ముఖేష్ అంబానీ పెద్ద కుమారుడు ఆకాష్ అంబానీ 65 ఏళ్ల బిలియనీర్ వారసత్వ ప్రణాళికగా భావించే రిలయన్స్ ఇండస్ట్రీస్ యొక్క డిజిటల్ విభాగం అయిన జియో ఇన్ఫోకామ్ బోర్డు ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రపంచంలోనే సంపన్న వ్యాపారవేత్తల్లో ఒకరైన ముకేశ్ అంబానీ దేశంలోనే అతిపెద్ద కార్పొరేట్ సంస్థ రిలయన్స్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్న సంగతి తెలిసిందే. అయితే.. రూ.16 లక్షల కోట్లకు పైగా విలువ గల వ్యాపార సామ్రాజ్యాన్ని తదుపరి తరానికి అప్పగించే ప్రక్రియ వేగవంతమైనట్లు కనిపిస్తోంది. రిలయన్స్ వ్యవస్థాపకుడు ధీరుభాయి అంబానీ మరణం తర్వాత సోదరుడు అనిల్ అంబానీతో మాదిరిగా వాటాల పంపిణీకి తన కొడుకులు, కూతుళ్ల మధ్య వివాదం తలెత్త వద్దని ముకేశ్ అంబానీ ముందుచూపుతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
అందులో భాగంగా రిలయన్స్ జియో డైరెక్టర్‌గా ముకేశ్ అంబానీ రాజీనామా చేశారు. ఆయన పెద్ద కుమారుడు ఆకాశ్ అంబానీని రిలయన్స్ జియో చైర్మన్‌గా నియమిస్తూ జియో డైరెక్టర్ల బోర్డు ఆమోద ముద్ర వేసింది. దీంతో.. రిలయన్స్ జియో మేనేజింగ్ డైరెక్టర్‌గా పంకజ్ మోహన్ పవార్ బాధ్యతలు స్వీకరించనున్నారు. సోమవారం జరిగిన జియో బోర్డు సమావేశంలో రమీందర్ సింగ్ గుజ్రాల్, కేవీ చౌదరిలను సంస్థ అదనపు డైరెక్టర్లు నియమిస్తూ తీర్మానం ఆమోదించింది. వారు 2022 జూన్ 27 నుంచి ఐదేండ్ల పాటు అదనపు డైరెక్టర్లుగా కొనసాగుతారు. మంగళవారం రిలయన్స్ షేర్లు 1.49 శాతం పుంజుకుని రూ.2,529 వద్ద ముగిశాయి.