రాయచోటి అన్నమయ్య జిల్లా కేంద్రం కాదు అంటే తాను చాలా బాధపడ్డాను అని మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. రాయచోటి నియోజకవర్గం ఏకాకి అయిపోయిందని మరోసారి కన్నీటి పర్యంతమయ్యారు. జరిగిన పొరపాటు, గ్రహపాటుకు తాను కూడా బాధ్యడినే అంటూ.. రాయచోటి ప్రజలకు క్షమాపణలు చెప్పారు. తన ప్రతీ కన్నీటిబొట్టు రాయచోటి అభివృద్ధికే ఉపయోగపడుతుందని మంత్రి రాంప్రసాద్ చెప్పుకొచ్చారు. ఏపీ క్యాబినెట్ సమావేశంలో మంత్రి రాంప్రసాద్ కన్నీటి పర్యంతమయ్యారు. అన్నమయ్య జిల్లా కేంద్రంగా ఉన్న రాయచోటి మార్పుపై కన్నీరు పెట్టుకున్నారు. దాంతో మంత్రిని సీఎం చంద్రబాబు ఓదార్చారు.
క్యాబినెట్ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడేందుకు మంత్రి రాంప్రసాద్ రెడ్డి నిరాకరించారు. సచివాలయం నుంచి బయటకు వచ్చిన ఆయనకు రాయచోటిపై ప్రశ్నలు ఎదురుకాగానే.. మరింత ఉద్వేగానికి లోనయ్యారు. కన్నీళ్లతోనే కారులో ఎక్కి అక్కడి నుంచి వెళ్లిపోయారు. మంత్రి రాంప్రసాద్ ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడుతూ… ‘గత 15 గంటల్లో నాతో నాలుగు సార్లు సీఎం చంద్రబాబు మాట్లాడారు. రాయచోటి అన్నమయ్య జిల్లా కేంద్రం కాదు అంటే చాలా బాధపడ్డాను. రాయచోటి నియోజకవర్గం ఏకాకి అయిపోయింది. నేను మాట నిలబెట్టుకోని వాడిని అయితే నవంబరు 27 గజెట్లో రాయచోటిని మార్చేవారు. రాబోయే పరిణామాలు ధైర్యంగా ఎదుర్కోవాలి. ఆ బాధ అయితే తీర్చలేనిది, హోదా ఇచ్చి తీసేస్తే ప్రజలు డైజెష్ట్ చేసుకోలేకపోతున్నారు’ అని అన్నారు.
Also Read: Anagani Satya Prasad: కడప జిల్లాలోకి రాజంపేట.. తిరుపతి జిల్లాలోకి రైల్వేకోడూరు!
‘జరిగిన పొరపాటు, గ్రహపాటుకు నేను కూడా బాధ్యడినే. రాయచోటి ప్రజలకు క్షమాపణ చెపుతున్నా. నేను మంత్రి కావడానికి ఒక పార్టీ ఆదరణ, ఒక పెద్ద మనిషి సపోర్టే కారణం. మంత్రి పదవి నా ఆశ కాదు.. నియోజకవర్గ ప్రజల ఆకాంక్షే ముఖ్యం. నేను నియోజకవర్గంలో వేరొకరికి మంత్రి పదవి ఇచ్చేయమని అప్పుడే చెప్పాను.. అవి ఇప్పుడు చెప్పకూడదు. రాబోయే కాలాల్లో మీరు ఏకాకి కావడం జరుగుతుందేమో. టిట్ ఫర్ టాట్ అనేది రాజకీయాల్లో పనికిరాదు. రాయచోటికి ద్రోహం చేసేట్టయితే నాలుగు జిల్లాలకు ఏకైక మంత్రిని చేసేవాడిని కాదు అని సీఎం అన్నారు. నా ప్రతీ కన్నీటిబొట్టు రాయచోటి అభివృద్ధికే ఉపయోగపడుతుంది’ అని మంత్రి రాంప్రసాద్ రెడ్డి చెప్పుకొచ్చారు.