ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ మిస్టేక్.. సంజయ్ సింగ్ కి సారీ
ఢిల్లీ లిక్కర్ స్కాం విచారణలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తన దూకుడును పెంచింది. ఈ కేసులో ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రమేయం ఉన్నవారిని విచారిస్తూ తప్పు చేసిన వారిని అరెస్ట్ చేస్తోంది. కాగా ఈ కేసులో తాజాగా ఈడీ పొరపాటు చేయడం సంచలనంగా మారుతోంది. ఈడీ ఫైల్ చేసిన ఛార్జ్ షీట్‌లో ఒకరి పేరుకు బదులుగా మరొకరి పేరును మార్చడం వల్ల గందరగోళంగా మారింది. మామూలుగా ఈ స్కాంలో ప్రమేయం ఉందన్న కారణంగా ఢిల్లీ ఆప్ నాయకుడు సంజయ్ సింగ్ పేరును కేసులో చేర్చారు. ఈ విషయం తెలుసుకున్న సంజయ్ సింగ్ ఈడీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ స్కాంతో అసలు సంబంధం లేని తన పేరును ఛార్జిషీట్‌లో చేర్చి.. తన ప్రతిష్టను దెబ్బతీశారని ఈడీకి లీగల్ నోటీసులు పంపారు. సంజయ్ సింగ్ ఏప్రిల్ 22న ఈడీ చీఫ్ సంజయ్ కుమార్ మిశ్రా, అసిస్టెంట్ డైరెక్టర్ జోగేందర్ సింగ్‌లకు తన లాయర్ ద్వారా లీగల్ నోటీసు పంపారు, క్షమాపణలు చెప్పాలని లేదా సివిల్, క్రిమినల్ ప్రొసీడింగ్స్ ఎదుర్కోవాలని కోరారు.
విశాఖ డేటా సెంటర్ దేశంలో అతి పెద్దది
విశాఖలో డేటా సెంటర్ శంకుస్థాపన పూర్తయింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ మాట్లాడారు. విశాఖపట్నంలో 300 మెగావాట్ల డేటాసెంటర్ ఏర్పాటుకు శంకుస్థాపన చేయడం చరిత్రాత్మక ఘట్టం అన్నారు సీఎం. విశాఖ ప్రగతిలో ఈ ప్రాజెక్టు కీలక పాత్ర పోషిస్తుందన్నారు. డేటా సెంటర్ ఏర్పాటులో భాగంగా సింగపూర్ నుంచి సబ్‌మెరైన్ కేబుల్ ఏర్పాటు చేస్తారు. ఇంటర్నెట్ కనెక్టివిటీ, వినియోగం, ఇంటర్నెట్ స్పీడ్ గణనీయంగా పెరుగుతుందన్నారు. డేటా డౌన్లోడ్, అప్‌లోడ్ శరవేగంగా జరుగుతాయి. ఇది విశాఖ అభివృద్ధిని మరింత పెంచుతుంది.ఈ తరహా ఆధునిక సదుపాయావల్ల విశాఖ నగరం మహానగరంగా ఎదగడానికి దోహదపడుతుందన్నారు సీఎం జగన్. 39 వేల మందికి ఉపాధి కలుగుతుంది. 21,800 కోట్ల పెట్టుబడి విశాఖకు రాబోతోందన్నారు. సహజనవనరుల ద్వారా లభించే విద్యుత్తునే ఈ డేటా సెంటర్‌కు వినియోగిస్తారు. 190 ఎకరాల భూమిని డేటా సెంటర్ కోసం కేటాయించాం. డేటా సెంటర్ పార్కుతోపాటు, ఐటీ సెంటర్ పార్కు, స్కిల్ డెవలప్‌మెంట్ సదుపాయం, రిక్రియేషన్ సెంటర్ ఏర్పాటవుతుంది. క్లౌడ్ సర్వీసులు కూడా మెరుగుపడతాయన్నారు. తద్వారా ఐటీ కార్యకలాపాలను వేగంగా ఊపందుకుంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు జగన్. అదానీ గ్రూపునకు నా ధన్యవాదాలు, విశాఖలో డేటా సెంటర్ దేశంలోనే అతిపెద్దదిగా ఉంటుందన్నారు.
డ్రోన్ టెక్నాలజీలో నైపుణ్యం పెంచుకోవాలి
గవర్నర్ అబ్దుల్ నజీర్ ధనేకుల ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ & టెక్నాలజీలో డ్రోన్ R&D కేంద్రాన్ని ప్రారంభించారు. కళాశాల 14వ వార్షికోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భారత సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ గౌరవ అతిథిగా పాల్గొన్నారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ మాట్లాడుతూ.. డ్రోన్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదా మెషీన్ లెర్నింగ్ వంటి అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలలో ఒక సముచిత కెరీర్‌ను రూపొందించుకోవాలి. భారతదేశం వివిధ రంగాలలో అద్భుతమైన పురోగతి సాధిస్తోంది. దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, డిజిటలైజేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి వివిధ రంగాలలో డ్రోన్ల వినియోగం పెరుగుతోందన్నారు. ప్రస్తుతం నిఘా, భౌగోళిక మ్యాపింగ్, డిజాస్టర్ మేనేజ్‌మెంట్, సెర్చ్ అండ్ రెస్క్యూ, అగ్రికల్చర్ తదితర విభాగాల్లో డ్రోన్‌లను వినియోగిస్తున్నాం. డ్రోన్ టెక్నాలజీ, డిజైన్, ఇంటిగ్రేషన్, ఆర్కిటెక్చర్ తదితర రంగాల్లో విద్యార్థులు తమ నైపుణ్యాలను పెంపొందించుకోవాలి. ఇజ్రాయెల్‌లోని డ్రోనిక్స్ ఇంజినీరింగ్ లిమిటెడ్ సహకారంతో డ్రోన్ ఆర్ అండ్ డి సెంటర్‌ను ఏర్పాటు చేయడానికి కళాశాల తీసుకున్న చొరవను అభినందిస్తున్నా అన్నారు గవర్నర్ అబ్దుల్ నజీర్.
క్రెమ్లిన్‌పై డ్రోన్ దాడితో ఎలాంటి సంబంధం లేదు.. ఉక్రెయిన్ ప్రకటన
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ హత్య ఉక్రెయిన్ ప్రయత్నాలు చేస్తోందని రష్యా సంచలన ఆరోపణ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఆరోపణలపై ఉక్రెయిన్ స్పందించింది. క్రెమ్లిన్ డ్రోన్ దాడితో తమకు ఎలాంటి సంబంధం లేదని ఉక్రెయిన్ బుధవారం ప్రకటించింది. మే 9న అత్యంత ముఖ్యమైన సెలవుదినం సందర్భంగా పుతిన్ క్రెమ్లిన్ నివాసాన్ని రాత్రిపూట రెండు డ్రోన్‌లు లక్ష్యంగా చేసుకున్నాయని, దీనిని ఉక్రేనియన్ “ఉగ్రవాద దాడి”గా రష్యా అభివర్ణించింది.క్రెమ్లిన్‌పై డ్రోన్ దాడులతో ఉక్రెయిన్‌కు ఎలాంటి సంబంధం లేదని ఉక్రెయిన్ అధ్యక్ష ప్రతినిధి మిఖైలో పొడోల్యాక్ అన్నారు. “ఉక్రెయిన్ క్రెమ్లిన్‌పై దాడి చేయదు ఎందుకంటే, ముందుగా అది ఎటువంటి సైనిక లక్ష్యాలను పరిష్కరించదు.” అని ఆయన కీలక ప్రకటన చేశారు. ఉక్రెయిన్‌తో 14 నెలల యుద్ధంలో మరింత తీవ్రతరం కావడానికి మాస్కో ఈ విధంగా ఆరోపణలు చేస్తోందని ఆయన సూచించారు. రష్యా ఆరోపణలను ఉక్రెయిన్‌పై పెద్ద ఎత్తున ఉగ్రవాద దాడికి సిద్ధం చేసే ప్రయత్నంగా మాత్రమే పరిగణించాలని మిఖైలో పొడోల్యాక్ తెలిపారు.
పెళ్ళయ్యాక యావరేజ్.. విడాకులు తీసుకున్నాక ఏంటీ?
సాధారణంగా పెళ్లికి ముందు అబ్బాయిలు, అమ్మాయిలు ఎంత అందంగా ఉన్నా పెళ్లి తరువాత వారిలో మార్పు వస్తుంది అనేది నమ్మదగ్గ నిజం. ఇక సినిమా ఇండస్ట్రీలో ఉన్నవారి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. సినిమా.. ఒక గ్లామర్ ప్రపంచం కాబట్టి.. ఆ గ్లామర్ ను మెయింటైన్ చేస్తూ ఉండాలి. అందులో అక్కినేని కుటుంబం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. 60 ఏళ్ళు దాటినా కూడా నాగార్జున ఇప్పటికీ నవ మన్మథుడు అని అనిపించుకుంటున్నాడు. తండ్రి పోలికలు ఎక్కడికి పోతాయి.. ఇప్పుడు జూనియర్ మన్మథుడు అక్కినేని నాగ చైతన్య సైతం.. వయస్సు పెరిగేకొద్దీ అందంలో తండ్రిని మించిపోయాడు. అదేం విచిత్రమో.. ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకొని, సంతోషంగా ఉన్నప్పుడు కంటే.. ఆమెకు విడాకులు ఇచ్చి, మళ్లీ సింగిల్ గా ఉన్నప్పుడు ఈ కుర్రాడిలో అందం రెట్టింపు అయ్యిందని జనాలు మాట్లాడుకుంటున్నారు.
బాలీవుడ్ నుంచి జగపతిబాబుకి బోలెడు ఆఫర్స్
ప్రముఖ నటుడు జగపతిబాబు కీలక పాత్రపోషించిన ‘రామబాణం’ చిత్రం శుక్రవారం జనం ముందుకు రాబోతోంది. హీరో గోపీచంద్ అన్నయ్యగా ఈ సినిమాలో జగపతిబాబు నటించారు. శ్రీవాస్ దర్శకత్వంలో టి.జి. విశ్వప్రసాద్ నిర్మించిన ఈ సినిమాలోని విశేషాలను జగపతిబాబు పాత్రికేయులతో పంచుకున్నారు. ఈ మూవీ యాక్సెప్ట్ చేయడానికి కారణం చెబుతూ, “ఇప్పుడన్నీ హారర్, యాక్షన్, థ్రిల్లర్స్ ఎక్కువగా వస్తున్నాయి. ఫ్యామిలీ డ్రామా వచ్చి చాలా కాలమైంది. అలాగే గోపీచంద్, శ్రీవాస్, నేను కలిసి గతంలో ‘లక్ష్యం’ చేశాం. ఇది మెయిన్ ఎట్రాక్షన్. అలాగే ‘రామబాణం’లో అన్నదమ్ముల కాన్సెప్ట్ అద్భుతంగా కుదిరింది. గతంలో చేసిన ‘శివరామరాజు’ కూడా కూడా అన్నదమ్ముల కథే. ఆ సినిమా చూసి విడిపోయిన కొన్ని కుటుంబాలు కలిశాయి. ‘రామబాణం’ కూడా చాలా మంచి ఉద్దేశంతో చేసిన సినిమా.” అని అన్నారు. హీరో నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిన తర్వాత హాయిగా ఉందని చెబుతూ, “హీరో అనేది పెద్ద భాద్యత. ఇప్పుడా ఒత్తిడి లేకపోవడంతో దర్శకుడు కోరుకునే పెర్ఫార్మెన్స్ డెలివర్ చేయడం ఇంకా సులువవుతుంది. ఇప్పటి వరకూ దాదాపు 70కి పైగా క్యారెక్టర్ రోల్స్ చేశాను. అయితే ఇందులో చెప్పుకోవడానికి ఏడెనిమిది సినిమాలే వున్నాయి. కొన్ని సినిమాల్లో సరిగ్గా వాడుకోలేదనే చెప్పాలి. ‘రామబాణం’లో గోపీచంద్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ అన్నదమ్ముల కథలో ఇద్దరి పాత్రలు పండితేనే సినిమా ఆడుతుందని గోపీచంద్ ఖచ్చితంగా ఉన్నారు. అది క్లైమాక్స్ లో తెలుస్తుంది. అందుకు స్కోప్ ఇచ్చిన గోపీచంద్ ని మెచ్చుకోవాలి” అని అన్నారు. తన భార్యగా నటించిన ఖుష్బూ గురించి చెబుతూ, “ఆమె నాకు చిన్నప్పటి నుండీ స్నేహం ఉంది. కానీ ఎప్పుడూ సినిమా చేయడం కుదరలేదు. తను మంచి కంఫర్ట్ బుల్ ఆర్టిస్ట్. తనతో ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ వర్క్ చేస్తాను” అని చెప్పారు.
నేను ఆడా వుంటా.. ఈడా వుంటా: ‘అల్లరి’ నరేశ్
‘అల్లరి’ నరేశ్ తాజా చిత్రం ‘ఉగ్రం’ ఈ నెల 5న జనం ముందుకు వస్తోంది. విజయ్ కనకమేడల దర్శకత్వంలో సాహు గారపాటి, హరీశ్ పెద్ది ఈ సినిమా నిర్మించారు. ఈ మూవీ గురించి నరేశ్ చెప్పిన విశేషాలు తెలుసుకుందాం. ఈ సినిమా సక్సెస్ మీద తన కున్న నమ్మకాన్ని నరేశ్ వ్యక్తం చేస్తూ, “సక్సెస్ పై చాలా నమ్మకంగా వున్నాను. ‘ఉగ్రం’ సినిమా చూసిన తర్వాత ప్రతి క్రాఫ్ట్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటారు. శ్రీచరణ్ దాదాపు రెండున్నర నెలలు కష్టపడి చాలా కొత్త సౌండ్ ఇచ్చాడు. అలాగే బ్రహ్మ కడలి, సిద్, చోటా కె. ప్రసాద్, అబ్బూరి రవి… ఇలా అందరం కలసి టీం వర్క్ చేశాం. ‘నాంది’ తర్వాత టీం అందరిపై అంచనాలు పెరిగాయి. ఆ అంచనాలు అందుకోవడం కోసం పదింతలు కసిగా పని చేశాం” అని చెప్పారు. తాను ఇంతవరకూ చేసిన కామెడీ, యాక్షన్ రోల్స్ గురించి చెబుతూ, “కామెడీ చేయడం చాలా కష్టం. కామెడీ చేసేవారు ఏదైనా చేయగలుగుతారు. ‘రంగమార్తాండ’లో బ్రహ్మనందం గారు, ‘విడుదల’లో సూరి లను అందరూ వెల్ కమ్ చేశారు. ఇప్పుడు ట్రెండ్ మారుతోంది. ‘ఉగ్రం’ విషయానికి వస్తే దర్శకుడు విజయ్ నా ప్లస్ ల కంటే మైనస్ లు ముందుగా చెప్పేశాడు. పోలీస్ పాత్రకు నా ఎత్తు పొడుగు ఓకే. అయితే నా కంటే ఎత్తు తక్కువ వున్న వాళ్ళతో చేసినప్పుడు నేను ఒంగి మాట్లాడతానని, వరుసగా కామెడీ సినిమాలు చేయడం వలన బాడీ లాంగ్వేజ్ తెలియకుండానే అటు వైపు వెళుతుందని, పాత నరేష్ కనిపిస్తే ఆడియన్స్ డిస్ కనెక్ట్ అయిపోతారని.. వీటన్నిటిని అధిగమించాలని ముందే వివరంగా చెప్పాడు.
వర్షం కారణంగా చెన్నై, లక్నో జట్ల మధ్య మ్యాచ్ రద్దు
లక్నోలోని ఏకన స్పోర్ట్స్ సిటీ స్టేడియం వేదికగా.. లక్నో సూపర్ జెయింట్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ రద్దు అయ్యింది. ఏకధాటిగా వర్షం కురవడం వల్లే ఈ మ్యాచ్‌ని రద్దు చేయాల్సి వచ్చింది. దీంతో.. ఇరు జట్లకి చెరో పాయింట్ కేటాయించారు. తొలుత చిరుజల్లలు పడటంతో.. కాసేపట్లోనే వర్షం ఆగిపోవచ్చని అంచనా వేశారు. ఒకవేళ కాస్త ఆలస్యంగా ఆగినా.. డక్‌వర్త్ లూయిస్ విధానంలో మ్యాచ్ కొనసాగించాలని నిర్ణయించారు. కానీ.. ఎంతసేపటికీ వర్షం ఆగకపోవడంతో, చివరికి మ్యాచ్‌ని రద్దు చేసేశారు. అంతకుముందు.. చెన్నై జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంపిక చేసుకోవడంతో, లక్నో జట్టు బ్యాటింగ్ చేసేందుకు రంగంలోకి దిగింది. ఇది బౌలింగ్ పిచ్ కావడం, ముఖ్యంగా స్పిన్‌కు అనుకూలంగా ఉండటంతో.. చెన్నై బౌలర్లు చెలరేగిపోయారు. తమ స్పిన్ మాయాజాలంతో లక్నో బ్యాటర్లను గందరగోళానికి గురి చేసి, వరుస వికెట్లు తీశారు. కైల్ మేయర్స్ (14), స్టోయినిస్ (6), పూరన్ (20) వంటి స్టార్ బ్యాటర్లు సైతం చెన్నై బౌలర్ల ధాటికి చేతులెత్తేశారు. లక్నో పతనం చూసి.. ఈ జట్టు 100 పరుగుల మైలురాయిని అందుకోవడం కష్టమేనని భావించారు. కానీ.. యువ ఆటగాడైన బదోని మాత్రం ఒంటరి పోరాటం కొనసాగించి, తన జట్టుని ఆదుకున్నాడు. హేమాహేమీలు సైతం ఎదుర్కోలేని చెన్నై బౌలర్లను అతడు సింగిల్ హ్యాండెడ్‌గా ఎదుర్కున్నాడు.