Delhi Elections 2025: త్వరలో జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను భారత ఎన్నికల సంఘం (ఈసీ) ఈరోజు (జనవరి 7) ప్రకటించనుంది. నేటి మధ్యాహ్నం 2 గంటలకు విజ్ఞాన్ భవన్‌లో ఎలక్షన్ కమిషన్ విలేకరుల సమావేశం నిర్వహించి.. ఎన్నికల తేదీల వివరాలను వెల్లడిస్తుంది. 70 అసెంబ్లీ స్థానాలున్న ఢిల్లీకి ఈ ఏడాది ఫిబ్రవరి 23తో గడువు ముగియబోతుంది. ఆలోపే ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. అంటే వచ్చే నెల మొదటి వారంలో ఢిల్లీలో పోలింగ్ జరిగే అవకాశం ఉంది. గతంలో 2020 ఫిబ్రవరి 8వ తేదీన ఓటింగ్ జరగ్గా అదే నెల 11న తుది ఫలితాలను ఈసీ వెల్లడించింది. సాధారణంగా ఇక్కడ ఒకే దశలో ఎన్నికలు నిర్వహిస్తారు.
Read Also: Champions Trophy 2025: భారత జట్టులోకి ముగ్గురు రీ ఎంట్రీ!
కాగా, ప్రస్తుత అసెంబ్లీలో అధికార ఆమ్ ఆద్మీ పార్టీకి 62 మంది ఎమ్మెల్యేలు ఉండగా.. భారతీయ జనతా పార్టీ సంఖ్యాబలం 8గా ఉంది. ఇక, 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న ఆప్.. వచ్చే ఎన్నికల్లో మరోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తుండగా.. అటు ఆమ్ ఆద్మీ పార్టీని అడ్డుకుని కేంద్ర పాలిత ప్రాంతంలో అధికారంలోకి రావాలని బీజేపీ ప్లాన్ చేస్తుంది. ఇప్పటికే ఆప్ 70 మంది అభ్యర్థులను ప్రకటించింది. ఇక, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కూడా కొన్ని స్థానాలకు క్యాండిడెట్స్ పేర్లను వెల్లడించాయి.