చంద్రబాబుకి మంత్రి పెద్దిరెడ్డి సవాల్
టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మరోసారి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్ ఆదేశిస్తే కుప్పంలో చంద్రబాబుపై పోటీకి తాను సిద్ధంగా ఉన్నానని… పుంగనూరులో తనపై పోటీకి చంద్రబాబు సిద్ధమా అని ప్రశ్నించారు. రెండు చోట్ల పోటీ చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. కుప్పంలో చంద్రబాబుకు ఈ దఫా డిపాజిట్ రావడం కుడా కష్టమేనన్నారు. తన మానసిక పరిస్థితి ఎలా ఉందో చంద్రబాబు ఒకసారి వైద్యులను కలిసి చూపించుకుంటే మంచిదన్నారు. కుప్పంలో చంద్రబాబు పరిస్థితి ఎలా ఉంటుందో తాను చూస్తానన్నారు. అటు చంద్రబాబు నోటికి వచ్చినట్లు కారుకూతలు కూస్తున్నాడని మంత్రి పెద్దిరెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు కేవలం తన స్వార్ధ ప్రయోజనాల కోసం, తన ఎల్లో మీడియా కోసం పనిచేస్తున్నాడని ఆరోపించారు. పుంగనూరులో చంద్రబాబు ఏం పీకలేడని.. కుప్పంలో ఆయన జెండాను శాశ్వతంగా పీకేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయని మంత్రి పెద్దిరెడ్డి విమర్శలు చేశారు. టీడీపీ జెండాను మోయమని దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్‌కు అజెండాను అప్పగించాడని చంద్రబాబును ఉద్దేశించి ఎద్దేవా చేశారు.
కూడు కోసం, పోడు భూమి కోసం జలదీక్ష
కూడు కోసం పోడు భూములను నమ్ముకుని వ్యవసాయం చేస్తు జీవనం కొనసాగిస్తున్న నిరుపేదలు వాళ్లు . దాదాపు 30 సంవత్సరాలుగా పోడు భూములకు పట్టాలు వస్తాయని ఆశతో ఎదురుచూస్తున్న ఎల్లన నగర్ వాసులు. చంటి పిల్లలతో సహా 18 మంది మహిళలు జైలుకు వెళ్ళారు. రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయమైన ఎల్లన నగర్ గ్రామ రైతులు మహిళలు వినూత్న తరహాలో నిరసన కార్యక్రమం చేపట్టారు.ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలంలోని ఎల్లన నగర్ గ్రామంలో సిపిఐ ఎంఎల్ పార్టీ ఆధ్వర్యంలో మహిళలు రైతులు వినూత్న తరహాలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఎన్ఎస్పి కెనాల్ నందు నీటిలోకి దిగి జల దీక్ష కార్యక్రమం చేపట్టారు. పోడు సర్వే చేస్తారా చావమంటారా ముఖ్యమంత్రి గారు మా గోడు వినండి అంటూ నినాదాలు చేస్తూ నిరసన కార్యక్రమం నిర్వహించారు. దాదాపు 30 సంవత్సరాల నుండి స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని పోడు భూములను వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నామన్నారు.
అత్తింటి వేధింపులు తాళలేక… వివాహిత బలవన్మరణం
చిన్నచిన్న కారణాలతో బలవన్మరణాలకు పాల్పడుతున్నారు యువతీ, యువకులు, వివాహిత మహిళలు. పండుగ పూట వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. అత్తింటి వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన కేపీహెచ్ బీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు, మృతురాలి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం కాకినాడకు చెందిన రమ వెంకట లక్ష్మీపతి స్వాతికి 2011 డిసెంబర్ నెలలో సామర్లకోటలో నివసించే శ్రీధర్ తో వివాహం జరిగింది. కేపీహెచ్బీ కాలనీ మంజీరా మెజిస్టిక్ హోమ్స్, 9వ అంతస్తులో 910 ప్లాట్ లో నివాసం ఉంటున్నారు. వీరికి 2016లో ఓ బాబు జన్మించాడు. ఆ బాబు మానసిక అంగవైకల్యంతో పుట్టాడు. దీంతో శ్రీధర్ కుటుంబ సభ్యులు స్వాతిని మానసికంగా వేధించటం ప్రారంభించారు. ఆ పిల్లాడిని చంపేసి మరో గర్భం దాల్చాలని ఒత్తిడి తెస్తూ గొడవపడుతూ ఉండేవారు. పిల్లాడు పుట్టి ఏడేళ్ళయినా వేధింపులు కొనసాగుతున్నాయి. దీంతో ఈ వేధింపులు తాళలేని స్వాతి ఆదివారం రాత్రి అంతస్తు పైకి ఎక్కి కిందకు దూకి ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు శ్రీధర్ అతని కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. తల్లి మరణంతో పిల్లాడు తల్లికోసం ఆరాటపడుతున్నాడు. అల్లుడు, అతని కుటుంబసభ్యులకు కఠిన శిక్ష పడేలా చూడాలని స్వాతి తల్లిదండ్రులు కోరుతున్నారు.
చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో అరుదైన వన్యప్రాణుల పట్టివేత
చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం లో అరుదైన వన్య ప్రాణులను పట్టుకున్నారు కస్టమ్స్ అధికారులు. బ్యాంకాక్ ప్రయాణీకుడి వద్ద ప్రాణం తో ఉన్న వన్య ప్రాణులు గుర్తించారు కస్టమ్స్ అధికారులు. రెండు లగేజ్ బ్యాగ్ లలో 45 బాల్ ఫైతాన్స్, 3 అరుదైన జాతి కోతులు, 3 స్టార్ తాబేళ్ళు, 8 పాములను సీజ్ చేశారు కస్టమ్స్ అధికారులు. ప్రయాణీకుడి పై వన్య ప్రాణి చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుంది కస్టమ్స్ బృందం. సీజ్ చేసిన వన్య ప్రాణులను తిరిగి బ్యాంకాక్ కు పంపించారు కస్టమ్స్ అధికారులు. స్మగ్లింగ్ లకు అడ్డగా ఎయిర్ పోర్టులు మారాయి. మత్తు పదార్థాలు, బంగారం ఇప్పుడు వన్య ప్రాణులు ఇలా అన్నింటినీ అక్రమంగా రవాణా చేస్తున్నారు దుండగులు. ఎన్ని నిఘాలు ఏర్పాటు చేసిన ఈ స్మగ్లింగ్ ఆగట్లేదు. రోజుకో కొత్త మార్గంలో కేటుగాళ్లు పలు రకాల స్మగ్లింగ్ లకు పాల్పడుతూనే ఉన్నారు. ఇటీవల.. చెన్నై విమానాశ్రయంలో భారీగా బంగారం, నగదు సీజ్ పట్టుబడింది. దుబాయ్, సింగపూర్ నుంచి వచ్చిన ప్రయాణికుల వద్ద గుర్తించిన రూ. 37 లక్షల విలువైన బంగారం-విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు ఎయిర్‌పోర్టు అధికారులు.
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే నెలకు రూ.2 వేల సాయం
కర్ణాటకలో రాజకీయాలు మరింత వేడిని రాజేస్తున్నాయి. ఇప్పటికే బీజేపీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించింది. మరో వైపు కాంగ్రెస్ పార్టీ బస్సు యాత్రను ప్రారంభించింది. ఈ సందర్భంగా తాము గనుక అధికారంలోకి వస్తే ప్రతి మహిళ కుటుంబానికి రూ. 2,000 నెల నెలా ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి మహిళా ఇంటి పెద్దకు నెలకు రూ. 2,000 ఇస్తామని సోమవారం హామీ ఇచ్చింది. కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా ఈ ప్రకటన చేశారు, ‘గృహలక్ష్మి యోజన’ కింద సంవత్సరానికి రూ.24,000 నేరుగా వారి బ్యాంకు ఖాతాలకు జమ చేయబడుతుందని ప్రకటించారు. మే నాటికి అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న కర్ణాటకలోని ప్రతి ఇంటికి ప్రతి నెలా 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ను అందజేస్తామని కాంగ్రెస్ ప్రకటించిన కొద్ది రోజుల్లోనే ఈ హామీ వెలువడింది. ‘గృహ లక్ష్మి యోజన’ అనేది ఎల్పీజీ ధరల భారాన్ని, మహిళ భరించే ఖరీదైన రోజువారీ ఖర్చులను పంచుకోవడానికి చేసిన ప్రయత్నమని పార్టీ పేర్కొంది. రాష్ట్రంలోని ప్రతి మహిళ సాధికారతతో పాటు తన కాళ్లపై తాను నిలబడే సామర్థ్యంతో పాటు తన పిల్లలను కూడా చూసుకునేలా ఉండాలని కాంగ్రెస్ కోరుకుంటోంది.
ముక్కలు.. ముక్కలుగా నరికి.. మిస్టరీ కేసులో కీలక మలుపు
వివాహేతర సంబంధాలు దారుణాలకు కారణం అవుతున్నాయి. పచ్చని సంసారాల్లో చిచ్చురేగుతోంది. అనకాపల్లి జిల్లా ఎలమంచిలి కొత్త పాలెం మండలంలో గుర్తు తెలియని మృతదేహం తీవ్ర కలకలం రేపింది. హత్య చేసి ముక్కలు ముక్కలుగా నరికి కాలువలో పడేసారు గుర్తుతెలియని వ్యక్తులు. ప్రస్తుతం ఈ కేసు మిస్టరీగానే కొనసాగుతుంది. మృతదేహం ఎవరిది అన్నదానిపై ఇంకా స్పష్టత రాలేదు..ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి… హత్య జరిగిన తీరు బట్టి వివాహేతర సంబంధం నేపథ్యంలో జరిగి ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.యలమంచిలి నియోజకవర్గం కొత్తపాలెం మండలం చెరుకుల కాటా సమీపంలో నిన్న కాలువలో గుర్తు తెలియని మృతదేహం లభ్యం అయింది. దొరికిన ఆనవాళ్లు ఆధారంగా ఎక్కడో హత్య చేసి కాల్చి ముక్కముక్కలుగా నరికి మూట కట్టి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు…మృతదేహానికి సంబంధించిన కొన్ని భాగాలు మాత్రమే లభ్యం అయ్యాయి..మరో కాలు చెయ్యి కోసం గాలించనున్నారు పోలీసులు. హత్య చేసి మూడు నాలుగు రోజుల క్రితం శివారులో ఉన్న రోడ్డు పక్కన ఉన్న కాలువలో పడేసి ఉంటారని అనుమానిస్తున్నారు.
హైదరాబాద్‌లో మోడ్రన్ హాస్పిటల్స్ నిర్మాణ కాంట్రాక్టులు
హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో 3 అధునాతన ఆస్పత్రుల నిర్మాణం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 3 సంస్థలకు కాంట్రాక్టులు ఇచ్చింది. 2 వేల కోట్ల రూపాయల విలువైన ఈ కాంట్రాక్టులకు సంబంధించి లెటర్ ఆఫ్ అవార్డును అందజేసింది. సనత్ నగర్, ఎల్‌బీ నగర్, ఆల్వాల్ ఏరియాల్లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కట్టేందుకు 3 నిర్మాణ సంస్థలను ఎంపిక చేసింది. ఈ ఆస్పత్రులను టిమ్స్ అనే పేరుతో పిలుస్తారు. టిమ్స్.. అంటే.. తెలంగాణ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అని అర్థం. ఈ 3 టిమ్స్‌ను లార్సెన్ అండ్ టూబ్రో, మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ మరియు DEC ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థలు నిర్మిస్తాయి. ఎల్‌బీ నగర్ టిమ్స్‌ను L&Tకి, సనత్ నగర్ టిమ్స్‌ను MEILకి, ఆల్వాల్ టిమ్స్‌ను DECకి అప్పగించారు. ఈ మేరకు L&Tకి 668 కోట్ల రూపాయలు, MEILకి 667 కోట్ల రూపాయలు, DECకి 669 కోట్ల రూపాయలు ఇవ్వనున్నారు.
ఆ టాటూ అతడికి బుద్ధిచెప్పడానికే వేసుకున్నా.. రష్మిక
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం అమ్మడు వరుస సినిమాలతో బిజీగా మారింది. పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న రష్మిక.. తాజాగా కోలీవుడ్ లో వరిసు సినిమాతో మంచి హిట్ నే అందుకొంది. చిన్నతనం నుంచి విజయ్ తన ఫేవరేట్ హీరో అని, అతనితో కలిసి నటించడం అదృష్టమని చెప్పిన రష్మిక వరిసు విజయంతో మంచి జోష్ మీద ఉంది. ఇక మరోపక్క బాలీవుడ్ లో కూడా అమ్మడు పాగా వేయాలని చూస్తోంది. ఇప్పటికే అమితాబ్ బచ్చన్ సినిమా గుడ్ బై తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చినా అది ఏ మాత్రం రష్మిక కు ఉపయోగపడలేదు. ఇక రష్మిక ఆశలన్నీ మిషన్ మజ్ను మీదనే పెట్టుకొంది. సిద్దార్థ్ మల్హోత్రా హీరోగా తెరకెక్కిన ఈ సినిమా వచ్చే నెల ఓటిటీలో రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలోనే వరుస ప్రమోషన్స్ తో బిజీగా ఉన్న రష్మిక వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ ఆసక్తికరమైన విషయాలను పంచుకొంది.