Maharashtra: లోక్‌సభ ఎన్నికల్లో దారుణంగా విఫలమైన బీజేపీ నేతృత్వంలోని ‘మహయుతి’ కూటమి మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ముందు భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. కూటమిలో భాగమైన బీజేపీ, శివసేన(షిండే), ఎన్సీపీ(అజిత్ పవార్) కలిసి రాష్ట్ర శాసన మండలి ఎన్నికల్లో సత్తా చాటాయి. 11 ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ కూటమి మొత్తం 09 స్థానాలను కైవసం చేసుకోగా, కాంగ్రెస ఒక స్థానంలో విజయం సాధించింది.
రాష్ట్ర శాసనసభ ఎగువ సభలోని 11 స్థానాలకు మొత్తం 12 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. అసెంబ్లీలోని ఎమ్మెల్యేల సంఖ్య 288, అయితే 274 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. వీరు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటేశారు. ఒక అభ్యర్థి గెలవడానికి 23 ప్రాధాన్యత ఓట్లు అవసరం. శాసన మండలి ఎన్నికల్లో ముగ్గురు బిజెపి నాయకులు పంకజా ముండే, పరిణయ్ ఫుకే , యోగేష్ తిలేకర్‌లు ఒక్కొక్కరు 26 ఓట్లు సాధించి విజయం సాధించారు. అజిత్ పవార్ పార్టీకి చెందిన రాజేష్ విటేకర్ మరియు శివాజీరావు గార్జే గెలుపొందారు. షిండే సేనకు చెందిన భావనా గావ్లీ కూడా గెలిచారు.
Read Also: Tragic Incident: ఏం కష్టమొచ్చిందో.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య
మహారాష్ట్ర అసెంబ్లీలో మహాయుతికి 201 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. తొమ్మిది మంది ఇండిపెండెంట్లు కూడా మహాయుతికి సపోర్ట్ చేశారు. ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీకి కేవలం 67 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. ఆరుగురు ఎమ్మెల్యేలు తటస్థంగా ఉన్నట్లు ప్రకటించారు.
ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ కూటమి ఘోరంగా దెబ్బతింది. 48 ఎంపీ సీట్లున్న ఆ రాష్ట్రంలో ఎన్డీయే కేవలం 17 స్థానాలను మాత్రమే గెలుచుకుంది. కాంగ్రెస్, శివసేన(ఠాక్రే), ఎన్సీపీ(శరద్ పవార్)ల మహావికాస్ అఘాడీ ఏకంగా 30 స్థానాలను కైవసం చేసుకున్నాయి. ఈ ఏడాది చివర్లో మహారాస్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో లోక్‌సభ ఫలితాలు ఎన్డీయేని నిరాశ పరిచాయి. అయితే, ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికలతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చింది.