ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం కానుంది. ఈ టోర్నీ కంటే ముందు భారత్ స్వదేశంలో ఇంగ్లండ్‌తో పరిమిత ఓవర్ల క్రికెట్ ఆడనుంది. ఇంగ్లండ్‌తో ఐదు టీ20లు, మూడు వన్డేలు టీమిండియా ఆడనుంది. ఈ రెండు సిరీస్‌లకు బీసీసీఐ సెలెక్టర్లు త్వరలోనే జట్లను ప్రకటించనున్నారు. ప్రతిష్టాత్మక ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేసే జట్టునే.. ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో ఆడించే అవకాశాలు ఉన్నాయి. ఈ రెండు సిరీస్‌లలో కొన్ని నెలలుగా భారత జట్టుకు దూరంగా ఉన్న ముగ్గురు రీ ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.
హార్దిక్ పాండ్యా, శ్రేయస్ అయ్యర్, అర్ష్‌దీప్ సింగ్‌లు ఇంగ్లండ్ వన్డే సిరీస్‌కు ఎంపిక అవుతారని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ముగ్గురు విజయ్ హజారే ట్రోఫీలో ఆడుతున్నారు. మంచి ఫామ్ మీదున్నారు కూడా. ఇటీవల దేశవాళీ క్రికెట్‌లో శ్రేయస్ అద్భుతంగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం జనవరి 12 వరకు ప్రొవిజనల్ జట్లను ప్రకటించాల్సి ఉంది. అయితే ఫిబ్రవరి 13 వరకు జట్టులో మార్పులు చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇటీవల వరుసగా విఫలమవుతున్న రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల ఎంపికపై అందరి దృష్టి నెలకొంది.
ప్రస్తుతం వెన్ను నొప్పితో బాధపడుతున్న ఫాస్ట్‌బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఇంగ్లండ్ సిరీస్‌కు దూరమయ్యే అవకాశముంది. పనిభారం దృష్ట్యా అతడికి రెస్ట్ ఇవ్వనున్నారు. ఆస్ట్రేలియా పర్యటనలో బుమ్రా 151 ఓవర్లు వేశాడు. మెల్‌బోర్న్ టెస్టులో ఏకంగా 53.2 ఓవర్లు బౌలింగ్ చేశాడు. ఇంగ్లండ్ సిరీస్‌కు రెస్ట్ ఇచ్చి.. ఛాంపియన్స్ ట్రోఫీల ఆడించాలని మేనేజ్మెంట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు అతడిని వైస్ కెప్టెన్‌గా నియమిస్తారని సమాచారం. ఇక ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్ జనవరి 22 నుంచి, వన్డే సిరీస్ ఫిబ్రవరి 6 నుంచి ప్రారంభం కానున్నాయి.