Deve Gowda: కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవానికి హాజరవుతామని మాజీ ప్రధాని, జేడీఎస్ అధినేత హెచ్డీ దేవేగౌడ తెలిపారు. ఈ కార్యక్రమాన్ని బహిష్కరించేందుకు అది బీజేపీ, ఆర్ఎస్ఎస్ కార్యాలయమా.?? అని ప్రశ్నించారు. కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవానికి హాజరవుతామని, ఇది దేశ ప్రజల ఆస్తి, ఇది వ్యక్తిగత విషయం కాదని ఆయన అన్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం సమీక్ష సమావేశంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాక్యలు చేశారు.
Read Also: Vande Bharat Trains: వచ్చే ఏడాది నాటికి 3 రకాల వందే భారత్ ట్రైన్లు.. రైల్వే మంత్రి కీలక ప్రకటన
దేశ ప్రజల పన్ను సొమ్ముతో ఆ అద్భుతమైన భవనం నిర్మించబడింది.. ఇది దేశానిది.. ఇది బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ కార్యాలయం కాదు.. పార్లమెంట్ నూతన భవన ప్రారంభోత్సవంలో మాజీ ప్రధానిగా, ఒక దేశ పౌరుడిగా నేను హాజరవుతా అని దేవేగౌడ స్పష్టం చేశారు. రాజకీయంగా బీజేపీని వ్యతిరేకించడానికి తనకు చాలా కారణాలు ఉన్నాయని, పార్లమెంటు భవనాన్ని ప్రారంభించే విషయంలో రాజకీయాలు తీసుకురావడం నాకు ఇష్టం లేదని అన్నారు. ప్రస్తుతం తాను రాజ్యసభ సభ్యుడిగా ఉన్నానని, పార్లమెంట్ ఉభయసభలకు ఎన్నికయ్యానని ఆయన అన్నారు. రాజ్యాంగ విలువలను కాపాడేందుకు నేను పనిచేశాను.. కాబట్టి రాజ్యాంగం విషయంలో రాజకీయాలను తీసుకురాలేనని ఆయన అన్నారు.
ప్రస్తుతం కాంగ్రెస్ తో పాటు డీఎంకే, ఆప్, ఎన్సీపీ, శివసేన ఉద్దవ్, టీఎంసీ వంటి మొత్తం 21 ప్రతిపక్ష పార్టీలు ఈ కార్యక్రమాన్ని బహిష్కరించాయి. రాష్ట్రపతిని కాదని ప్రధాని నరేంద్రమోడీ పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించడంపై విపక్షాలు మండిపడుతున్నాయి. ఇది రాష్ట్రపతిని అవమానపరచడమే అని విమర్శిస్తున్నాయి. మే 28న ప్రధాని నరేంద్రమోడీ కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించనున్నారు.