AP Assembly Sessions: రేపటి నుండి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. రేపు బడ్జెట్ కూడా ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. రేపు ఉదయం 9 గంటలకు బడ్జెట్‌కు ఏపీ కేబినెట్ ఆమోదం తెలపనునుంది. ఉదయం 10 గంటలకు ఏపీ అసెంబ్లీ ప్రారంభం కానుంది. 11 గంటలకు శాసనసభలో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు. శాసనమండలిలో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.
Read Also: Vidadala Rajini : నాపై తప్పుడు రాతలు రాస్తే పోలీసులు పట్టించుకోలేదు..
బడ్జెట్ ప్రవేశ పెట్టిన తర్వాత బీఏసీ సమావేశం జరగనుంది. బీఏసీ సమావేశంలో బడ్జెట్ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలనే దానిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సుమారు పది రోజులపాటు బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. సుమారు 2.7 లక్షల కోట్ల పైగా బడ్జెట్‌ను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఇప్పటికే బడ్జెట్ సమావేశాలను వైసీపీ బహిష్కరించిన సంగతి తెలిసిందే. వైసీపీ ఎమ్మెల్సీలు మాత్రమే సభకు హజరయ్యే అవకాశం ఉంది. కూటమి సర్కార్ అధికారంలోకి రాగానే తాత్కాలిక ప్రాతిపదికన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టింది. బడ్జెట్ కాలపరిమితి ఈ నెలాఖరుతో ముగియనుండడంతో ఈ అసెంబ్లీ సమావేశాల్లో పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతోంది.
ఈ బడ్జెట్ సమావేశాల్లో అసెంబ్లీలో కీలక బిల్లులు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ల్యాండ్ గ్రాబింగ్ నిరోధక చట్టం 1982 రిపిల్ బిల్లు ప్రవేశపెట్టనున్నారు.ల్యాండ్ గ్రాబింగ్ నిరోధక బిల్లు 2024 ను ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయి. దేవాలయాల పాలక మండలాల్లో ప్రస్తుతం ఉన్న వారికి ఆదనంగా మరో ఇద్దరు సభ్యులు నియామకం పై బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన జ్యూడిషియల్ కమీషన్ రద్దు చేస్తూ అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టనున్నారు. జ్యుడీషియల్ అధికారుల ఉద్యోగ పదవి విరమణ వయస్సు 60 ఏళ్ల నుండి 61 ఏళ్ల కు పెంచుతూ బిల్లు ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. వైసీపీ ప్రభుత్వం తెచ్చిన ప్రభుత్వ మద్యం దుకాణాలను రద్దు చేస్తు తీసుకువచ్చిన ఆర్ఢినెన్స్ స్థానంలో బిల్లు ప్రవేశపెట్టనున్నారు. మద్యం ధరల పై బిల్లు ప్రవేశపెట్టనుంది. డ్రోన్ పాలసీ, డేటా పాలసీలపై అసెంబ్లీలో ఆమోదం తెలిపే అవకాశం ఉంది.