిప్యూటీ సీఎం రాజన్నదొర సంచలనవ్యాఖ్యలు
ఏపీ డిప్యూటీ సీఎం రాజన్నదొర సంచలన వ్యాఖ్యలతో మరోమారు వార్తల్లోకి ఎక్కారు. విజయనగరంలో ఆయన మాట్లాడారు. సాలూరు ప్రాంతం సెటిలర్స్ వల్ల నష్టపోతుంది. చౌదరి, రెడ్లు ఇక్కడ ఎక్కువగా ఉన్నారు. వారు భూములను, వ్యాపారాలను అభివృద్ధి చేసుకుంటున్నారు. ఆదివారం నిర్వహించిన గడపగడపకు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సెటిలర్స్ వ్యవహారం ముఖ్యమంత్రి వద్దకు తీసుకెళ్తానన్నారు. సాలూరు ప్రాంతాన్ని షెడ్యూల్డ్ ఏరియాగా ప్రకటించమని కోరతానన్నారు. అలా జరిగితే సెటిలర్స్ నష్టపోతారు.గిరిజనుల వద్ద బ్రతుకుతూ గిరిజనులకు అన్యాయం చేస్తున్నారు.వారి కోసం వస్తున్న లారీల వల్ల రోడ్లు పాడవుతున్నాయి.సెటిలర్స్ వల్ల ఏ ప్రయోజనం లేదు. గిరిజనుల వద్ద సంపాదించుకొని అభివృద్ధి కి మాత్రం సహకరించడం లేదు. అభివృద్ధి కార్యక్రమాలను బబ్లూ అనే సెటిలర్ అడ్డుకుంటున్నాడన్నారు రాజన్నదొర. ఇక్కడ పనిచేస్తూ అభివృద్ధి చెందుతున్న సెటిలర్లు… ఇక్కడ తమ వల్ల రోడ్లు పాడయితే పట్టించుకోవడం లేదన్నారు రాజన్నదొర.. తాజాగా డిప్యూటీ సీఎం రాజన్నదొర వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.
రేపే తెలంగాణ ఇంటర్ ఫలితాలు…ఎలా తెలుసుకోవచ్చంటే?
విద్యార్ధులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న తెలంగాణ ఇంర్మీడియట్ మొదటి, రెండో సంవత్సరం ఫలితాలు మంగళవారం విడుదల చేయడానికి అధికారులు సన్నాహాలు చేశారు. ఫలితాల వెల్లడిపై బోర్డు అధికారులు ఆదివారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన సంగతి తెలిసిందే. మంత్రి సబితా ఇంద్రారెడ్డితో సంప్రదించిన అనంతరం ఫలితాల విడుదల తేదీని ప్రకటించారు. ఫలితాల వెల్లడికి సంబంధించి సాఫ్ట్‌వేర్‌ను కూడా సిద్ధం చేశారు. విద్యార్థులు మంగళవారం ఇంటర్ బోర్డు వెబ్‌సైట్లు tsbie.cgg.gov.in ద్వారా వేగంగా ఫలితాలు పొందవచ్చు.ఇంటర్‌బోర్డు పరీక్ష పత్రాల ఆన్‌లైన్ మూల్యాంకనం చేపట్టాలని నిర్ణయించినా, వీలు కాకపోవడంతో ఆఫ్‌లైన్ ద్వారా మూల్యాంకనం చేపట్టింది. పలు దఫాలుగా ట్రయల్‌రన్ చేసిన అనంతరం సాంకేతిక ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.
విద్యకోసం విదేశాలకు వెళ్ళి.,. తిరిగిరాని లోకాలకు
అమెరికాలోని టెక్సాస్‌లో జరిగిన కాల్పుల్లో తెలుగమ్మాయి మృతి చెందింది.. హైదరాబాద్ చెందిన తాటికొండ ఐశ్వర్య మృతి చెందినట్లుగా విచారణ సంస్థలు ధ్రువీకరించాయి. హైదరాబాద్ నుంచి కొన్నాళ్ల క్రితమే ఉన్నత చదువుల కోసం టెక్సాస్‌కు వెళ్లిన ఐశ్వర్య మృతి చెందిన సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిన్న టెక్సాస్‌లోని అలెన్ మాల్లో దుండగులు జరిపిన కాల్పుల్లో మొత్తం 8 మంది చనిపోయారు.ఈ కాల్పుల్లో తాటికొండ ఐశ్వర్యకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. తాడికొండ ఐశ్వర్యను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తాటికొండ ఐశ్వర్య మరణించారు. తాటికొండ ఐశ్వర్య మరణించినట్లు తెలుగు సంఘాలు ధ్రువీకరించాయి. తాటికొండ ఐశ్వర్య కొత్తపేటలో నివాసం ఉంటారు. రంగారెడ్డి జిల్లా మెజిస్ట్రేట్ తాటికొండ నర్సిరెడ్డి కుమార్తెనే తాటికొండ ఐశ్వర్య. ఐశ్వర్య మృదేహాన్ని హైదరాబాద్ కు రప్పించేందుకు కుటుంబ సభ్యులతో పాటు అమెరికా తెలుగు సంఘాలు కూడా ప్రయత్నం చేస్తున్నాయి.
ఆర్5 జోన్ లో పట్టాల పంపిణీకి రంగం సిద్ధం
అమరావతి R5 జోనులో పేదలకు ఈ నెల 18 నాటికి ఇంటి పట్టా ఇచ్చేందుకు పని చేస్తున్నాం అన్నారు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు. ఎన్టీఆర్ జిల్లా నుంచి మొత్తం 20684 మంది లబ్ధిదారులు ఉన్నారు. లబ్ధిదారులకు గతంలో ఇచ్చిన హామీ పత్రాలను మళ్లీ రీ సర్వే చేయించాం. రీ సర్వేలో అందుబాటులోకి రాని, చనిపోయిన వారిని పక్కన పెట్టాం. ఇలాంటి వాళ్ళు 5 వేల మందిలోపు ఉన్నారు. పట్టాల ప్రింటింగ్ కూడా పూర్తయింది. ఏ లే అవుట్ లో ఎవరు ఉన్నారో ఇప్పటికే గుర్తించాం అన్నారు కలెక్టర్ ఢిల్లీ రావు.ఎన్టీఆర్ జిల్లా వారి కోసం ఉన్న 11 లే అవుట్లలో 5 లే అవుట్లలో జంగిల్ క్లియరెన్స్, లెవెలింగ్ పూర్తయ్యాయి. మరో 6 లే అవుట్లలో ఈ పనులు 2 రోజుల్లో పూర్తవుతాయి. ఇంటి స్థలాల కోసం CRDA నుంచి 570 ఎకరాలు కేటాయించారు. మరో 95 ఎకరాలు అదనంగా కావాలని CRDAని కోరాం. రోడ్లు, మార్కింగ్, స్తోనింగ్ మాత్రం 2 వేలు ఫ్లాట్లకు పూర్తయ్యాయి. ఈ నెల 15కి మొత్తం ప్రక్రియ పూర్తవుతుంది. రోజుకి 120 మంది ప్రభుత్వ సిబ్బంది పట్టాల కోసం పని చేస్తున్నారు అని చెప్పారు కలెక్టర్ ఢిల్లీ రావు.
రాంబిల్లి ఎస్బీఐలో దోపిడీకి యత్నం
దొంగలు రెచ్చిపోతున్నారు. ఎక్కడ చిన్న అవకాశం దొరికినా.. తమ ప్రతాపం చూపిస్తున్నారు. అనకాపల్లి జిల్లాలో ఓ దొంగ చేసిన ప్రయత్నం విఫలం అయింది. రాంబిల్లి మండలకేంద్రంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖలో దోపిడీకి ప్రయత్నించాడు దొంగ. బ్యాంక్ మెయిన్ గేటు తాళాలు పగులగొట్టి లోనికి ప్రవేశించిన దొంగ దోపిడీకి ప్రయత్నించడం కలకలం రేపింది. అయితే, బ్యాంక్ లోని సైరన్ మ్రోగడంతో పరారయ్యాడు ఆ దొంగ. ఆ దొంగ తెలివిగా వ్యవహరించాడని సీసీ ఫుటేజ్ ని బట్టి తెలుస్తోంది. ముఖం కనిపించకుండా గొడుగు అడ్డంగా పెట్టుకున్నట్లు సీసీ కెమెరా పుటేజీలో రికార్డ్ అయింది. ఈ కారణంగా సీసీ కెమెరాల్లో దోపిడీకి యత్నించిన దొంగ ఆచూకీ లభ్యం కాలేదు. శనివారం అర్ధరాత్రి దోపిడీ యత్నం జరిగినట్లు భావిస్తున్నారు పోలీసులు. క్లూస్ టీంతో బ్యాంక్ పరిసరాలు పరిశీలిస్తున్నారు రాంబిల్లి పోలీసులు. రాంబిల్లి లోని ఇదే స్టేబ్ బ్యాంక్ శాఖలో గతంలోకూడా దోపిడీకి విఫలయత్నం జరిగింది.
ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో ఎన్ కౌంటర్.. ఇద్దరు మృతి
ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో సోమవారం ఉదయం పోలీసులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక మహిళతో సహా ఇద్దరు మావోయిస్టులు మరణించినట్లు అధికారి ఒకరు తెలిపారు. ఎన్‌కౌంటర్ స్థలం నుంచి పేలుడు పదార్ధాలను, ఆటోమేటిక్ ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నామని, ఇద్దరు మావోయిస్టులు తమ తలపై రూ.11 లక్షల నజరానాను కలిగి ఉన్నారని ఆయన చెప్పారు. రాష్ట్ర రాజధాని రాయ్‌పూర్‌కు 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న భేజీ పోలీస్ స్టేషన్ పరిధిలోని దంతేష్‌పురం గ్రామ సమీపంలోని అడవిలో ఉదయం 5.30 గంటలకు జిల్లా రిజర్వ్ గార్డ్ (DRG) బృందం మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్‌లో ఉండగా, సుక్మాలో కాల్పులు జరిగాయని ఎస్పీ సునీల్ శర్మ తెలిపారు. గొలపల్లి లోకల్ ఆర్గనైజేషన్ స్క్వాడ్ (ఎల్‌ఓఎస్) మావోయిస్టు కమాండర్ మడ్కం ఎర్రతో పాటు 30-35 మంది టీమ్ సభ్యులు ఉన్నట్లు పోలీసులకు నిర్దిష్ట సమాచారం అందింది. దీంతో డీఆర్‌జీ, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్), దాని ఎలైట్ యూనిట్ కమాండో బెటాలియన్ ఫర్ రిజల్యూట్ యాక్షన్ (కోబ్రా) ప్రత్యేక బృందాలు ఆదివారం రాత్రి ఆపరేషన్‌ను ప్రారంభించాయని ఆయన చెప్పారు. డీఆర్‌జీ పెట్రోలింగ్ టీమ్‌లలో ఒకటి దంతేష్‌పురం అడవులను చుట్టుముట్టినప్పుడు, సాయుధ మావోయిస్టులు కాల్పులు జరిపారు. ఇది కాల్పులకు దారితీసిందని ఎస్పీ తెలిపారు.
భారత గగనతలంలోకి పాక్ విమానం.. వర్షం దెబ్బకు దారి తప్పిందట!
పాకిస్థాన్‌కు చెందిన ఓ విమానం భారత గగనతలంలోకి ప్రవేశించింది. ల్యాండింగ్ సమస్య కారణంగా పది నిమిషాల పాటు మన దేశ పరిధిలో చక్కర్లు కొట్టింది. పేలవమైన వాతావరణం వల్ల పాక్ విమానం భారత గగనతలంలోకి ప్రవేశించడంతో వైమానిక దళం నిఘా ఉంచింది. ఆ సమయంలో పైలట్.. విమానాన్ని 23 వేల అడుగుల ఎత్తుకు తీసుకెళ్లాడు. ఈ ఘటనకు సంబంధించిన సమాచారాన్ని ఓ మీడియా ప్రచురించడం వల్ల వెలుగులోకి వచ్చింది. ఈ ప్రాంతంలో భారీ వర్షం కారణంగా లాహోర్ విమానాశ్రయంలో ల్యాండ్ కావడం విఫలమైన తర్వాత.. గత వారం భారత గగనతలంలోకి ప్రవేశించిన పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ బోయింగ్ 777 జెట్‌లైనర్‌ను భారత వైమానిక దళం నిశితంగా పరిశీలిస్తోంది.మే 4న, పాకిస్తానీ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ (PIA) ఫ్లైట్ బోయింగ్ 777 (పీకే-248) మస్కట్ నుంచి లాహోర్‌లోని అల్లామా ఇక్బాల్ అంతర్జాతీయ విమానాశ్రయానికి బయలుదేరింది. ఆ విమానం ప్రతికూల వాతావరణం కారణంగా ల్యాండింగ్‌ను నిలిపివేయవలసి వచ్చింది. అదే రోజు రాత్రి ఎనిమిది గంటలకు లాహోర్ విమానాశ్రయంలో ఆ విమానం ల్యాండ్ కావాల్సి ఉంది. ఆ సమయంలో లాహోర్‌లో భారీ వర్షం కురుస్తోంది. దీంతో పైలట్ విమానాన్ని ల్యాండింగ్ చేసేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు. ఆ విమానం ఎదుర్కొంటున్న పరిస్థితులపై ఢిల్లీ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అప్రమత్తమైందని, ఆ ప్రాంతంలోని వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకుని బోయింగ్‌ను పక్కదారి పట్టించాలని అభ్యర్థనను ప్రాసెస్ చేసినట్లు తెలిసింది.
కుప్పకూలిన మిగ్-21 విమానం.. ముగ్గురు పౌరులు మృతి.. పైలట్ సేఫ్
వైమానిక దళానికి చెందిన మిగ్-21 విమానం రాజస్థాన్‌లోని హనుమాన్‌గఢ్ జిల్లా కూలిపోయింది. భారత వైమానిక దళానికి చెందిన మిగ్-21 సోమవారం రాజస్థాన్‌లోని హనుమాన్‌గఢ్ జిల్లాలో ఓ ఇంటిపై కూలిపోయిందని, ముగ్గురు గ్రామస్థులు ప్రాణాలు కోల్పోగా, పైలట్ సురక్షితంగా ఉన్నారని రక్షణ వర్గాలు తెలిపాయి. హనుమాన్‌గఢ్ జిల్లాలోని పిలిబంగా సమీపంలో సాంకేతిక లోపం కారణంగా సూరత్‌గఢ్ ఎయిర్‌బేస్ నుండి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానం కూలిపోయింది. పైలట్ సకాలంలో పారాచూట్ ఉపయోగించి విమానం నుండి దూకాడని, అతను సురక్షితంగా ఉన్నాడని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో పైలట్‌కు స్వల్ప గాయాలయ్యాయని, ఘటనపై విచారణకు ఆదేశించామని వైమానిక దళం తెలిపింది. ఈ ప్రమాదంలో ముగ్గురు స్థానికులు ప్రాణాలు కోల్పోగా.. పైలట్ సురక్షితంగా ఉన్నారని, సహాయక చర్యల కోసం సైన్యానికి చెందిన హెలికాప్టర్ ప్రమాద స్థలానికి చేరుకుందని తెలిసింది. ఐఏఎఫ్ వర్గాల సమాచారం ప్రకారం విమానం సూరత్‌గఢ్ నుండి బయలుదేరింది. మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. “ఈరోజు ఉదయం సాధారణ శిక్షణలో భాగంగా సూరత్‌గఢ్ సమీపంలో ఐఏఎఫ్‌కి చెందిన మిగ్-21 విమానం కూలిపోయింది. పైలట్ సురక్షితంగా బయటపడ్డాడు. స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకోవడానికి విచారణ ఏర్పాటు చేయబడింది” అని వాయుసేన ట్వీట్ చేసింది. విమానం కూలిపోయిన ప్రాంతంలో రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు. “పైలట్ మానవ ప్రాణనష్టాన్ని నివారించడానికి అన్ని ప్రయత్నాలు చేశాడు. గ్రామ శివార్లలో విమానాన్ని క్రాష్-ల్యాండ్ చేసాడు” అని బికనీర్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఓం ప్రకాష్ తెలిపారు.