Vande Bharat Trains: భారతీయ రైల్వేలను ఆధునీకీకరించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం వందేభారత్ రైళ్లను ప్రారంభించింది. సెమీ హైస్పీడ్ ట్రైన్ గా ఇప్పటికే పలుమార్గాల్లో ఈ రైల్ ప్రారంభం అయింది. ఇదిలా ఉంటే వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చి నాటికి 3 రకాల వందే భారత్ ట్రైన్లను తీసుకువస్తున్నట్లు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. శతాబ్ధి రాజధాని, లోకల్ ట్రైన్ల స్థానంలో వీటిని తీసుకురానున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ స్వదేశీ సెమీ హైస్పీడ్ ట్రైన్లను చెన్నైలోని ఇంటిగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీలో తయారు చేస్తున్నట్లు వెల్లడించారు.
వచ్చే మూడు నాలుగు ఏళ్లలో వందేభారత్ గరిష్ట వేగాన్ని గంటకు 160 కిలోమీటర్లు చేస్తామని, దీని కోసం ట్రాక్ అప్ గ్రేడ్ చేస్తామని తెలిపారు. వందేభారత్ రైళ్లు 3 ఫార్మాట్లలో రానున్నట్లు తెలిపారు. వంద కిలోమీటర్ల లోపు వందే మెట్రో, 100-550 కిలోమీటర్లకు వందే చైర్ కార్, 550 కిలోమీటర్ల కంటే ఎక్కువ ప్రయాణానికి వందే స్లీపర్స్ రైళ్లను తీసుకు రాబోతున్నట్లు చెప్పారు.
Read Also: UPSC Exam: ఒకే పేరు, ఒకే రోల్ నెంబర్, ఒకే ర్యాంకు.. సివిల్స్ ఫలితాల్లో మిస్టరీగా మారిన ఉదంతం..
వార్తా సంస్థ పిటిఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మంత్రి మాట్లాడుతూ, వచ్చే మూడు, నాలుగు సంవత్సరాలలో వందే భారత్ రైళ్ల గరిష్ట వేగానికి 160 కి.మీల వేగంతో రైల్వే ట్రాక్‌లను అప్‌గ్రేడ్ చేస్తామని చెప్పారు. ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్ నుండి ఢిల్లీలోని ఆనంద్ విహార్ టెర్మినల్ రైల్వే స్టేషన్ వరకు వందే భారత్ రైలును ప్రారంభించిన తర్వాత వైష్ణవ్ అన్నారు. ఢిల్లీ-డెహ్రాడూన్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రధాని నరేంద్ర మోదీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ రైలు దేశ రాజధాని ఢిల్లీ, ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్ మధ్య నడుస్తుంది. ప్రయాణ సమయాన్ని ఆరు గంటల 10 నిమిషాల నుంచి నాలుగున్న గంటలకు తగ్గుతుంది.
జూన్ మధ్య నాటికి ప్రతీ రాష్ట్రానికి వందేభారత్ రైలు వస్తుందని అశ్విని వైష్ణవ్ అన్నారు. వందేభారత్ రైళ్లు గంటకు 160 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తగలవు. అయితే ప్రస్తుతం మన రైల్వే ట్రాకుల కెపాసిటీ 130 కిలోమీటర్ల మాత్రమే. 30,000-35,000 కిలోమీటర్ల ట్రాకులను 110 kmph, 130 kmph, 160 kmph అప్ గ్రేడ్ చేస్తామని తెలిపారు. సరిహద్దు ప్రాంతాలకు రైలు కనెక్టివిటీ ప్రాజెక్టులపై రైల్వే శాఖ వేగంగా పని చేస్తోందని మంత్రి తెలిపారు. రైలు ప్రయాణికులకు 4G-5G సేవలను అందించడానికి కూడా చర్యలు తీసుకుంటున్నట్లు వైష్ణవ్ తెలిపారు.