The Kerala Story: దేశవ్యాప్తంగా సంచలనాలు సృష్టించిన ‘ది కేరళ స్టోరీ’ సినిమా కలెక్షన్లలో దూసుకుపోతోంది. ఇప్పటికే బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు ఈ సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. మధ్యప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాలు సినిమాకు పన్ను మినహాయింపు ఇచ్చాయి. ఇదిలా ఉంటే తమిళనాడు, పశ్చిమబెంగాల్ వంటి రాష్ట్రాలు సినిమా ప్రదర్శనను బ్యాన్ చేశాయి. పలువురు సీఎంలు, మంత్రులు ఈ సినిమాను చూస్తున్నారు.
తాజాగా అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ సర్మ గురువారం తన క్యాబినెట్ మంత్రుల, బీజేపీ ఎమ్మెల్యేలతో కలిసి సినిమాను చూశారు. చిత్ర బృందాన్ని ప్రశంసించారు. ముఖ్యంగా తల్లిదండ్రులు వారి కుమార్తెలతో సినిమాను చూడాలని కోరారు. ‘ది కేరళ స్టోరీ’ తీవ్రవాదం గురించి, జీహాద్, మతం పేరుతో ఉగ్రవాద శిబిరాల్లో ఏం జరుగుతుందో వెలుగులోకి తీసుకువచ్చిందని ఆయన అన్నారు. అమాయక మహిళలను తీవ్రవాద గ్రూపులు పావుగా ఉపయోగించుకున్న విధానాన్ని సినిమాలో చూపించారని అన్నారు. అమాకమైన కేరళ ప్రజల్లో కొంతమంది ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్నారని, కేరళీయుల వారి గళాన్ని వినిపించాలని ఆయన అన్నారు.
Read Also: Imran Khan: ఇమ్రాన్ అరెస్ట్ అక్రమం.. వెంటనే విడుదల చేయండి.. పాక్ సుప్రీంకోర్టు ఆదేశం
అస్సాం రాష్ట్రంలో అమ్మాయిలు ఉగ్రవాదంలో చేరిన కేసులు లేవని, అయితే ప్రేమ పేరుతో మతం మార్చిన సందర్భాలు ఉన్నాయని అన్నారు. ధర్మాన్ని రక్షించండి, నాగరికతను రక్షించడం, తద్వారా ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపవచ్చని సూచించారు. ‘ ది కేరళ స్టోరీ’ సినిమాను ఆడపిల్లలతో కలిసి భారత దేశ ప్రజలు చూడాలని విజ్ఞప్తి చేశారు. ఇది ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐసిస్) గురించి చెబుతుందని, ముస్లింలకు వ్యతిరేకం కాదని అన్నారు.
ఓ వైపు కాంగ్రెస్, కమ్యూనిస్టులు, డీఎంకే, టీఎంసీ వంటి పార్టీలు ఈ సినిమాను వ్యతిరేకిస్తుండగా.. బీజేపీ, హిందూ సంఘాలు మాత్రం ప్రశంసిస్తున్నాయి. కేరళలో మతమార్పిడులు, ఉగ్రవాదంలో చేరిన అమ్మాయిల ఇతివృత్తం ఆధారంగా సినిమాను రూపొందించారు. 35,000 అమ్మాయిలను మతం మార్చారని ట్రైలర్ లో చెప్పడం వివాదాస్పదం అయింది. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఏకంగా ఈ సినిమాను ఆర్ఎస్ఎస్, బీజేపీల అబద్ధపు ప్రచారమని విమర్శించారు.