Karnataka: కర్ణాటక హుబ్బళ్లిలో 5 ఏళ్ల చిన్నారిపై అత్యాచారయత్నం చేసి, బాలిక గొంతు నులిమి హత్య చేసిన నిందితుడిని పోలీసులు ఎన్‌కౌంటర్ చేసి హతమార్చారు. నిందితుడిని బీహార్ రాష్ట్రానికి చెందిన నితేష్ కుమార్‌గా గుర్తించారు. పోలీసులతో జరిగిన ఘర్షణ తర్వాత ఈ ఎన్‌కౌంటర్ చోటు చేసుకుంది. నిందితుడిని అరెస్ట్ చేసే క్రమంలో ప్రతిఘటించడంతో పోలీసులు కాల్చి చంపాల్సి వచ్చింది. నిందితుడు బాలికను ఒక షెడ్‌లోకి తీసుకెళ్లి అత్యాచారానికి యత్నించాడు. అయితే, బాలిక అరుపులు విన్న స్థానికులు షెడ్ వైపు వెళ్లారు. ఆ సమయంలో బాలిక గొంతు నులిమి చంపేసి అక్కడి నుంచి పారిపోయాడు. ఇంటి ముందు ఆడుకుంటున్న బాలికను నిందితుడు ఎత్తుకెళ్లినట్లుగా సీసీటీవీలో రికార్డైంది.
35 ఏళ్ల నిందితుడు నితేష్ కుమార్, పోలీసులపై దాడి చేశాడు, హెచ్చరిక కాల్పులు జరిపినప్పటికీ పారిపోవడానికి ప్రయత్నించాడని పోలీసులు తెలిపారు. నిందితుడిపై పోక్సో కేసుతో పాటు హత్య, అత్యాచారం కేసు నమోదైంది. నితేష్ స్వస్థలం బీహార్‌లోని పాట్నా. నిందితుడి గుర్తింపుని నిర్ధారించడానికి అతడి స్వస్థలం తీసుకెళ్తుండగా పోలీసులపై దాడి చేసినట్లు హుబ్బళ్లి పోలీస్ చీఫ్ శశికుమార్ మీడియాకు తెలిపారు.
Read Also: Nithin : నితిన్ కు రూ.75 లక్షలు ఇస్తే హ్యాండ్ ఇచ్చాడు.. నిర్మాత సంచలనం..
సబ్ ఇన్‌స్పెక్టర్ అన్నపూర్ణ నిందితుడి పైకి రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. ఈ ప్రక్రియలో ఒక పోలీస్ వాహనం కూడా ధ్వంసమైందని, కాల్పుల అనంతరం అతడిని వెంటనే ఆస్పత్రికి తరలించామని, అప్పటికే అతడు చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించినట్లు శశికుమార్ చెప్పారు.
నితేష్ కుమార్ బాలికను కిడ్నాప్ చేసి, లైంగిక వేధింపులకు గురిచేసి హత్య చేసిన సంఘటన హుబ్బళ్లిలో ఉద్రిక్తతకు కారణమైంది. న్యాయం కోసం పెద్ద ఎత్తున నివాసితులు ఆందోళన చేశారు. బాధిత బాలిక కుటుంబ కొప్పల్ జిల్లాకు చెందినది. ఆమె తల్లి ఇళ్లలో పనిచేస్తూ, బ్యూటీపార్లర్‌లో సహాయకురాలిగా పనిచేస్తుండగా, తండ్రి పెయింటర్‌గా పనిచేస్తున్నాడు. బాలిక తల్లి స్థానిక ఇళ్లలో పనిచేస్తున్న క్రమంలో తన కూతురిని కూడా తీసుకెళ్లింది. అక్కడే బాలికను నిందితుడు కిడ్నాప్ చేశాడు. బాలిక కోసం వెతకగా ఒక షెడ్‌లోని బాత్‌రూంలో శవంగా కనిపించింది.