Karnataka Election Results: సంప్రదాయంగా బీజేపీకి అండగా నిలుస్తున్న లింగాయత్ వర్గం ఈ సారి ఆ పార్టీని కోలుకోలేని దెబ్బతీసింది. బీజేపీ చివరి నిమిషంలో రిజర్వేషన్లు ప్రకటించినా కూడా లింగాయల్ వర్గంలో ఉన్న అసంతృప్తిని అణచలేకపోయారు. ఫలితంగా బీజేపీకి గట్టి పట్టున్న స్థానాల్లో కూడా ప్రభుత్వంపై వ్యతిరేకత కారణంగా మెజారిటీ స్థానాలను కోల్పోవాల్సి వస్తుంది. తాజాగా ఈ రోజు వెలువడిన ఎన్నికల్లో ట్రెండ్స్ ను పరిశీలిస్తే ఇదే అర్థం అవుతుంది.
కర్ణాటకలో మొత్తం 224 అసెంబ్లీ స్థానాలు ఉంటే ప్రస్తుతం కాంగ్రెస్ ఏకంగా మ్యాజిక్ ఫిగర్ 113ని దాటి 136 స్థానాల్లో గెలుపును దాదాపుగా ఖారారు చేసుకుంది. బీజేపీ 64 స్థానాలకు మాత్రమే పరిమితం అయింది. ఇక కింగ్ మేకర్ అవుదాం అనుకున్న జేడీఎస్ మాత్రం దారుణంగా విఫలం అయింది. కేవలం ఆ పార్టీ 20 స్థానాల్లో మాత్రమే ప్రభావితం చూపించింది.
Read Also: BJP: బీజేపీకి గెలుపోటములు కొత్త కాదన్న యెడ్డీ… లోక్‌సభ ఎన్నికల్లో పుంజుకుంటామన్న బొమ్మై
ఇదిలా ఉంటే కర్ణాటక జనాభాలో లింగాయత్, వొక్కలిగ వర్గాలు ఎన్నికల్లో ప్రభావం చూపిస్తుంటాయి. ముఖ్యంగా బీజేపీకి మొదటి నుంచి లింగాయత్ వర్గం వెన్నుదన్నుగా నిలుస్తోంది. అయితే వొక్కలిగలు జేడీయూకు అండగా ఉంటున్నా.. ఈ సారి మాత్రం కాంగ్రెస్ వైపు మొగ్గుచూపినట్లు తెలుస్తోంది. కన్నడ ప్రజల్లో 17 శాతం ఉన్న లింగాయత్ లు 78 స్థానాల్లో ప్రభావం చూపిస్తారు. అయతే ఈ సారి ఈ స్థానాల్లో 54 చోట్ల కాంగ్రెస్ ఆధిక్యంలో ఉండగా.. బీజేపీ కేవలం 19 స్థానాలకే పరిమితం అయింది. లింగాయత్ ఆధిపత్య స్థానాలపై బీజేపీ స్కోరు 28కి పడిపోయిందని, కాంగ్రెస్ 29 లాభపడ్డాయని కూడా ట్రెండ్స్ చూపిస్తున్నాయి.
లింగాయత్ వర్గానికి చెందిన యడియూరప్పను బలవంతంగా సీఎం కుర్చీ నుంచి దించడం, జగదీష్ పెట్టర్ వంటి బీజేపీ నేతను పార్టీ నుంచి బయటకు పంపేలా చేయడం బీజేపీని దెబ్బతీసింది. సీఎం బొమ్మై ఆ వర్గానికి చెందిన వ్యక్తి అయినా కూడా పెద్దగా ప్రభావం చూపలేదు. ఎన్నికలకు కొన్ని రోజుల ముందు మార్చి నెలలో ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్ రద్దు చేసి, లింగాయత్ లకు 2, వొక్కలిగలకు 2 శాతం కేటాయిస్తూ బీజేపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ప్రస్తుతం ఇది సుప్రీంకోర్టులో ఉంది. ఈ పాచిక కూడా బీజేపీ విజయానికి దోహదపడలేదు.